Muralidhar Rao: కేసీఆర్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. దాదాపు లక్ష కోట్లకు బ్యారేజీలు, రిజర్వాయర్లు, భవిష్యత్ నిర్మాణాలకు అంచనాలు వేశారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, ఇతర బ్యారేజీల్లో లోపాలు బయటపడడంతో ప్రాజెక్ట్ మొత్తం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ప్రబుత్వం నిజానిజాలు తెలుసుకునేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణ చేయిస్తున్నది. అయితే, కాళేశ్వరం నిర్మాణం మాటున అనేక అక్రమాలు జరిగాయని, ప్రజాధనం పక్కదారి పట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఓవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్నది ఇలాంటి సమయంలో మాజీ ఈఎన్సీ(ఇంజినీర్ ఇన్ చీఫ్) మురళీధర్ రావును ఏసీబీ అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఏసీబీ సోదాలు.. అరెస్ట్
కాళేశ్వరం నిర్మాణం సమయంలో ఈఎన్సీగా పని చేసిన మురళీధర్ రావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌లలో ఆయనకు సంబంధించిన వారి ఇళ్లు, కార్యాలయాల్లో మొత్తం పది చోట్ల సోదాలకు దిగింది. ఇదే క్రమంలో బంజారాహిల్స్‌లోని మురళీధర్ రావు నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లు ఇరిగేషన్ శాఖలో మురళీధర్ రావు కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు పలుమార్లు విచారణకు హాజరయ్యారు.
కాళేశ్వరంలో కీలక పాత్ర
మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత దగ్గరి మనిషిగా మురళీధర్ రావుకు పేరుంది. అధికారుల్లో ఈయనంటే హడల్. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలక భూమిక పోషించారు. అంతే స్థాయిలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి బిల్లు ఈయన చేతులమీదుగానే రిలీజ్ అయ్యింది. ఏదైనా తప్పు ఉంటే హెచ్చరించి బిల్లు ఆపేసే అధికారం ఈయనదే. కానీ, అలా ఎప్పుడూ చేసిన సందర్భాలు లేవన్న చర్చ ఉన్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ లక్షల కోట్ల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. అలాగే, రూ.50 కోట్ల దాకా తాగునీటి ప్రాజెక్ట్స్‌కు పూనుకున్నారు. వీటన్నింటిలో కీలక పాత్రధారి మురళీధర్ రావు. పదేళ్లలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు బలంగా వినిపించాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన్ను పదవిలో నుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. 2024 ఫిబ్రవరిలో ఈయన రాజీనామా చేశారు.
కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు?
మురళీధర్ రావు ఈఎన్సీగా ఉన్నప్పుడు కొడుకు సాయి అభిషేక్ రావు కంపెనీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ఓ కంపెనీలో హర్షవర్ధన్ రెడ్డి అనే బినామీని చేర్పించి, తర్వాత తన కుమారుడికి ప్రయారిటీ దక్కేలా చూసుకున్నారని, పాలమూరు, కాళేశ్వరంలో భారీగా సబ్ కాంట్రాక్టులు వచ్చేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అనుభవం లేని ఆ కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వడంలో మురళీధర్ రావు అన్నీ తానై చూసుకున్నట్టు అధికార వర్గాల్లో చర్చ ఉన్నది.
Read Also- MLC Kavitha: కవిత కయ్యాలపై కీలక భేటీ.. జాగృతిపైనే ప్రధానంగా చర్చ!
ఈ మధ్య కాలంలో అరెస్ట్ అయిన అధికారులు(మాజీలు కూడా)
2025 జూలై 15:
మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాలకు సంబంధించి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు.
2025 జూన్ 10:
ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు.
2025 మే 10:
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి రూ.60,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
2024 డిసెంబర్ 12:
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హెరూర్ నికేష్ కుమార్ రూ.100 కోట్ల అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు.
2024 జూన్ 1:
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. భాన్సీ లాల్, అసిస్టెంట్ ఇంజనీర్లు కె. కార్తీక్, హెచ్. నికేష్ కుమార్ లంచం కేసులో అరెస్టయ్యారు.
2024 నవంబర్ 25:
పెద్దపల్లి జిల్లాకు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ వొమ్కరం నర్సింగ రావు రూ.20,000 లంచం తీసుకుంటూ అరెస్టయ్యారు.
2024 ఏప్రిల్ 26:
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ భూక్య హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు.
Read Also- Star Heroine: 50 సెకన్ల కోసం ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్?