Etela Rajender: తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్సే.. కదా
ఇక్కడ కూడా ఈవీఎం మిషన్లతోనే ఎన్నికలు జరిగాయి
వారు గెలిస్తే మిషన్లు పని చేసినట్టు.., ఈసీ కమిషన్ పనిచేసినట్టు
ప్రశ్నించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : ఓట్ల కోసం, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతనే పణంగా పెట్టడం మంచి పద్ధతి కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) హితబోధ చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ కుమారుడి వివాహానికి ఆదివారం ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇక్కడ కూడా ఈవీఎం మిషన్లతోనే ఎన్నికలు జరిగాయి కదా అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. వారు గెలిస్తే మిషన్లు పనిచేసినట్టు.. ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టా? అని ప్రశ్నించారు. ఓడిపోతే మాత్రం ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్లా అని నిలదీశారు.
Read Also- CM Revanth Reddy: రిజర్వేషన్ ఎజెండా అమలు ఎట్లా..? స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం
ఓట్ల చోరీ జరిగిందంటూ బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన అని మండిపడ్డారు. ఉదాహరణకు, హైదరాబాద్‌లో అద్దెకు ఉండేవారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటారని, ఊరు నుంచి పట్టణాలకు వలస వస్తూ ఉంటారని ప్రస్తావించారు. వీరి ఓట్లను సరిచేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుందని చెప్పారు. ఓట్ల నమోదు, డబుల్ ఓట్ల ఉంటే తొలగించే విధానం నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు. బీహార్ దేశ సరిహద్దులో ఉన్న ప్రాంతమని, ఇక్కడికి బంగ్లాదేశ్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అలా వచ్చిన వారికి ఆధార్ కార్డులు సిటిజన్‌షిప్ ఇవ్వడం ఎంత మాత్రం దేశానికి క్షేమం కాదని ఈటల వ్యాఖ్యానించారు.
Read Also- CP Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం
ఓట్ల కోసం, అధికారం కోసం దేశ భద్రతనే పణంగాపెడతామనుకునే చవకబారు ఆరోపణలు సరికాదని ఆయన ఫైరయ్యారు. సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసిందని, దాని ప్రకారం నిర్ణయాలు ఉంటాయని ఈటల తెలిపారు. అంతే తప్ప దానికి పార్టీకి, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందని, ఈమాత్రం అవగాహన లేకపోతే ఎలా అంటూ ఈటల దుయ్యబట్టారు.
నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని బీజేపీ సోమవారం నిర్వహించనుంది. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఉదయం 9:45 గంటలకు, ట్యాంక్ బండ్ వద్ద ఉదయం 10:30 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు హాజరవ్వనున్నారు. ఆయన పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. పాపన్న గౌడ్ స్వగ్రామం ఖిలాషాపూర్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ హాజరవ్వనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.