Deputy CM Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో సామాన్యులకు సిమెంటు, స్టీల్, ఇటుకలు, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉండేలా మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలను ఏర్పాటు చేసి, ధరలను నిర్ణయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు ఆదేశించారు. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ సమావేశంలో ఆయన ఈ సూచన చేశారు. ఈ సమావేశంలో మంత్రులు, సబ్ కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, (Uttam Kumar Reddy) దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిపై శాఖల వారీగా మంత్రుల బృందం సమీక్షించింది.
Also Read: Minister Seethakka: అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు.. సొంత భవనాలకు నిధులివ్వండి!
ఇసుక విక్రయ కేంద్రాలు..
సామాన్యులకు ఇసుక రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉండాలన్న గత సమావేశ నిర్ణయం మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో 20 ఇసుక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సబ్ కమిటీ సభ్యులు, మార్కెట్ యార్డులు, ప్రభుత్వ స్థలాల్లో త్వరితగతిన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల బృందం చర్చించింది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో భూముల బేసిక్ విలువను పెంచితే దరఖాస్తుదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు మంత్రుల బృందానికి సూచించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక క్వారీలు..
ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిరిజనులే ఇసుక క్వారీలు నిర్వహించేందుకు చేపట్టిన చర్యలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం, సబ్ కమిటీ చైర్మన్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సబ్ కమిటీలో చర్చించిన విషయాల్లో ప్రగతి కనబరచాలని, ఈ క్రమంలో అధికారులకు ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే తనతో నేరుగా సంప్రదించి ఫైళ్ల కదలికలో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.
హైదరాబాద్ నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే కార్యక్రమంపై పారిశ్రామిక వాడల వారీగా సబ్ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించింది. మైన్స్, జియాలజీ శాఖలో అమల్లో ఉన్న వన్ టైం సెటిల్మెంట్ ప్రగతిని సబ్ కమిటీ సభ్యులు సమీక్షించారు. కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి వస్తే దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి మెరుగైన స్థితిలో ఉందని సబ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, కమిషనర్లు శశాంక, హరిత, హరి కిరణ్, గౌతం, సురేంద్రమోహన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Minister Jupally Krishna Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై.. జూపల్లి కీలక వాఖ్యలు!