John Wesley: రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 12వేల గ్రామ పంచాయితీలకు చెందిన గ్రామకంఠం భూములను 30 ఏళ్ళ పాటు ఐవోఆర్‌ఏ ఎకోలాజికల్ సొల్యూషన్ ప్రయివేటు సంస్థకు అప్పజెప్పడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఖండించింది. సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పాలక మండళ్ళు లేని సమయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం నిరభ్యంతర పత్రాలను తీసుకోవాలనడం అప్రజాస్వామికం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. వేలాది కోట్ల ఆస్తులను ఒకే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం ఉన్నట్లు సందేహాలు వస్తున్నాయన్నారు. ఈ ఒప్పందం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగంలోని 73వ సవరణ స్పూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు.
Also Read: John Wesley: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం నాటకం.. సీపీఐ నేత జాన్‌వెస్లీ కీలక వ్యాఖ్యలు
గ్రామాలకు రావాల్సిన ఆదాయం కోల్పోతుంది
తక్షణమే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని, హరిత సౌభాగ్యం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంలోని గ్రామ కంఠం భూములను ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేటు కంపెనీకి కట్టబెడితే గ్రామపంచాయితీలు తమ హక్కులు కోల్పోతాయన్నారు. గ్రామాలకు రావాల్సిన ఆదాయం కోల్పోతుందని, దీంతో భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, స్మశానవాటికలు, పేదల పునరావాసం, తదితర ప్రజా అవసరాలకు భూములు లేకుండా పోతాయన్నారు. భూముల విలువ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుని, గ్రామపంచాయతీలకే పూర్తి హక్కులను ఉండేలా చూడాలని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Also Read: John Wesley: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ వ్యతిరేకం: జాన్ వెస్లీ

