Ministers Visit Villages : కొత్త ఏడాది నుంచి మంత్రులు గ్రామ బాట పట్టనున్నారు. వరుసగా గ్రామ పంచాయితీల్లో డ్రైవ్ కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామ పంచాయితీ కవర్ అయ్యేలా మంత్రుల షెడ్యూల్స్ రూపొందిస్తున్నారు. కొత్త సంవత్సరం నుంచి గ్రామాల్లో హాడావిడి చేస్తూ సంక్షేమం, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొత్త సర్పంచ్ లతో శంకుస్థాపనలు, క్షేత్రస్థాయిలో మీటింగ్స్ నిర్వహించడం వలన పార్టీ మైలేజ్ పెరుగుతుందని అగ్రనేతలు భావిస్తున్నారు. దీంతోనే మంత్రులు గ్రామాల్లో డ్రైవ్ చేయాలని భావిస్తున్నారు. తద్వారా పాలనను ప్రజల ముంగిటకే తీసుకువెళ్లినట్లు అవుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రతి గ్రామ పంచాయితీని కవర్ చేస్తూ, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే పరమావధిగా ఈ ‘మంత్రుల డ్రైవ్’ సాగనున్నది.
సమస్యల జల్లెడ..
పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు, ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను మంత్రులు సందర్శించనున్నారు. కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా, అక్కడే ఉండి ప్రజల వినతులను స్వీకరించేలా ప్రణాళికలు రూపొందించారు.గ్రామాల్లో సమస్యలు, పరిష్కారం, సర్కార్ స్కీమ్స్, కొత్త ప్రోగ్రామ్ లు, డెవలప్ మెంట్ ప్లానింగ్ తో పాటు సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించనున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను ప్రోత్సహిస్తూ, వారి ఆధ్వర్యంలోనే గ్రామీణ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పథకాలకు మంత్రులు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామ సభలు నిర్వహించి, స్థానిక సమస్యలపై తక్షణమే స్పందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.ఇక ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి గ్రామాలను ఎలా తీర్చిదిద్దాలో మంత్రులు దిశానిర్దేశం చేయనున్నారు. పారిశుధ్యం, వీధి దీపాలు, స్థానిక పాఠశాలల స్థితిగతులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రభుత్వ లక్ష్యం పల్లెల వికాసమేనని, ప్రతి గడపకూ పాలనను చేరవేసి, కొత్త ఏడాదితో గ్రామాల్లో అభివృద్ధి కొత్త కాంతులు నింపడమేనని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు.
Also Read; Delhi Murder Suicide: దేశంలో మరో ఘోరం.. సిగరేట్‌కు రూ.20 ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త
ప్రజాపాలన మరింత సులువుగా..
ఇటీవల సర్పంచ్ లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో అత్యధిక మంది విద్యావంతులైన యువతే ఉన్నారు. దీంతో సమస్యలను పసిగట్టడం, సొల్యూషన్ చూపించడం పెద్దకష్టమేమీ కాదనే భావనలో సర్కార్ ఉన్నది. అంతేగాక గ్రామ అభివృద్ధిపై వారికి స్పష్టమైన అవగాహన, ప్లానింగ్ ఉంటుందని, దీంతో ప్రజాపాలనను మరింత సులువుగా ముందుకు తీసుకువెళ్లవచ్చని ఓ సీనియర్ మంత్రి తెలిపారు. ఇప్పటికే గ్రామ పంచాయితీల్లో లైటింగ్ తో పాటు స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు గ్రామాల్లో మొదలయ్యాయి. మరి కొద్ది రోజుల్లోనే సీసీ రోడ్లు, డ్రైనేజ్, తాగు నీరుకు స్పష్టమైన ప్లానింగ్స్ ను రూపొందించనున్నారు.
Also Read: Kalaga Kathaga: ‘ఛాంపియన్’ నుంచి మనసును మీటే మెలోడీ ‘కలగా కథగా’ లిరికల్ వీడియో వచ్చేసింది..

