Drug Addicts (imagecredit:twitter)
తెలంగాణ

Drug Addicts: మత్తుకు బానిసలవుతున్న వైద్యులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటాలు

Drug Addicts: వైద్యో నారాయణ హరి” అంటారు. ప్రాణాలను కాపాడే పవిత్రమైన వృత్తిలో ఉన్న నేపథ్యంలో డాక్టర్లకు భగవంతుడి స్థానాన్ని ఇచ్చారు. అయితే, డ్రగ్స్‌కు బానిసలవుతున్న కొందరు డాక్టర్లు వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. మత్తులో చికిత్సలు చేస్తూ ప్రజల ప్రాణాలను ‘హరీ’మనిపిస్తున్నారు. గడిచిన ఒక్క సంవత్సరంలోనే డ్ర‌గ్స్‌కు అలవాటు పడి దొరికిపోయిన వైద్యుల సంఖ్​య 22కు పైగానే ఉంది. కానీ, పట్టుబడని వారి సంఖ్య దీనికి రెండు మూడింతలు ఉంటుందని పోలీస్ వర్గాలు అంటున్నాయి.

గతంలో ఎన్నో ఘటనలు

గచ్చిబౌలిలోని ఒమేగా హాస్పిటల్ సీఈవోగా పని చేసిన డాక్టర్​ చిగురుపాటి నమ్రత డ్రగ్స్‌కు అలవాటు పడి చివరకు యాంటీ నార్కొటిక్​ బ్యూరోకు దొరికిపోయింది. విచారణలో కొకైన్​ కోసం ఆమె 70 లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్టు వెల్లడైంది. ఈ డబ్బు కోసం కోటి రూపాయల విలువ చేసే ఆస్తిని కూడా అమ్ముకున్నట్టుగా తేలింది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి డాక్టర్లు దొరికిపోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో చాలానే జరిగాయి. తాజాగా సైబరాబాద్ నార్కొటిక్​ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేసిన సూర్యను విచారించినప్పుడు కూడా భీమవరానికి చెందిన ఓ ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్టుగా పని చేస్తున్న డాక్టర్ ప్రసన్న 20సార్లు కొకైన్ కొనుగోలు చేసినట్టు వెల్లడయ్యింది.

20 మందికి పైగానే.. అధిక ఒత్తిడి

పోలీస్ అధికారులు చెబుతున్న ప్రకారం, గత సంవత్సర కాలంలో ఇలా డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డ వారి సంఖ్య 20కి పైగానే ఉంది. దీనిపై యాంటీ నార్కొటిక్ బ్యూరోకు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారితో మాట్లాడుగా అధిక శాతం మంది డాక్టర్లు తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి బయట పడడానికే డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు దొరికిన వారిని విచారించినప్పుడు అధిక శాతం మంది దీనినే కారణంగా చెప్పారన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటళ్లలో పని చేసే వైద్యులపై పనిభారం విపరీతంగా ఉంటోందని తెలిపారు. హస్తవాసి ఉన్న డాక్టర్ అన్న పేరు వస్తే ఇది మరింతగా పెరిగిపోతోందని చెప్పారు. భారీ జీతాలు ఇస్తూ వీరిని ఉద్యోగాల్లో పెట్టుకుంటున్న ఆయా కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు ఓ నిర్ణీత సమయం అన్నది లేకుండా వీరితో పని చేయించుకుంటున్నాయని వివరించారు.

Also Read: Telangana: తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో సీఎం చర్చలు

డ్రగ్స్‌తోపాటు గంజాయి

ఇక, అత్యవసరంగా వచ్చే కేసుల సంగతి సరే సరి అని చెబుతూ వీటిని డాక్టర్లు కచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో భార్యాపిల్లలకు కూడా చాలినంత సమయాన్ని చాలామంది డాక్టర్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పారు. ఈ పరిణామాలన్నీ వారిలో తీవ్ర మానసిక ఒత్తిడికి కలుగ చేస్తున్నట్టు తెలిపారు. దీని నుంచి బయట పడడానికే కొందరు మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తున్నారని వివరించారు. మరికొందరు వైద్యులు గ‘మ్మత్తు’ కోసం డ్రగ్స్​‌ను రుచి చూసి ఆ తరువాత వాటికి బానిసలుగా మారుతున్నారన్నారు. మరోవైపు, వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే కొందరు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుండడం ఆందోళనకరమైన పరిణామమని చెప్పారు. ధూల్​ పేటలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న ఓ పెడ్లర్‌ను గతంలో అరెస్ట్ చేసి విచారించినప్పుడు కొనుగోలుదారుల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న పదిమంది విద్యార్థులు ఉన్నట్టుగా బయట పడిందన్నారు. వీళ్లంతా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు కావడం గమనార్హం. వీరిని ప్రశ్నించినప్పుడు చదువుల ఒత్తిడి, స్నేహితుల ప్రభావం, హాస్టల్‌లో దొరుకుతున్న స్వేచ్ఛ కారణంగానే గంజాయికి అలవాటు పడినట్టుగా చెప్పారన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే తాము పంపించిన నివేదికల ఆధారంగా నాలుగు ప్రముఖ ఆస్పత్రుల యాజమాన్యాలు డ్రగ్స్‌కు బానిసై తమ పని చేస్తున్న నలుగురు డాక్టర్లను ఉద్యోగాల్లో నుంచి తొలగించినట్టు తెలిపారు. డాక్టర్లు సేవిస్తున్న వాటిలో కొకైన్​, ఎండీఎంఏ, ఓజీ కుష్​ గంజాయి, గంజాయి, ఎక్టసీ పిల్స్, హాష్​ ఆయిల్ తదితర మాదక ద్రవ్యాలు ఉంటున్నట్టు చెప్పారు.

మత్తుకు అలవాటు పడి..

ఇలా మత్తుకు అలవాటు పడుతున్న డాక్టర్లు రోగుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు. సీనియర్ వైద్యులు చెబుతున్న ప్రకారం డ్రగ్స్‌కు అలవాటు పడ్డ వైద్యులకు తమపై తమకు నియంత్రణ ఉండదు. పైగా, హలోషన్‌లోకి వెళ్లిపోతుంటారు. కొన్నిసార్లు ఏం చేస్తున్నామో వారికే తెలియకుండా పోతుంది. ఇది కచ్చితంగా అవతలి వారి ప్రాణాలతో ఆటలాడుకోవటమే. సాధారణంగా ఆల్కాహాల్ మొదలుకుని డ్రగ్స్ వరకు మత్తు కలిగించే దేనిని సేవించినా మొదట అది చిన్న మెదడుపై ప్రభావం చూపిస్తుందని సీనియర్ డాక్టర్లు చెబుతున్నారు. చిన్న మెదడు పని చేసే వేగం తగ్గిపోవడంతో మత్తు ఫీలింగ్ కలుగుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లు స్పందించే వేగం కూడా తగ్గిపోతుందని వివరించారు. పైగా, డ్రగ్స్ తీసుకుంటూ కొందరు డాక్టర్లు తమను తాము చావును కొని తెచ్చుకుంటున్నారన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఆయా ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యులకు కూడా నిర్ణీత కాలానికొకసారి పరీక్షలు జరపడాన్ని తప్పనిసరి చేయాలంటున్నారు.

Also Read: Swetcha Effect: భూకబ్జాదారులను వదిలేదే లేదు.. ప్రభుత్వ భూములను కాపాడుతాం!

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?