Datta Jayanti: భక్తిశ్రద్ధలతో మృత్యుంజయ జప యజ్ఞం
శివ నామస్మరణలో దత్తగిరి
ముగిసిన దత్త జయంతి ఉత్సవాలు
జహీరాబాద్, స్వేచ్ఛ: సంగారెడ్డి జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో దత్త జయంతి (Datta Jayanti) ముగింపు సందర్భంగా ఆది దంపతులైన శివ పార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ పరిసరాలు ఓం నమశ్శివాయ పంచాక్షరి మంత్రంతో మారుమోగింది. వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆది దంపతుల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం గుప్తా, ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్, పార్వతి పరమేశ్వరులకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు జీలకర్రబెల్లం, కన్యాదానతంతు నిర్వహించారు. వేదపండితులు నిర్ణయించిన సుముహూర్తంలో అమ్మవారి మెడలో పరమేశ్వరుడు మాంగల్యధారణ చేశారు. వైదిక పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. భజన సంకీర్తనలు కొనసాగాయి. గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న ఉత్సవాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో ముగిశాయి.
హరినామ జపంతోనే ఆత్మసాక్షాత్కారం
జహీరాబాద్, స్వేచ్ఛ: కలియుగంలో ఆత్మసాక్షాత్కారం కోసం హరినామ జపం చేయడం మినహా మరో మార్గం లేదని సంగారెడ్డి జిల్లా హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి శ్రీ గోకులేష్ ప్రభుజీ వ్యాఖ్యానించారు. జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో మహీంద్రా కాలనీలోని గోదా సమేత శ్రీ వెంకటేశ్వర మందిరంలో ఆదివారం నగర సంకీర్తన అట్టహాసంగా జరిగింది. శ్రీకృష్ణ రస భక్తి గీతాలతో భక్తులు నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సత్సంగ సమావేశంలో పాల్గొని గోకులేష్ ప్రభుజీ భక్తులనుద్దేశించి ప్రవచించారు. మానవ హృదయంలో నిద్రావస్థలో ఉన్న భగవత్ ప్రేమను జాగృతం చేయడమే కాకుండా జన్మ మృత్యు జరావ్యాధుల నుండి విముక్తి కల్పించే మహమంత్రమే హరేకృష్ణ మంత్రమని సెలవిచ్చారు.
Read Also- Telangana Agriculture: సాగులో తెలంగాణ సరికొత్త రికార్డ్.. పంజాబ్‌ను దాటేసిన తెలంగాణ
భగవంతుడి నామాన్ని జపం చేయడం అంటే భగవంతునితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండడమేనని సూచించారు. మనిషి తన నిత్య జీవితంలో తెలిసి, తెలియక చేసిన పాపాలను ప్రక్షాళన చేసి పరమ పునీతులుగా తీర్చి దిద్దే శక్తి హరి నామానికి ఉందన్నారు. ప్రస్తుత కాలంలో యజ్ఞ యాగాదులు నిర్వహించడం సాధ్యం కాదని, అయితే అత్యంత సులభంగా ఉండేందుకు చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహమంత్రాన్ని జన బాహుళ్యం లోకి తీసుకొని రావడం జరిగిందని వెల్లడించారు. మనిషి జీవిత ప్రాముఖ్యత, దుఃఖాలనుండి విముక్తి, హరినామ సంకీర్తన ఇత్యాది అంశాలపై ప్రభుజీ సుధీర్ఘ వివరణ ఇచ్చారు. మానవుడికి, మృగాలకు ఉన్న వ్యత్యాసాలను సోదాహరణంగా వివరించారు. అనంతరం భక్తులకోసం నిర్ణ జ్ఞానారెడ్డి ప్రసాద వితరణ చేశారు.

