Cyber Crime: హ్యాప్పీ న్యూ ఇయర్.. మా లక్కీ డ్రాలో గిఫ్ట్ గెలుచుకున్న విజేత మీరే మీరే అంటూ మెసేజ్ వచ్చిందా?.. లక్కు తగిలిందనుకుని దానిని ఓపెన్ చేయకండి. చేశారో.. మీ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బు గల్లంతు కావటం ఖాయం. కొత్త సంవత్సరం వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో సైబర్ క్రిమినల్స్ ఈ నయా మోసాలకు శ్రీకారం చుట్టారు. వేలాది మందికి ర్యాండమ్ గా మెసేజీలు పంపిస్తూ డబ్బు లూటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు.
గిఫ్ట్ గెలుచుకున్నారు..
రకరకాలుగా జనానికి టోకరా ఇస్తూ ఏటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్లు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీనిని నిదర్శనంగా అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగిన తరువాత వీఐపీ దర్శనం ఇప్పిస్తామంటూ మెసేజీలు పంపించి వేలాదిమందికి మోసం చేసిన వైనాన్ని పేర్కొనవచ్చు. తాజాగా న్యూ ఇయర్ సమీపించటంతో గిఫ్ట్ గెలుచుకున్నారు, ఈవెంట్ల టిక్కెట్లు, ప్రయాణాల్లో రాయితీలు అంటూ వాట్సాప్ తోపాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంల నుంచి మెసెజీల రూపంలో ఏపీకే ఫైళ్లను పంపిస్తూ సరికొత్త మోసాలు మొదలు పెట్టారు. నిజంగానే గిఫ్ట్ వచ్చిందనో.. ఈవెంట్ టిక్కెట్ సంపాదించుకోవచ్చనో మెసేజీని ఓపెన్ చేస్తే దాంట్లో లింక్ చేస్తే ఆ వెంటనే ఫోన్ సైబర్ క్రిమినల్స్ ఆధీనంలోకి వెళ్లిపోతుందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పారు.
Also Read: Telangana Assembly 2025: సీఎం రేవంత్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
బ్యాంక్ నుంచి మెసేజ్..
ఓటీపీలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, కాంటాక్ట్ లిస్టులోని నెంబర్లు, ఫోటోలు, వాట్సాప్ లో ఉన్న ఫోటోలు కేటుగాళ్ల చేతికి చిక్కుతాయని తెలిపారు. ఆ తరువాత సైబర్ క్రిమినల్స్ ఖాతాల్లో ఉన్న డబ్బును తమ అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసుకుంటారని తెలిపారు. నగదు విత్ డ్రా అయిన తరువాత బ్యాంక్ నుంచి మెసేజీ వచ్చాకగానీ మోసపోయిన విషయం తెలియదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజీలను ఓపెన్ చేయవద్దని, ఫైళ్లను ఇన్ స్టాల్ చేసుకోవద్దని సూచించారు. వాట్సాప్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అధికారిక యాప్ స్టోర్ల నుంచి మాత్రమే ఆయా యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.
Also Read: Student Death: మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య

