Fraud in Sports Board: క్రీడా ప్రాంగణాల పేరుతో లక్షలరూపాయలు స్వాహా చేశారు. ఆ ప్రాంగణాల్లో ఎలాంటి క్రీడా పరికరాలు ఏర్పాటు చేయలేదు.. కేవలం బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. కానీ క్రీడా ప్రాంగణాల పేరుతో రూ.5 లక్షల నుంచి 6 లక్షల వరకు స్వాహా చేశారు. అంతేకాదు అర్బన్ ప్రాంతాల్లో ఒకటిరెండు చోట్ల ఏర్పాటు చేసినా అక్కడ కోచ్ లను నియమించలేదు. ఆ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపిస్తుందా? బాధ్యులపై చర్యలు తీసుకుంటుందా? లేకుంటే చూసి చూడనట్లు వ్యవహరిస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: Teachers Protest: మా సమస్య ప్రభుత్వానికి చెప్పు.. పట్టించుకునేలా చెయ్.. గణపయ్యకు వినతి పత్రం
గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంత యువతను క్రీడలవైపు ప్రోత్సాహించాలని, వారిలో దాగి ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికి తీయాలనే సదుద్దేశ్యంతో ప్రతీ గ్రామంలో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసింది. వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని భావించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేయగా అందుకు నిధులు మంజూరు చేసింది. దీంతో జిల్లాలోని గ్రామాలు, ఆవాసాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం లక్ష్యం అనుకున్న స్థాయిలో నెరవేరలేదు. కోట్లలో నిధులు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు, పట్టణాల్లో రూ.6లక్షల వరకు ఖర్చు చేయగా, ప్రస్తుతం అవి వృథాగా దర్శనమిస్తున్నాయి.
30వేలు ఖర్చు చేసి ఏర్పాటు
ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ పర్యవేక్షణ కొరవడింది. దీంతో ప్రాంగణాలు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు ఆడిందే ఆటపాడిందే పాటగా మారింది. అంతేకాదు కొన్ని గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, గత ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు ఆ ప్రాంగణాల ఏర్పాటు బాధ్యతను తీసుకున్నారు. అయితే ఆ ప్రాంగణాల్లో కనీసం ఆటలకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేయలేదు. కబడ్డీ, ఖోఖో, షెటల్ కోర్టు, వాలీబాల్ కోర్టు ఇలా వేటిని ఏర్పాటు చేయలేదు. కానీ క్రీడా ప్రాంగణాల బోర్డు కోసం మాత్రం 30వేలు ఖర్చు చేసి ఏర్పాటు చేశారు. అది ఒక్కటి మాత్రమే దర్శనమిస్తుంది. ఆ ప్రాంగణాలు ఆచరణ లేకపోవడంతో క్రీడాకారులకు ఉపయోగం లేని పరిస్థితి తలెత్తింది. మైదానాలు ఏర్పాటు చేసినా ఆ ప్రాంగణాల్లో మౌలిక వసతులు, క్రీడా పరికరాలు, సామగ్రి లేకపోవడం వల్ల ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి.
పరికరాల ఊసేలేదు.
మరోవైపు దాదాపు 80శాతం వరకు ఊరికి దూరంగా, శ్మశాన వాటికల పక్కన, పొలాల మధ్య ఏర్పాటు చేశారు. మరికొన్నింటిని స్కూళ్లకే క్రీడాప్రాంగణమని బోర్డు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క క్రీడా పరికరం లేదు. అంతేకాదు పీఈటీ ని గానీ పీడీగానీ నియమించలేదు. కేవలం నామకే వాస్తేగా బోర్డు ఏర్పాటు చేసి మమ అనిపించారు. క్రీడా ప్రాంగణాల బోర్డులు చూసి త్వరలో క్రీడా సామగ్రి, పరికరాలు వస్తాయని క్రీడాకారులు ఆశించారు. రెండేళ్లు దాటుతున్నా, ఏ క్రీడా ప్రాంగణంలోనూ పరికరాల ఊసేలేదు. కొన్ని ప్రాంతాల్లో ఉపయోగం లేని చోట మట్టిపోసి వాలీబాల్ ఆడేందుకు అవసరమైన స్తంభాలను మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రన్నింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్టు, యువత కసరత్తులు చేసేందుకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలి. కానీ, దానికి విరుద్దంగా క్రీడాప్రాంగణాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఇది వరకే క్రీడా మైదానాలు ఉండగా, అక్కడే తూతూమంత్రంగా మట్టిపోసి బోర్డులు ఏర్పాటు చేసి నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.
ప్రభుత్వంపై ఆశలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్రీడలపై ప్రత్యేక దృష్టిసారించింది. అందుకోసం క్రీడా పాలసీని రూపొందించింది. అయితే గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరూపయోగంగా మారాయి. పరికరాలు లేకపోవడం, శిక్షకులు సైతం లేకపోవడంతో యువతకు క్రీడలు దూరమవుతున్నాయి. అంతేకాదు కొన్నింటిలో చెట్లు మొలిచాయి. నిధులు డ్రా చేసి క్రీడా పరికరాలు ఏర్పాటు చేయకుండా స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఉపయోగంలోకి ప్రాంగణాలను తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ