Egale Team: పక్కా వ్యూహం ప్రకారం మాదక ద్రవ్యాల దందా చేస్తున్న గ్యాంగులను కటకటాల వెనక్కి పంపిస్తున్న ఈగల్ టీం(EGALE Team) అధికారులు డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించే దిశలో కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వేర్వేరు స్వచ్ఛంధ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు. ఆయా విద్యా సంస్థల్లో డ్రగ్స్ ఉపయోగించటం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. చేయి చేయి కలుపుదాం.. డ్రగ్ ఫ్రీ స్టేట్(Drugs Free State) ను సాధిద్దాం అని పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య(Sandeep Sandilya) మంగళవారం ఇంపాక్ట్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సెలర్లు, ఆల్ ఇండియా మిల్లీ సభ్యులు, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్ అధికారులతో బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు.
600 యాంటీ డ్రగ్ అవేర్ నెస్ జాకెట్లు
దాదాపు 400మందికి డ్రగ్స్ ను ఎలా అరికట్టాలి? ఎవరైనా మాదక ద్రవ్యాలు వాడుతుంటే ఎలా పసిగట్టాలి? వారికి రిహాబిలిటేషన్ ఎలా అందివ్వాలి? అన్న అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇంపాక్ట్ ఫౌండేషన్(Impact Foundastion) ఇంతకు ముందు నుంచే డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ఈగల్ టీంతో కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 21న ఫౌండేషన్ సభ్యులు 600 యాంటీ డ్రగ్ అవేర్ నెస్ జాకెట్లను విద్యార్ఙినీ విద్యార్థులకు పంపిణీ చేశారు. 436 అవగాహనా కార్యక్రమాలు జరపటం ద్వారా 40వేల మంది విద్యార్థినీ, విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి తెలియచేశారు. దాంతోపాటు వారందరినీ యాంటీ డ్రగ్ సోల్జర్స్ గా మార్చారు. ఈ క్రమంలో ఫౌండేషన్ సభ్యులు కొందరికి ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య రివార్డులు అందచేశారు.
Also Read: Pakistan: భారత్‌పై ఆవేశంతో తీసుకున్న నిర్ణయానికి విలవిల్లాడుతున్న పాకిస్థాన్
సోల్జర్లుగా మార్చిన యాజమాన్యాలు
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 760 కాలేజీల్లో ఈగల్ టీంతో కలిసి యాంటీ డ్రగ్ సోల్జర్స్ ను తయారు చేస్తోంది. తమ తమ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిలో 75శాతానికి పైగా విద్యార్థులను యాంటీ డ్రగ్(Anti Drugs) సోల్జర్లుగా మార్చిన యాజమాన్యాలకు సందీప్ శాండిల్య రివార్డులు అందించారు. వీటిని పొందిన వారిలో మల్లారెడ్డి యూనివర్సిటీ, సుమతిరెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలనీ ఫర్ ఉమెన్, మల్లారెడ్డి(Malla Reddy) ఫార్మా కాలేజీ అధ్యాపకులు ఉన్నారు. అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు యాంటీ డ్రగ్ సోల్జర్లుగా విద్యార్థులను తీర్చిదిద్దటానికి చర్యలు తీసుకోవాలని సందీప్ శాండిల్య కోరారు. కార్యక్రమంలో ఈగల్ టీం ఎస్పీ సీతారాం, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంపా నాగేశ్వరరావు, ఇంపాక్ట్ అడ్వయిజర్ శ్రీధర్ వీరమల్ల, ఈగల్ టీం డీఎస్పీలు కే.సైదులు, శంకర్ యాదవ్, సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Also Read: Gadwal Atrocity: గద్వాల జిల్లాలో దారుణం.. ఆస్తి కాజేసి తల్లికి రోగముందని ప్రచారం!