తెలంగాణ: Electricity In TG: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకౌ డౌన్ ఫాల్ అవుతోంది. వేసవిలో పెరగాల్సిన డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీనికి యాసంగి సీజన్ ముగియడం కారణంగా అధికారులు చెబుతున్నారు. వరి పంట కోతల సమయం కావడంతో వ్యవసాయ మోటార్ల వాడకం తగ్గడం వల్ల డిమాండ్ క్రమంగా తగ్గింది. కోతల సమయానికి ముందు 28 లక్షల వ్యవసాయ మోటార్లను వాడటం కారణంగా గతంలో డిమాండ్ భారీగా పెరిగేందుకు కారణమైంది.
ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం రోజురోజుకూ తగ్గుతోంది. కాగా అర్బన్ ఏరియాల్లో మాత్రం డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. భానుడి ప్రతాపం రోజురోజుకూ ఉగ్ర రూపం దాల్చుతుండటంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. అవసరమైతే తప్పా బయటకు వెళ్లడంలేదు. ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వాడకం పెరగడంతో పట్టణ ప్రాంతాల్లో వినియోగం భారీగా పెరగుతోంది.
Also Read: Mahesh Kumar on KCR: కేసీఆర్.. దమ్ముందా? ఛాలెంజ్ అంటూ టీపీసీసీ చీఫ్ సవాల్!
తెలంగాణలో ఈ వేసవిలో పీక్ డిమాండ్ నమోదవుతుందని అధికారులు ముందుగానే అంచనావేశారు. వారు భావించినట్టుగానే ఈ ఏడాది మార్చిలోనే గత రికార్డులు బ్రేకయ్యాయి. ఈవిషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) అంచనాలు సైతం తప్పాయి. ఈ ఏడాది దాదాపు 16,877 మెగావాట్ల వినియోగం జరిగే అవకాశముందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ముందుగానే అలర్ట్ చేసింది. అయితే అంతకు మించి 17,162 మెగావాట్ల గరిష్ట విద్యుత్ వినియోగం గత మార్చి 20న నమోదైంది.
కాగా అదే రోజు వినియోగం సైతం 335.19 మిలియన్ యూనిట్ల తారాస్థాయికి చేరింది. రానురాను వేసవి తాపం పెరుగుతుందని అధికారులు భావించి అందుకు తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 27న ఒక్కసారిగా ఈ వేసవిలో కనిష్ట వినియోగం 10,310 మెగావాట్లకు చేరుకుంది. కాగా 210.34 మిలియన్ యూనిట్ల కనిష్ట వినియోగం సైతం అదే రోజు నమోదవ్వడం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్ లో డిమాండ్:
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ వాడకం తగ్గగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఈసారి పీక్ డిమాండ్ దిశగా దూసుకుపోతోంది. 28 మార్చి నాటికి జీహెచ్ఎంసీ పరిధిలో 3,791 మెగావాట్ల(81.91 మిలియన్ యూనిట్ల వినియోగం) పీక్ డిమాండ్ నమోదవ్వగా.. ఏప్రిల్ నాటికి మరింత పెరిగింది. ఈనెల 24 నాటికి గరిష్ట వినియోగం 4,190(89.24 మిలియన్ యూనిట్ల వినియోగం) మెగావాట్లుగా నమోదైంది.
కాగా గతేడాది మే 6న జీహెచ్ఎంసీ పరిధిలో పీక్ డిమాండ్ 4,352(90.68 మిలియన్ యూనిట్ల వినియోగం) మెగావాట్లుగా నమోదవ్వగా ఈసారి ఏకంగా 5 వేల మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారుఎందుకంటే రానున్న రోజుల్లో మరింత హీట్ పెరిగే అవకాశముంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వాడకం పెరిగే చాన్స్ ఉంది. ఈనేపథ్యంలో విద్యుత్ అధికారులు సైతం ఎప్పటికప్పుడు కరెంట్ సరఫరాలో అంతరాయాల్లేకుండా సప్లయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో అలర్ట్ గా ఉండాలని అప్రమత్తం చేస్తున్నారు.
Also Read: Heatwave in Khammam: నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. ఆ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్!