Electricity Bills: రాష్ట్రంలో విద్యుత్ బకాయిల వసూళ్లలో అధికారులు అనుసరిస్తున్న ద్వంద్వ నీతిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుడు నెల రోజులు బిల్లు కట్టకుంటే కనికరం లేకుండా కనెక్షన్ కట్ చేసే విద్యుత్ సంస్థలు, వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్న బడా సంస్థల పట్ల ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొన్న గీతం యూనివర్సిటీ, ఇప్పుడు సంఘీ గ్రూప్ బకాయిల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెద్దలకు పవర్‌ను ఫుల్‌గా అందించే వెసులుబాటు కల్పించి పేదలపై మాత్రం సంస్థ, అధికారులు ప్రతాపం చూపుతున్నారంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క గీతం వర్సిటీ బకాయిలే రూ.118 కోట్లు ఉంటే, సంఘీవి రూ.4.21 కోట్లుగా ఉండటం గమనార్హం. ఇంత మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉన్నా సంస్థ ఎందుకు లైట్ తీసుకుంటుందనేది అర్థం కావడం లేదు. పెద్దలకు ఒక రూల్, పేదలకైతే మరో రూలా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు.
భారీగా పేరుకుపోయిన గీతం బకాయిలు
ప్రముఖ విద్యా సంస్థ గీతం యూనివర్సిటీ ఏకంగా రూ.118 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని తెలియడంతో హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని కోట్లు పెండింగ్‌లో ఉన్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. విద్యాసంస్థల ముసుగులో ఇన్నాళ్లుగా బకాయిలు చెల్లించకుండా తప్పించుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎస్పీడీసీఎల్ సంస్థ గీతం యూనివర్సిటీకి నోటీసులు పంపితే వాటిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించేంత వరకూ ఈ అంశం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. 2008 నుంచి కరెంట్ బిల్లు చెల్లించకపోవడంపై జస్టిస్ నగేశ్ భీమపాక సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని అధికారులను ప్రశ్నించారు. వారికెందుకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: BC Reservation Bills: బీసీలకు బీజేపీ సానుకూలమా.. స్పష్టత ఇవ్వండి
అదే దారిలో సంఘీ గ్రూప్
మరోవైపు, సంఘీ గ్రూపునకు చెందిన సంస్థలు కూడా రూ.4.21 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉన్నట్లు వెల్లడైంది. పరిశ్రమల పేరుతో భారీగా విద్యుత్‌ను వాడుకుంటూ, ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన సొమ్మును ఎగ్గొట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖ పనితీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఒక పేదవాడు లేదా మధ్యతరగతి వ్యక్తి వెయ్యి రూపాయల బిల్లు కట్టకపోయినా, మరుసటి రోజే ఇంటికి వచ్చి ఫ్యూజులు పీకేసే సిబ్బంది, వందల కోట్లు ఎగ్గొడుతున్న పెద్దల జోలికి వెళ్లకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. చట్టం అందరికీ ఒక్కటే అన్నది కేవలం పుస్తకాల్లోనేనా, అమలులో పెద్దలకు ఒక రూల్, పేదలకు మరో రూలా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బకాయిల వసూళ్లపై హైకోర్టు కన్నెర్ర చేయడంతో విద్యుత్ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికైనా నిబంధనల ప్రకారం ఆయా సంస్థల నుంచి బకాయిలు వసూలు చేస్తారో లేదో చూద్దాం.
విద్యుత్ బిల్లులపై ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఈ నెల నుంచి జారీ చేసే విద్యుత్ బిల్లులపై వినియోగదారుల మొబైల్ ఫోన్ నెంబర్, ఈ – మెయిల్ ఐడీ వంటి వివరాలను కూడా ముద్రించనున్నది. బిల్లులో ముద్రించిన మొబైల్ నెంబర్ లేదా ఇతర వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే, వినియోగదారులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించేందుకు వీలుగా, ఇప్పటికే విద్యుత్ బిల్లులపై సంబంధిత అసిస్టెంట్ ఇంజినీర్/అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మొబైల్ నెంబర్లను కూడా ముద్రిస్తున్నారు. దీంతో పాటు, సంస్థ పేరు టీజీఎస్పీడీసీఎల్‌పై స్పష్టంగా తెలంగాణ అనే పదాన్ని కూడా ముద్రించనున్నామని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: Electricity Shortage: ఆ గ్రామాల్లో విద్యుత్ కొరతతో.. అల్లాడుతున్న ప్రజలు.. పట్టించుకోని అధికారులు

