Cyber fraud Gang: కమీషన్ల కోసం కక్కుర్తి
సైబర్ క్రిమినల్స్‌కు సహకారం
చివరకు కటకటాల పాలైన వైనం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కమీషన్లకు కక్కుర్తి పడి సైబర్ క్రిమినల్స్‌కు (Cyber Crime) బ్యాంక్ ఖాతాలను సమకూర్చిన 8 మందిని ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో కలిసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. విచారణలో సైబర్ మోసగాళ్లు వీరి ఖాతాల ద్వారా రూ.24.10 కోట్ల మేర మోసాలు చేసినట్టుగా వెల్లడైంది. అదనపు కమిషనర్ (క్రైమ్స్) శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావుతో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘‘బోడుప్పల్‌కు చెందిన పూజారి జగదీష్ (31) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. గతనెలలో చిలకలగూడ ప్రాంతంలో అతడి ఆటో ఎక్కిన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కన్నయ్య.. ఆటో నడిపి నెలకు ఎంత సంపాదిస్తావు?, ఇంటి ఖర్చులకు సరిపోతాయా? అంటూ వివరాలు తీసుకున్నాడు. తేలికగా డబ్బు సంపాదించే మార్గం చెబుతానంటూ, నేను చెప్పినట్టుగా నగదు లావాదేవీలు జరుపుకోవటానికి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే నెలకు రూ.10వేలు వచ్చేట్టు చేస్తానన్నాడు. దీనికి జగదీష్ అంగీకరించి అతడి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వటానికి సిద్ధమయ్యాడు’’ అని వివరించారు.
Read Also- GHMC Council Meeting: మనం రౌడీలమా? ప్రజాప్రతినిధులమా?.. కార్పొరేటర్లపై జీహెచ్ఎంసీ మేయర్ ఆగ్రహం
ఈ క్రమంలో ఒకరి మొబైల్ నెంబర్ మరొకరు తీసుకుని, ఆ తరువాత కొన్నిరోజులకు ప్యారడైజ్ వద్ద కలిశారు. డీల్ ఓకే కావడంతో జగదీష్ తన ఆధార్, పాన్‌కార్డుల సహాయంతో బ్యాంక్ ఖాతా తెరిచాడు. కన్నయ్య తనకిచ్చిన సిమ్ కార్డుల నెంబర్లను వివరాల్లో పేర్కొన్నాడు. ఖాతా తెరిచిన జగదీష్ పాస్ బుక్కుతో పాటు ఏటీఎం కార్డు, ఇతర వివరాలను కన్నయ్యకు ఇచ్చాడు. ఆ తరువాత కన్నయ్య అతడి అకౌంట్‌లోకి రూ.10 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. దాంతో జగదీష్ తన భార్య, తల్లి, ఇతర బంధువుల పేరిట కూడా ఫెడరల్, కర్ణాటక, ఉత్కర్ష్, మహావీర్, బ్కాంక్ ఆఫ్ మహారాష్ట్ర, తమిళనాడు మర్కంటైల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్, కరూర్ వైశ్యా బ్యాంకుల్లో అకౌంట్లు తెరిపించి వాటి వివరాలను కూడా కన్నయ్యకు అందచేశాడు.
దీనికి తన స్నేహితుడైన బోడుప్పల్ నివాసి సునీల్ కుమార్ (40) సహాయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరికి సైబర్ మోసాలకు పాల్పడుతున్న పూనమ్, రమేశ్‌లతో పరిచయం అయ్యింది. మరిన్ని ఖాతాలు కావాలని వాళ్లు అడగటంతో పరిచయం ఉన్నపర్లపల్లి నిఖిల్, మణిదీప్లను కూడా ఇందులోకి లాగారు. పరిచయస్తులతో బ్యాంక్ అకౌంట్లు తెరిపించి వివరాలు ఇస్తే ఒక్కో ఖాతాకు రూ.1500 నుంచి రూ.3 వేలు ఇస్తామన్నారు. దాంతో ఈ ఇద్దరు కూడా మ్యూల్ అకౌంట్లు తెరిచారు.
Read Also- Journalists Protest: జాతీయ రహదారిపై పడుకొని జర్నలిస్టుల నిరసన.. ఎందుకంటే?
ఆ తరువాత పూనమ్‌తో నేరుగా పరిచయం ఏర్పరచుకున్న మణిదీప్ తన స్నేహితులైన బత్తుల పవన్, ప్రవీణ్, బాలాజీ నాయక్‌లతో కలిసి మరిన్ని మ్యూల్ అకౌంట్లు తెరిపించి, వాటి వివరాలను కన్నయ్య, పూనమ్, రమేశ్ లకు అందచేశాడు. వీటి సహాయంతో సైబర్ నేరగాళ్లు ఈ మ్యూల్ అకౌంట్లలోకి రూ.24.10 కోట్లను తమ ఉచ్ఛులో చిక్కిన వారి నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించారు. దీంట్లో నుంచి రూ.23.99 కోట్ల నగదును విత్ డ్రా కూడా చేసుకున్నారు. కాగా, కొనసాగుతున్న ఈ దందా గురించి టాస్క్‌ఫోర్స్ సీఐలు చంద్రశేఖర్, నాగరాజు, అనంతచారి, కరుణాకర్ రెడ్డి పక్కాగా సమాచారాన్ని సేకరించారు. అనంతరం సైబర్ క్రైం పోలీసులతో కలిసి విచారణ చేపట్టి 8 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ బుక్కులు, చెక్ బుక్కులు, సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బయో మెట్రిక్ మిషన్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రధాన సూత్రధారులు కన్నయ్య, రమేశ్, పూనమ్ ల కోసం గాలిస్తున్నట్టు అదనపు సీపీ శ్రీనివాస్ చెప్పారు.

