Bonthu Rammohan: జూబ్లీహిల్స్ టికెట్ హామీపై?
పార్టీకి ప్రతిపాదించిన ఎంపీ అర్వింద్!
కాంగ్రెస్ లో టికెట్ ఆశించిన రామ్మోహన్
నవీన్ యాదవ్‌కు ఫైనల్ చేయడంతో బీజేపీలో చేరుతారంటూ ప్రచారం
కాంగ్రెస్‌లోనే ఉంటానంటూ బొంతు స్పందన
అయినా ఆగని ప్రచారం
బీజేపీ అభ్యర్థిపై శుక్రవారం క్లారిటీ!
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కొత్త రాజకీయ పరిణామం తెరపైకి వచ్చింది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. జూబ్లీహిల్స్ టికెట్ హామీపై ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికివ్వాలనే అంశంపై చర్చించగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కల్పించుకొని బొంతు రామ్మోహన్‌కు ఇవ్వాలని, ఆయనకు ఇస్తే బాగుంటుందని రాష్ట్ర నాయకత్వానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్ని రోజులుగా బీజేపీ అభ్యర్థి ఎవరనే అంశంపై జరుగుతున్న ఊహాగానాలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. తెరపైకి బొంతు పేరు రావడంతో ఆశావహులు షాక్‌కు గురవుతున్నారు. వాస్తవానికి బీజేపీ తమ అభ్యర్థిని శుక్రవారం ఫైనల్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ తరుణంలో బొంతు పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారిరంది.
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. కాగా జూబ్లాహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. కాంగ్రెస్ నవీన్ యాదవ్ పేరును ఫైనల్ చేయడంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయి. కాగా తాజాగా అర్వింద్ ప్రతిపాదనలతో బొంతు బీజేపీకి టచ్‌లో ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. బీజేపీ టికెట్ ఇస్తే రామ్మోహన్ చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేతలు పలువురు చెబుతున్నారు. బీజేపీ ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్‌కు అభ్యర్థిని ప్రకటించాల్సి ఉండగా ఆలస్యమైంది. కాంగ్రెస్ ప్రకటించాక తమ అభ్యర్థిని ఫైనల్ చేయాలనే ఆలస్యం చేసినట్లుగా చర్చించుకుంటున్నారు. టికెట్ ఆశించి భంగపడిన వారిని చేర్చుకుని తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ఈ స్కెచ్ వేసినట్లుగా పలువురు చెప్పుకుంటున్నారు. కాగా ఈ అంశాలన్నీ బొంతు చేరుతారనే ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
Read Also- Shivadher Reddy: ఇలా ఉండండి.. రాష్ట్ర పోలీసులకు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి మార్గనిర్దేశనం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎదుట అర్వింద్ ఈ అంశాన్ని లేవనెత్తినట్లు సమాచారం. రామ్మోహన్ ఏబీవీపీలో పనిచేశారని, మనవాడంటూ అర్వింద్ ప్రస్తావించినట్లు వినికిడి. ఆయన కు టికెట్ ఇస్తే బాగుంటుందని, పార్టీకి ప్లస్ అవుతుందని ధర్మపురి వివరించినట్లు సమాచారం. కాగా దీనిపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ సైతం స్పందించారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. జూబ్లీహిల్స్ బైపోల్ లో బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న మాటల్లో వాస్తవం లేదని వెల్లడించారు. తన అభ్యర్థిత్వంపై కాషాయ పార్టీలో అంతర్గత చర్చకు,తనకు ఏమాత్రం సంబంధం లేదని కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ లో ఉన్నానని, ఉంటానని వెల్లడించారు. కాంగ్రెస్ లో సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినా ఈ ప్రచారం కొనసాగుతూనే ఉండటం గమనార్హం.
Read Also- Paddy procurement: ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమైన ప్రభుత్వం.. ఈసారి చాలా పకడ్బందీగా!
బొంతు బీజేపీలో చురుతారన్న ప్రచారంతో టికెట్ ఆశించిన పలువురు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టికెట్ తమకే వస్తుందని ఎవరికి వారు ధీమాగా ఉండగా ఈ ప్రచారం జరగడంతో షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిజంగానే బొంతు రామ్మోహన్ కాషాయ తీర్థం పుచ్చుకుంటారా? లేక ఇది బీజేపీ మైండ్ గేమ్ లో భాగమా? అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థి ఎవరన్న అంశంపై శుక్రవారం క్లారిటీ వచ్చే అవకాశముంది. రాష్ట్ర నాయకత్వం ముఖ్య నేతలతో నేడు భేటీ అయి ఫైనల్ చేయనుందని సమాచారం. ఈ జాబితాలో ఎవరి పేరు ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలో ముందు నుంచే టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరికైనా పార్టీ టికెట్ దక్కుతుందా? లేక బొంతును చేర్చుకుని ఆయనకే టికెట్ కేటాయిస్తుందా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
