KCR On SIT Notice: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణ కీలక దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (KCR) సిట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అయితే, గురువారం నాడు జారీ చేసిన ఈ నోటీసులకు కేసీఆర్ (KCR On SIT Notice) బదులిచ్చారు. మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్ ముందుకు రాలేనని విచారణాధికారులకు సమాచారం అందించారు. అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నానని వివరించారు. విచారణ కోసం సిట్ అధికారులకు అనువుగా ఉన్న మరో తేదీని తెలియజేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ మేరకు జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ వెంకటగిరికి కేసీఆర్ లేఖ రాశారు. నోటీసు ప్రకారం, జనవరి 30న (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణ కోసం అందుబాటులో ఉండాలని తనను కోరారని, కానీ, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి రేపు (జనవరి 30) చివరి తేదీ అని, ఈ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతున్నందున అనేక మంది అభ్యర్థులకు అధికారిక పత్రాలు జారీ చేసే పనిలో తాను బిజీగా ఉన్నట్టు కేసీఆర్ వివరించారు.
Read Also- Movie Press Meet: ఒకే టైమ్‌కి రెండు వేరు వేరు సినిమాల ప్రెస్ మీట్స్.. దర్శకనిర్మాతలు అసంతృప్తి!
తాను తెలిపిన కారణాల దృష్ట్యా, సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం, తన విచారణ కోసం తమరికి అనుకూలమైన మరో తేదీని ఖరారు చేయాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. అలాగే, తన నివాస స్థలమైన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి (గ్రామం) ఇంటి నంబర్ 3-96 వద్ద విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు, ఆ కేసుతో సంబంధం ఉన్న, లేదా సాక్ష్యం చెప్పే ఏ వ్యక్తినైనా విచారణకు రమ్మని అడిగే అధికారం పోలీసులకు ఉంటుందని, అయితే, ఆ వ్యక్తి సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, లేదా పక్కనే ఉన్న స్టేషన్ పరిధిలో గానీ ఉండాలనే చెప్పే సీఆర్పీసీ 160ని గుర్తుచేస్తున్నానని కేసీఆర్ చెప్పారు. ఈ చట్టం ప్రకారం, సదరు వ్యక్తుల విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు, లేదా మరే ఇతర ప్రదేశానికి రమ్మని పోలీసులు ఒత్తిడి చేయకూడదనే విషయాన్ని గుర్తుచేస్తున్నానని చెప్పారు. 15 ఏళ్లలోపు ఉన్న బాలురు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు (పురుషులు), అలాగే మహిళలు (ఏ వయసు వారైనా), మానసిక లేదా శారీరక వైకల్యం ఉన్న వ్యక్తులను తాము కోరిన ప్రదేశానికి రావాలంటూ ఒత్తిడి చేయకూడదని కేసీఆర్ ప్రస్తావించారు.
65 ఏళ్లు పైబడిన పురుషులను, 15 ఏళ్ల లోపు పిల్లలను లేదా మహిళలను వారి నివాస స్థలంలోనే విచారించాలని ఈ చట్టం చెబుతోందని కేసీఆర్ గుర్తుచేశారు. తాను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతమైన పౌరుడిగా దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తానని కేసీఆర్ చెప్పారు.
Read Also- Kalvakuntla Kavitha: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

