Fake VRA: దమ్మపేట తహసిల్దార్ కార్యాలయంలో నకిలీ వీఆర్ఏ సంచలనం
ఆర్టీఐలో బయటపడిన బాగోతం
తహసిల్దార్ నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం
దమ్మపేట, అక్టోబర్ 28, స్వేచ్ఛ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసిల్దార్ కార్యాలయంలో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న వ్యక్తి అసలు ఆ ఉద్యోగానికి సంబంధం లేని వ్యక్తి అని సమాచారం బయటకు (Fake VRA) రావడంతో మండలం అంతా చర్చల మయమైంది. దమ్మపేట తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న ముదగండ్ల నాగేంద్రరావు తండ్రి చిన్న వెంకటేశ్వరరావు అసలు ఈ ఉద్యోగానికి సంబంధం లేని వ్యక్తి అని మండలంలో చర్చ మొదలైంది. తండ్రి స్థానంలో కొడుకు విధులు నిర్వర్తిస్తున్నాడన్న విషయం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రెవెన్యూ కార్యాలయంలో ఎలా ప్రవేశించాడు?, ఎవరి అనుమతితో విధులు నిర్వర్తిస్తున్నాడు?, తహసిల్దార్ ఈ వ్యవహారంపై మౌనం ఎందుకు వహిస్తున్నారు?, ఈ ప్రశ్నల చుట్టూ తిరుగుతోన్న ఈ ఘటన ఇప్పుడు జిల్లా అధికారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రజల నోళ్లలో ఒకే మాట ‘ఇతడు ఎవరో?’.
ఏం జరిగింది..?
దమ్మపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో మందలపల్లి గ్రామానికి చెందిన ముదగండ్ల పెద్ద వెంకటేష్ గతంలో ఈ కార్యాలయంలో తలారిగా విధులు నిర్వహించాడు. అయితే, అనారోగ్య కారణంగా తన స్థానంలో కొడుకైన రాజును విధులకు పంపాడు. కార్యాలయంలో అప్పటి తహసిల్దార్ పర్యవేక్షణలో ఉండి, రాజు అన్ని పనులు స్వయంగా చూసుకునేవాడు. కాలక్రమంలో అతడికి కార్యాలయ పనులపై పూర్తి పట్టుదొరకడంతో, తహసిల్దార్ సంతకాలపైనా ఎసరు పెట్టడం ప్రారంభించాడు.
తదుపరి, తహసిల్దార్ సంతకాలను నకిలీగా ఉపయోగించిన ఫోర్జరీ కేసులో ప్రధాన నిందితుడిగా రాజు పేరుమీద కేసు నమోదైంది. ఆ సమయంలో నకిలీ పట్టాలు సృష్టించి, వాటిని ఆధారంగా తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములు లేని వ్యక్తికి రెవెన్యూ అధికారులు ఎలా పట్టాలు జారీచేశారన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. మండల ప్రజల్లో ఈ ఘటనపై చర్చలు మిన్నంటుతున్నాయి.
Read Also- Medak district: నర్సాపూర్ అటవీ.. ఏకో పార్కు ప్రాంతాన్ని పరిశీలించిన : కలెక్టర్ రాహుల్ రాజ్
అటు తరువాత పెద్ద వెంకటేష్ తిరిగి తలారి బాధ్యతలు చేపట్టిన అనంతరం, తన తమ్ముడు కుమారుడు ముదగండ్ల నాగేంద్రరావును (తండ్రి చిన్న వెంకటేశ్వరరావు) వారసుడిగా ప్రకటించుకున్నట్లు సమాచారం. కారుణ్య నియామకం పేరుతో ప్రజల్లో “తనకు తహసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది” అంటూ ప్రచారం చేస్తూ తిరుగుతున్నాడు. అంతేకాకుండా, తన వాహనంపై ‘రెవెన్యూ డిపార్ట్‌మెంట్’ (Revenue Dept) స్టిక్కర్ వేసుకుని ప్రజలను, అధికారులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవానికి తహసిల్దార్‌కి నాగేంద్రరావు గురించి ఏమీ తెలియకుండానే ఇంత కదాక మామీషు జరిగిందా అన్నది మండల ప్రజల వాదన.
గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేయడంతో, 2025 సెప్టెంబర్ 6న సమాచార హక్కు చట్టం (RTI) కింద దమ్మపేట తహసిల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేయడం జరిగింది. దానికి ప్రతిగా, 2025 అక్టోబర్ 7న అందిన అధికారిక లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు —
“ముదగండ్ల నాగేంద్రరావు తండ్రి చిన్న వెంకటేశ్వరరావు ఈ కార్యాలయంలో ఉద్యోగిగా నమోదు కాలేదు. ఎటువంటి కారుణ్య నియామకం జరగలేదు. అలాగే, ముదగండ్ల పెద్ద వెంకటేష్ పేరుపై ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కూడా జారీ చేయలేదు.” ఈ లేఖ బయటపడిన తర్వాత, “తహసిల్దార్ కార్యాలయంలో ఈ వ్యక్తి ఉద్యోగి కాదని చెబితే, ఇప్పటికీ అతను కార్యాలయంలో తిరుగుతూ ఉండటానికి కారణమేంటి..? అధికార యంత్రాంగం ఎందుకు మౌనం వహిస్తోంది..?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Read Also- Zoho Payments: ‘జోహో పే’ వచ్చేస్తోంది.. గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లు ఎటువైపు మొగ్గుతారో?.. ఫీచర్లు ఇవే
గత వివాదం మళ్లీ
ఇదే వ్యక్తి కుటుంబం గతంలోనూ తహసిల్దార్ సంతకాల నకిలీ వ్యవహారంలో, నకిలీ పట్టాల సృష్టిలో, బ్యాంకు రుణాల మోసంలో ఆరోపణలకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. భూములు లేకపోయినా అధికారుల సంతకాలతో పట్టాలు జారీ అయిన ఘటన ఇప్పటికీ స్పష్టత పొందలేదు. రెవెన్యూ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసే ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు తక్షణమే విచారణ జరిపి, నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “నకిలీ పట్టాలు, నకిలీ ఉద్యోగాలు, ఇప్పుడు నకిలీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ స్టిక్కర్..! ఇలాంటి వారిని అడ్డుకోవాలి. లేకపోతే ప్రజల విశ్వాసం కోల్పోతుంది.” అంటూ మండలం కోడై కూస్తోంది.
రెవెన్యూ శాఖ వ్యవస్థలో జరుగుతున్న నిర్లక్ష్యం,మౌనం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.తహసిల్దార్ మరియు సంబంధిత రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజల విశ్వాసం దెబ్బతినక ముందే నిజానిజాలను వెలికితీయడం ప్రభుత్వ ధర్మం. ఏ సంబంధం లేని ఒక వ్యక్తి తహసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగిగా చాలా మణి అవుతున్నాడంటే ఎవరి అండ చూసుకొని చేస్తున్నాడో?. “రెవెన్యూ శాఖ” అనే పేరుతో ప్రజలను మభ్యపెట్టడం క్షమించరాని నేరం. ప్రభుత్వం దీనిపై వెంటనే విచారణ జరిపి, తహసిల్దార్ కార్యాలయంలో ఎవరు, ఎలా, ఎవరి అనుమతితో పనిచేస్తున్నారో నిర్ధారించాలి. రెవెన్యూ శాఖ గౌరవం కాపాడటానికి, జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణ చేపట్టి, తహసిల్దార్ నుంచి వివరణ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతే కాదు దమ్మపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు పూర్తి సమాచారం కావాలి అని ఎవరి ఉద్యోగం ఎవరు చేస్తున్నారో ఏమీ తెలియడంలేదనీ ప్రజలు అయోమయంలో పడ్డారు. “ఇది కేవలం ఒక కార్యాలయ ఘటన కాదు — నకిలీ ఉద్యోగాల వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్‌కి నిదర్శనం” అని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
