Endowments Department: ఆ శాఖ కు పూర్తి స్థాయి డైరెక్టర్లు లేకపోవడం, ఇన్ చార్జులతో కాలం వెల్లదీస్తుండటంతో అభివృద్ధి కుంటుపడుతుంది. ఎవరు కమిషనర్ గా వచ్చినా అదనపు బాధ్యతలతోనే విధులు నిర్వహిస్తుండటం, దానికి తోడు రెండు మూడు నెలలు మాత్రమే పనిచేస్తూ బదిలీ లేకుంటే ఉద్యోగ విరమణ చేస్తుండటం గమనార్హం. దీంతో పూర్తిస్థాయిలో శాఖపై దృష్టిసారించకపోవడంతో దేవాదాయశాఖ దీనస్థితికి చేరుతుంది.
గత 22 నెలల్లోనే 6గురు డైరెక్టర్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయశాఖ(Endowment Department) పై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఆలయాల జీవనోద్దరణకు, పెండింగ్ పనులు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపడుతుంది. అయితే దేవాదాయశాఖకు గత 22 నెలల్లోనే 6గురు డైరెక్టర్లు విధులు నిర్వహించారు. ఎం. హనుమంతరావు(M Hanumantha Rao)(ఏప్రిల్-2024), హనుమంతు కొండింబా(2024అక్టోబర్ 28), ఈ. శ్రీధర్(11నవంబర్ 2024), వెంకట్రావు(Venkat Rao)(2025ఏప్రిల్ 30), శైలజారామయ్యార్(Sailajaramaiyar)(22సెప్టెంబర్ 2025), ఎస్.హరీష్(S Harish)(22 సెప్టెంబర్ 2025 నుంచి). అయితే ఎవరు కూడా ఎక్కువ కాలం పనిచేయకపోవడంతో అధికారులు పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టడంలేదు. అభివృద్ధి పనులుముందుకు సాగడం లేదు. పర్యవేక్షణ లేకపోవడంతో పనులు పెండింగ్ లో పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఏళ్ల తరబడి మోక్షం..
దేవాదాయశాఖ భూములపై డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన వారు తక్కువ కాలపరిమితితో కొనసాగుతుండటంతో పాటు అదనపు బాధ్యతలతో వస్తుండటంతో ఫోకస్ పెట్టడం లేదు. రెండు నుంచి మూడు శాఖల విధులు ఉండటంతో సమీక్షలు సైతం చేయడం లేదని, చేసినా నామ్ కే మాత్రంగా చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. భూములు ఆక్రమణకు గురికాకుండా చేపట్టాల్సిన అంశాలు కొలక్కి వచ్చే సమయంలో డైరెక్టర్లుగా పనిచేసిన వారు రిటైర్మెంట్ కావడం, లేకుంటే మరోశాఖకు బదిలీ కావడంతో మళ్లీ మొదటికి వస్తుంది. దీంతో భూములకు సంబంధించిన ఫైల్స్ కు ఏళ్ల తరబడి మోక్షం కలుగడం లేదని సమాచారం. వీటన్నింటికి తోడు విధాన పరమైన నిర్ణయాల్లోనూ జాప్యం జరుగుతుందని శాఖ ఉద్యోగులే పేర్కొంటున్నారు.
Also Read: Nepotism: నెపోటిజం అంటే ఏమిటి?.. టాలీవుడ్‌లో అది ఎంతవరకూ ఉందంటే?
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు..
ఇది ఇలా ఉంటే డైరెక్టర్లు గా వచ్చినవారికి శాఖపై పూర్తిగా పట్టులేకపోవడంతో కిందిస్థాయి అధికారులు ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలను ఇష్టారాజ్యంగా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎవరికి నచ్చినవారికి సీనియార్టీతో సంబంధం లేకుండానే ఫైల్స్ కదులుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా అవుట్ సోర్సింగ్(Outsourcing) లో పనిచేస్తున్న సిబ్బందిపై చిన్నచిన్న కారణాలతో వేతనాలు నిలిపివేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఉన్నాయి. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న ఘటనలు ఉన్నట్లు సమాచారం.
పోస్టుల భర్తీపై ఫోకస్..
శాఖ కు డైరెక్టర్ గా నియమకం కావాలంటే 45 ఏళ్ల నిబంధన దేవాదాయశాఖలో ఉంది. ఇది సైతం అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. శాఖ కు డైరెక్టర్ గా వచ్చేవారు రిటైర్మెంట్ సమయంలో వస్తున్నారని దీంతో ఆలయాల అభివృద్ధి ముందుకు సాగడం లేదని, మౌలిక సౌకర్యాల కల్పనపై సైతం పూర్తిస్థాయిలో దృష్టిసారించకలేకపోతున్నారని సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిబంధనను సడలించడంతో పాటు శాఖకు పూర్తిస్థాయిలో డైరెక్టర్ ను నియమిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై సైతం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Gaddam Prasad Kumar: నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ
