Temple Land Scam: దేవాదాయశాఖ లో పెండింగ్ కేసులు వేలల్లో పేరుకుపోతున్నాయి. శాఖకు న్యాయవాదులు ఉన్నా అవి ముందుకు సాగడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, అధికారుల మధ్య సమన్వయం లోపించడం , కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోడంలో జరుగుతున్న జాప్యంతో కేసులు ఏళ్లతరబడి కోర్టులో పెండింగ్ లో ఉంటున్నాయి. కొన్ని కేసులు కోర్టులో ఇయరింగ్ కు వచ్చినా వాటికి కౌంటర్ దాఖలు చేయడంలో జరుగుతున్న జాప్యం శాఖకు ఇచ్చిన నివేదికలోనే స్పష్టమవుతుంది.
మధ్యంతర ఉత్తర్వులు..
రాష్ట్రంలోని ఆలయాలకు 87235.39 ఎకరాలు భూములు ఉండగా ఏకంగా 20124.03 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. కాగా విత్ అవుట్ లిటిగేషన్ తో మరో 5569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం చూపడం లేదు. అయితే ఈ ఆక్రమించుకున్న ఆక్రమణదారులపై దేవాదాయశాఖ అధికారులు కేసులు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1779 కేసులు ఉన్నాయి. అందులో కౌంటర్ దాఖలు చేసిన కేసులు 1443 కాగా, కౌంటర్ దాఖలు చేయని కేసులు 332 ఉన్నాయి. వీటితో పాటు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కేసులు 261 కాగా, 11 ఏళ్లకు పైగా ఉన్న 261 కేసులు ఉన్నాయి. దేవాదాయశాఖకు ప్రభుత్వం 5 అడ్వకేట్లను నియమించింది. అందులో జీపీ, ఏజీపీలు ఉన్నారు. ఇద్దరు జీపీ, ఏజీపీలు ఉద్యోగుల సర్వీసు ఇతర అంశాలకు, మరో ఇద్దరు ల్యాండ్, ట్రస్టీ భూములకు సంబంధించిన కేసులను కోర్టులో వాదించనున్నారు. మరో న్యాయవాది స్టాండింగ్ కౌన్సిల్ సర్వీసు కేసులను వాదించేందుకు ప్రభుత్వం నియమించింది. అయితే ఇండోమెంట్ కేసులు మాత్రం ముందుకు సాగడం లేదు. పరిష్కారానికి ఆశించిన స్థాయిలో నోచుకోవడం లేదని దేవాదాయశాఖ అధికారులే పేర్కొంటున్నారు.
సర్వత్రా విమర్శలు..
రంగారెడ్డిలో 202 కేసులకు దేవాదాయశాఖ అడ్వకేట్లు కోర్టుల్లో కౌంటర్లు వేయకపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ కోట్లలో ఉంటుంది. ఆలయ భూములను సంరక్షిస్తే ఆలయానికి తోడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ప్రభుత్వం నియమించిన న్యాయవాదులు ఎందుకు కౌంటర్లు వేయలేదని సర్వత్రా చర్చజరుగుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్ లో 21, నల్లగొండ జిల్లాలో 23, మహబూబ్ నగర్ జిల్లాలో 69, ఖమ్మంలో 5, కరీంనగర్ లో 3, ఆదిలాబాద్ లో 6, నిజామాబాద్ లో 3 ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 332 కేసులకు కౌంటర్లు దాఖలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎందుకు చేయడం లేదు.. కావాలనే చేస్తున్నారా? లేకుంటే కేసులు ఎక్కువగా ఉండటంతో జాప్యం జరుగుతుందా? అనేది కూడా చర్చకు దారితీసింది. ఆలయ భూములను సంరక్షించేందుకు ప్రభుత్వం న్యాయవాదులను నియమిస్తే ఎందుకు కేసుల పరిష్కారం కావడం లేదని ఈ మధ్య మంత్రి కొండా సురేఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రశ్నించినట్లు సమాచారం. వారి పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రి సీరియస్ అయిన తర్వాతనే మంచిరేవుల భూముల ఆక్రమణపై కోర్టులో న్యాయవాదులు కౌంటర్లు దాఖలు చేసినట్లు సమాచారం.
Also Read: Manchu Manoj: పవన్ కళ్యాణ్ వల్లే నా జీవితం మారింది.. మంచు మనోజ్
గత ప్రభుత్వాలు ఆదిశగా చర్యలు..
ఆలయ భూములపై ఉన్నతాధికారులు నిత్యం మానిటరింగ్ చేయాల్సి ఉంది. అంతేకాదు కోర్టుల్లో ఏ కేసు ఎంతవరకు వచ్చింది? ఏ దశలో ఉంది? వాదనలు ఎలా జరుగుతున్నాయి? ఆ కేసులో ఇంకా సేకరించాల్సిన ఆధారాలు ఏం కావాలనేదానిపై సమీక్షలు నిర్వహించి న్యాయవాదుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వాలు ఆదిశగా చర్యలు తీసుకోకపోవడంతోనే కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లోనే ఉంటున్నాయి. 11 ఏళ్ల నుంచి 64 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కేసులు 261 ఉన్నాయి. అంటే దానినిబట్టే కేసులపై శాఖ తీసుకుంటున్న చర్యలు స్పష్టమవుతున్నాయి.
కేసులు విచారణ సమయంలో..
ప్రభుత్వం న్యాయశాఖ నుంచి ఒక్కోశాఖకు న్యాయవాదులను కేటాయిస్తుంది. ఆ న్యాయవాదులకు మాత్రం సంబంధిత శాఖ నుంచే వేతనాలు ఇస్తున్నారు. దీంతో ఆయాశాఖల న్యాయవాదులు సంబంధిత శాఖకే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ న్యాయవాదులు మాత్రం సంబంధిత శాఖకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శాఖ అధికారులు సమాచారం అడిగినా కోర్టుకు ఇస్తామని, కేసులు విచారణ సమయంలో ఆధారాలను కోర్టుకే అందజేస్తామని సమాధానం ఇస్తున్నారని సమాచారం. ఇదే తరహాలో ఎండోమెంట్ లోని న్యాయవాదులు సైతం ఆశాఖకు సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం, సీఎం దృష్టిసారిస్తే తప్ప శాఖల్లో పేరుకుపోయిన కేసులు పరిష్కారం అయ్యే దాఖలాలు లేవు. పలువురు అధికారులు సైతం సీఎం చొరవ తీసుకోవాలని కేసులపై రివ్యూ చేసి, కేసుల్లో అలసత్వం వహించే జీపీ, ఏజీపీలపై చర్యలు తీసుకుంటే తప్ప కేసులు పరిష్కారం కాదని అభిప్రాయపడుతున్నారు. సీఎం నిర్ణయంపైనే ఆధారపడిఉంది.
Also Read: Crime News: సహజీవనం చేస్తున్న ప్రియురాలిని చంపేసి.. డెడ్‌బాడీ బ్యాగులో కుక్కి.. ఆ తర్వాత..