పాతవా..? పార్టీ పరంగా..?
బీసీ ముఖ్య నాయకుల నుంచి ముఖ్యమంత్రి ఫీడ్ బ్యాక్
వేర్వేరు లీడర్ల అభిప్రాయాలు సేకరణ
తాజాగా మరోసారి మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్, వీహెచ్ లతో భేటీ
ఈ నెల 23న పీఏసీ మీటింగ్
నేతలకు ఓటింగ్
స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం
CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) రిజర్వేషన్ ఎజెండాను ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. బిల్లు, ఆర్డినెన్స్‌కు క్లియరెన్స్ రాకపోవడంతో ఏం చేయాలి? అనే దానిపై సంపూర్ణంగా స్టడీ చేస్తున్నది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలా? లేదా పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇచ్చి ముందుకు సాగుదామా? అని ప్రభుత్వం క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేస్తున్నది. ఇదే అంశంపై బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత వీహెచ్‌తో పాటు మరి కొంత మంది ముఖ్య నాయకుల నుంచి సీఎం (CM Revanth Reddy) అభిప్రాయం సేకరించారు. అంతేగాక బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ఎక్స్‌పర్ట్స్, బీసీ కమిషన్ నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ కేటగిరీల నుంచి వచ్చిన ఓపీనియన్లను ఈ నెల 23న గాంధీభవన్‌లో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌లో పొందుపరచనున్నారు. ఆ తర్వాత లీడర్లకు ఓటింగ్ పెట్టనున్నారు. మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు తదుపరి నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు పార్టీలోని ఓ సీనియర్ నేత చెప్పారు. ప్రభుత్వం తరపున బీసీ రిజర్వేషన్లపై చేయాల్సిన ప్రాసెస్ అంతా పూర్తైనా.. గవర్నర్, రాష్ట్రపతి నుంచి ఆమోదం రాలేదు. దీంతో చేసేదేమీ లేక పార్టీ తరపున రిజర్వేషన్లు అమలు అంశాన్ని పార్టీ సీరియస్‌గా స్టడీ చేస్తున్నది.
Also Read- KTR: ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు..
కోర్టును టైమ్ అడిగితే….?
సెప్టెంబరు 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయితే రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకపోవడంతో ప్రభుత్వం సతమతమవుతున్నది. దీంతో ఎన్నికలకు మరి కొంత సమయం గడువు ఇవ్వాలని హైకోర్టును అడిగితే ఎలా ఉంటుంది? అనే అంశంపై కూడా పీఏసీలో చర్చించనున్నారు. సభ్యుల అభిప్రాయాన్ని ఫిక్స్ చేయనున్నారు. అయితే కేబినెట్ మంత్రులు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తేనే బెటర్ అంటూ ప్రభుత్వానికి అభిప్రాయాలను అందజేశారు. దీని వలన ఫండ్స్‌తో పాటు క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని వివరిస్తున్నారు. ఈ అంశాలన్నీ క్రోడీకరించి పీఏసీలో డిస్కషన్ చేయనున్నారు. మరోవైపు సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చినా.. కోర్టులో దానికి బ్రేకులు పడే ఛాన్స్ ఉన్నదని లీడర్లు చెప్తున్నారు. దీంతో పీఏసీ మీటింగ్ కీలకంగా మారింది.
Also Read- King Nagarjuna: తనతో సినిమా చేయమని దర్శకుడి వెంట పడ్డ కింగ్..? ఆ తోపు దర్శకుడు ఎవరంటే?
ఈ అంశాలపై కూడా…
ఇక ఈ నెల 23న జరిగే పీఏసీ మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించే జనహిత పాదయాత్ర 2, నామినేటెడ్ పదవులు, జూబ్లీహిల్స్ అభ్యర్ధి ఎంపిక, పార్టీలో వర్గ విభేదాలు, క్రమ శిక్షణ కమిటీ మీటింగ్‌లు, నోటీసులు, సంస్థాగత నిర్మాణం, తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ప్రభుత్వ పథకాలపై ప్రచారం, పార్టీ, ప్రభుత్వం సమన్వయం వంటి తదితర కీలక అంశాలపై కూడా డిస్కషన్ చేయనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల కంటే తమకు రిజర్వేషన్లే ముఖ్యమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. రిజర్వేషన్లు లేకుంటే బీసీలకు గెలిచే స్థానాల్లో సీట్లు లభించవేమోనని ఆయన అనుమానం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీలో బీసీలకు సీట్లు ఇవ్వడమే ఆయన అనుమానానికి కారణమైంది. దీంతోనే ఆలస్యమైనా.. రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేది ఇయన ఇంటెన్షన్. పైగా రిజర్వేషన్లతో వెళ్తేనే బీసీల విజయానికి అన్ని వర్గాలు సహకరిస్తాయి. లేకుంటే అప్పటి వరకు ఆశావహులుగా ఉన్న ఓసీలు, ఇతర సామాజిక వర్గాల నేతలు ఎన్నికలకు సహకరించరనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు