Quake Pub Rides: క్వేక్ పబ్‌పై ఈగల్ ఫోర్స్ మెరుపు దాడులు
క్వేక్ పబ్బులో 8 మందికి డ్రగ్ పాజిటివ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ ఫోర్స్ అధికారులు, సైబరాబాద్ పోలీసులతో కలిసి కొండాపూర్‌లోని క్వేక్ పబ్బుపై (Quake Pub Rides) మెరుపు దాడులు జరిపారు. పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, 8మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ సమీపిస్తున్న నేపథ్యంలో క్వేక్ పబ్ యాజమాన్యం ఉక్రెయిన్ దేశానికి చెందిన ప్రముఖ డీజే అర్భాట్స్‌తో కన్సర్ట్ నిర్వహించారు. డ్రగ్స్‌కు అలవాటుపడ్డ వంద మందికి పైగా దీంట్లో పాల్గొన్నట్టు ఈగల్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులతో కలిసి పబ్బుకు వెళ్లిన ఈగల్ ఫోర్స్ అధికారులు డ్రగ్ డిటెక్షన్ కిట్ల సహాయంతో 14 మందికి పరీక్షలు జరుపగా రియాజ్, యశ్వంత్, భరత్, మోహన్, సబ్రీనా, త్రిష, శ్రవణ్, విశాల్ అనే వ్యక్తులు వేర్వేరు రకాల డ్రగ్స్ సేవించినట్టు నిర్ధారణ అయ్యింది.
Read Also– Cylinder Explosion: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్
ఈ 8 మందిని అదుపులోకి తీసుకుని సైబరాబాద్ నార్కొటిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించనున్నట్టు ఈగల్ ఫోర్స్ అధికారులు తెలిపారు. కాగా, ఈగల్ ఫోర్స్ అధికారులు జరిపిన దాడుల్లో గతంలో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ విక్కీ అనే యువకుడు మరోమారు దొరికాడు. అయితే, అతనికి జరిపిన డ్రగ్ పరీక్షల్లో నెగెటీవ్ అని వచ్చింది. గతంలో దొరికినపుడు విక్కీని రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించినట్టు ఈగల్ ఫోర్స్ అధికారులు చెప్పారు. అక్కడ అందించిన చికిత్స, కౌన్సిలింగ్‌తో విక్కీ డ్రగ్స్ అలవాటు నుంచి బయట పడ్డాడని చెబుతూ ఇది అందరికీ స్పూర్తి కావాలన్నారు.
న్యూఇయర్ వేడుకల వేళ దూకుడు
కొత్త సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ ను కట్టడి చేయటానికి విస్తృత చర్యలు తీసుకుంటున్నట్టు ఈగల్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గడిచిన పది రోజుల్లో వేర్వేరు చోట్ల దాడులు జరిపి 27మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. దాంతోపాటు 17మంది వినియోగదారులను కూడా అదుపులోకి తీసుకుని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించినట్టు తెలిపారు. వీరిలో అయిదుగురు విదేశీ యువతులు ఉన్నట్టుగా చెప్పారు. ఇక, 17 కేసులు నమోదు చేసి 68గ్రాముల కొకైన్, 50.5గ్రాముల ఎండీఎంఏ, 2గ్రాముల ఎల్ఎస్డీ బ్లాట్స్, 381.93కిలోల గంజాయిని సీజ్ చేసినట్టు తెలిపారు. ఇకపై కూడా విస్తృతస్థాయిలో దాడులు, తనిఖీలు ఉంటాయన్నారు. డ్రగ్స్ వ్యాపారం, వినియోగం గురించి తెలిసిన వారు 1908 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. 8712671111 నెంబర్ కు వాట్సాప్ కూడా చేయవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెట్టటంతోపాటు రివార్డులు ఇస్తామని చెప్పారు.
Read Also- Open AI: చాట్‌జీపీటీ మెడకు చుట్టుకున్న యువకుడి మృతి కేసు

