తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : Garib Kalyan Yojana Scheme: ‘గరీబ్ కల్యాణ్ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంటే రేషను దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టరంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 సెప్టెంబరు 3న కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని చౌకధరల దుకాణం దగ్గర కలెక్టర్ జితేషన్ పాటిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
రేషను బియ్యానికి కేంద్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లకు పైగా సబ్సిడీ ఇస్తూ ఉంటే రాష్ట్రం కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఇస్తున్నదని, ఏ ప్రభుత్వం గొప్ప అంటూ ఒక ప్రకటనలో రాష్ట్రాన్ని ప్రశ్నించారు. ప్రతీ రేషను కార్డుపై ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఇచ్చే స్కీమ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో ఆదివారం (ఉగాది పండుగ రోజున) లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకాన్ని ఉద్దేశిస్తూ బండి సంజయ్ సోమవారం పై వ్యాఖ్యలు చేశారు.
Also Read: SLBC tunnel update: ఎస్ఎల్ బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. పనులపై కీలక అప్ డేట్
నిజానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది దొడ్డు రకం బియ్యానికి మాత్రమే. ప్రతి ఏటా రూ. 5,489.50 కోట్ల చొప్పున రాష్ట్రంలోని పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 5,175.53 కోట్ల చొప్పున అదనంగా జత చేస్తున్నది. దీంతో దొడ్డు బియ్యానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి సబ్సిడీగా ఇస్తున్నది మొత్తం రూ. 10,665.03 కోట్లు. ఆ ప్రకారం రాష్ట్రంలో సుమారు 90 లక్షల కార్డుల ద్వారా సుమారు 2.85 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందుతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత వారం క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సన్నబియ్యాన్ని ఇచ్చే లెక్కల్లోకి అదనంగా 10 లక్షల కొత్త కార్డుల ద్వారా దాదాపు పాతిక లక్షల మంది లబ్ధిదారులు చేరుతున్నారని, మొత్తం కార్డుల సంఖ్య కోటి దాటుతున్నదని వివరించారు.
Also Read: BRS Silver jubilee: ఆ ఒక్క సభపైనే ఆశలు? పడరాని పాట్లు పడుతున్న బీఆర్ఎస్?
కేంద్రం నుంచి అందుతున్న సబ్సిడీ దొడ్డు, సన్నరకం బియ్యానికి ఒకేలా ఉంటున్నదని, ఇప్పటివరకూ అందిస్తున్న సబ్సిడీయే ఇకపైన కూడా కొనసాగనున్నదని, అదనంగా వచ్చేదేమీ లేదని మంత్రి వివరించారు. కానీ సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ధరకు కొని ప్రజలపై భారం వేయకుండా పౌరసరఫరాల శాఖ భరిస్తున్నదన్నారు. సన్న బియ్యానికి అదనంగా అయ్యే ఖర్చుతో పాటు కొత్తగా 10 లక్షల కార్డులు చేరుతున్నందున (దాదాపు పాతిక లక్షల మంది కొత్త లబ్ధిదారులు) గతంకంటే రూ. 2,858.26 కోట్లు ఎక్కువగా ఖర్చు అవుతున్నదని తెలిపారు. గతంలో దొడ్డు బియ్యానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి రూ. 10,665.03 కోట్లను ఖర్చు చేస్తే ఇప్పుడు సన్న బియ్యానికి రూ. 13,523.29 కోట్లు ఖర్చవుతున్నదని, కానీ ప్రతీ ఒక్కరూ వినియోగించుకునే వీలున్నదని తెలిపారు.
Also Read: TGPSC: గ్రూప్-1 టాపర్ గా మహిళా.. టాప్-10 అభ్యర్థుల మార్కులు ఇవే!
గతంలో దొడ్డు బియ్యానికి రాష్ట్ర వాటా రూ. 5,175.53 కోట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు సన్న బియ్యంతో పాటు కొత్తగా 10 లక్షల కార్డులకు కలిపి రూ. 8,033.79 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని, కేంద్రం మాత్రం అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వడంలేదని వివరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్న లెక్కల ప్రకారం ప్రతి ఏటా రేషను బియ్యానికి కేంద్రం నుంచి రూ. 10 వేల కోట్లకు పైగా వస్తున్నదని చెప్తున్నప్పటికీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది.
కేంద్ర మంత్రి చెప్తున్నదాంట్లో సగం మాత్రమే సబ్సిడీ రూపంలో అందుతున్నది. ఎక్కువ డమ్ములు ఇస్తున్నందున మోదీ ప్రభుత్వం గొప్పదా?.. రాష్ట్ర ప్రభుత్వం గొప్పదా?.. అంటూ బండి సంజయ్ ప్రశ్నించడం వెనక ఏ ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇస్తే అదే గొప్పది.. అనే అర్థం స్ఫురిస్తున్నది. సన్న బియ్యం పంపిణీలో కేంద్రం వాటా రూ. 5,489.50 కోట్లుగా ఉంటే రాష్ట్ర వాటా రూ. 8,033.79 కోట్లుగా ఉన్నది. దీంతో ఏ ప్రభుత్వం గొప్పదో ఇప్పుడు ప్రజలు తేల్చుకునే సమయం ఆసన్నమైంది అని కాంగ్రెస్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు