Konda Surekha: రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడానికి ప్రజా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రకృతిని కాపాడుతూనే, స్థానిక ప్రజల జీవనోపాధులను పెంచే బాధ్యతాయుత పర్యాటకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సరస్సులు, జాతీయ ఉద్యానవనాలు, అమ్రాబాద్ – కవ్వాల్ వంటి ప్రముఖ టైగర్ రిజర్వులతో రాష్ట్రం 7,200 చ.కి.మీ విస్తీర్ణంలో సహజసిద్ధమైన సంపదను కలిగి ఉందన్నారు. పర్యాటక విధానం 2025-30, ఎకో టూరిజం ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టి, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నిర్ణయించింది. డెక్కన్ వుడ్ అండ్ ట్రయల్స్ పేరుతో రాష్ట్ర ఎకోటూరిజం బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగి 2024 నాటికి 36కు చేరుకోవడం రాష్ట్ర విజయంగా మంత్రి పేర్కొన్నారు. కొత్త ఎకో టూరిజం ప్రదేశాలైన నందిపేట, తాడ్వాయి, పాఖాల్‌లను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలో గైడెడ్ ఫారెస్ట్ ట్రెక్కులు, ఆన్‌లైన్ బుకింగ్ యాప్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎకో టూరిజం ద్వారా 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాలను చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు.
Also Read: Ustaad Bhagat Singh: ‘స్టెప్ ఏస్తే భూకంపం’.. దేఖ్‌లేంగే సాలా సాంగ్ ప్రోమో అదిరింది
దేవాలయాల అభివృద్ధి
దేవాదాయ శాఖ నిర్వహణలో 12,434 దేవాలయాలు ఉన్నాయని, 6,439 ఆలయాలకు ప్రభుత్వం నిత్య ధూప దీప నైవేద్యం నిమిత్తం ఆర్థిక సహాయం అందజేస్తుందని మంత్రి తెలిపారు. వేద, ఆగమ, సంస్కృత, శిల్ప కళాశాలలు నిర్వహిస్తూ వేద విద్యను ప్రోత్సహిస్తున్నారు. ఐదు రాష్ట్రాల భక్తులు పాల్గొనే సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధికి శాశ్వత నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. టెంపుల్ టూరిజం కోసం వారసత్వ సంపదతో కూడిన చారిత్రాత్మక ఆలయాలను కలుపుతూ నాలుగు సర్క్యూట్‌లలో దేవాలయాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, మేడారం, కాళేశ్వరం, ధర్మపురి వంటి ప్రధాన దేవాలయాల మాస్టర్ ప్లాన్‌లను అమలు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలుగజేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ శాఖ అధికారులు బాగా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సమ్మిట్ సందర్భంగా దేవాదాయ శాఖ తరఫున సేవలు అందించిన ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ సిబ్బందిని ఆమె అభినందించారు.
ఇందిరమ్మ చీరలో మంత్రి
గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి కొండా సురేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ‘ఇందిరమ్మ’ చీరలో సమ్మిట్‌లోకి రావడంతో, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఆమెను ఆత్మీయంగా పలకరించారు. మంత్రి సురేఖతో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఆసక్తి చూపించారు.

