Bhatti Vikramarka: మున్సిపల్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka Mallu) స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు గొప్ప చరిత్ర కలిగిన పట్టణం మధిర.. ఈ పట్టణంలో అభివృద్ధినీ ఉరకలు పెట్టిస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం మధిర పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. దేశ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి 86 మందితో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఏర్పడిన అద్భుతమైన రోజు డిసెంబర్ 28 అని డిప్యూటీ సీఎం తెలిపారు. మధిర పట్టణ ప్రజల అవసరాలు డ్రైనేజీ ఇతర ఏ సేవలకైనా మాకోసం ఒక కార్యాలయం ఉంది, సిబ్బంది ఉన్నారు అన్న భావన కల్పించేందుకు ఈ భవనానికి శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపారు. భారత స్వాతంత్ర సమరానికి పునాది పడింది మధిర పట్టణాల్లోనే, స్వాతంత్ర సమరయోధులకు ఆశ్రయము కల్పించింది ఈ పట్టణంలోని అని తెలిపారు.
మధిర నడిబొడ్డున మూడు రంగుల జెండా..
దేశానికి దిశా నిర్దేశం చేసిన నాయకులు పుట్టిన చారిత్రాత్మక నగరం మధిర అన్నారు. పింగళి వెంకయ్య(Pingali Venkayya) రూపొందించిన పతాకాన్ని ఆవిష్కరించకుండా నిజాం ప్రభుత్వం నిషేధం విధిస్తే సర్దార్ జమలాపురం కేశవరావు సవాల్ విసిరి మారువేషన్లో మధిర నడిబొడ్డున మూడు రంగుల జెండా ఎగురవేశారని అది స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించింది అని తెలిపారు. మధిర సమీపంలోని తొండలగోపవరం కేంద్రంగా నల్లమల గిరిప్రసాద్ నిజాం వ్యతిరేక పోరాటం నడిపారని తెలిపారు. గ్రంథాలయ ఉద్యమం ఆంధ్ర మహాసభలకు మధిర కేంద్రంగా కొనసాగిందని వివరించారు. దేశానికి అంతటికి ఒక సంవత్సరం ముందే స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి 17 సెప్టెంబర్ 1948లో ప్రధానమంత్రి నెహ్రూ, హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ల నాయకత్వంలో నిజాం నుంచి విముక్తి కల్పించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారని తెలిపారు.
అనుమతులు మంజూరు
ఒకపక్క ఏరు మరోపక్క చెరువుతో మధిర పట్టణం విస్తరణ సమస్యను ఎదుర్కొంటుంది జనం మాత్రం మధిరలో నివసించేందుకు పోటీ పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశాం, భూ సేకరణకు నిధులు కూడా కేటాయించామని తెలిపారు. మధిర పట్టణ విస్తీర్ణనతో పిల్ల నుంచి డ్రైనేజీ నీరు బయటికి రాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నట్టు తెలిపారు. ఇళ్లలోంచి వచ్చే నీటిని ట్రీట్మెంట్ చేసి బయటకి పంపుతాం, వరద నీటి కోసం మరో ప్రత్యేక వ్యవస్థను నిర్మిస్తాం తొందర్లోనే వాటికి అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం సంబంధిత అధికారులు, వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
Also Read: Doctors Demands: కొత్త మెడికల్ కాలేజీల్లో అలవెన్స్ ఇవ్వాలని.. ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్!
అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనులు
ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అదనపు కలెక్టర్ ను ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా నియమించాం వారిపైన కలెక్టర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పర్యవేక్షిస్తారని తెలిపారు. వర్షం రాగానే కరెంటు స్తంభాలపై చెట్లు పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ సమస్యను పరిష్కరించేందుకు అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే ఎంత గాలి, వర్షం వచ్చిన కరెంటు సరఫరా నిలిచిపోవడం అనేది ఉండదని డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్టే మధిర పట్టణంలోని పేదలు నివసించడానికి జి ప్లస్ టు టవర్స్ తో హౌసింగ్ కాలనీ నిర్మించబోతున్నాం త్వరలోనే ఈ కార్యక్రమానికి భూమి పూజ చేస్తామని డిప్యూటీ సీఎం వివరించారు.
తాజా కూరగాయలు
కోర్టు కొత్త బిల్డింగ్ పనులు శరవేయంగా సాగుతున్నాయని అన్నారు. మధిర పరిసర ప్రాంతాల్లోని రైతులు వారి ఉత్పత్తులను మధిర పట్టణంలో అమ్ముకునేందుకు, మధిర పట్టణ వాసులకు తాజా కూరగాయలు అందుబాటులోకి తెచ్చేందుకు రైతు బజార్ ఏర్పాటు చేశానని డిప్యూటీ సీఎం అన్నారు. మధిర పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలన్న ఆలోచనతో, మన పిల్లలు చదువుకుంటేనే మధిర పట్టణానికి భవిష్యత్తు ఉంటుందన్న దూరదర్శతో డిగ్రీ, జూనియర్, కళాశాల తోపాటు హై స్కూల్ భవనానికి కొత్త బిల్డింగులు నిర్మిస్తున్నాం ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచామని డిప్యూటీ సీఎం తెలిపారు.
ప్రపంచీకరణతో..
మధిరను విద్యా కేంద్రంగా మార్చాలని ఆలోచనతోనే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల, ఐటిఐ లను తీసుకువచ్చినట్టు తెలిపారు. ప్రపంచీకరణతో పరిశ్రమల్లో కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు ఆ పరిశ్రమల్లో ఉపయోగించే యంత్రాలను మన ఐటిఐలో ప్రవేశపెట్టి వాటిని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి మన మధిర నియోజకవర్గానికి చెందిన యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. త్వరలో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పనులకు భూమి పూజ చేస్తానని అన్నారు.
Also Read: RajaSaab SKN: ట్రైలర్ వచ్చాకా ట్రోలింగ్స్ ఉండవ్.. రెబల్ రూలింగ్సే.. ఎస్‌కేఎన్..
రైతులు ఆందోళన..
చదువు పూర్తి చేసుకుని ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లి లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నారు. అయినా ఉద్యోగం రాక యువత, ఖర్చులు భరించలేక మన రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయాన్ని నా పాదయాత్ర సమయంలో అనేకమంది వివరించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు మధిర పట్టణంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను మంజూరు చేశామని తెలిపారు. హైదరాబాదులో కోచింగ్ ఇచ్చే అత్యుత్తమ లెక్చరర్ల ద్వారా ఆన్ లైన్లో మధిర పట్టణంలోని ఇక్కడే కూర్చుని చదువుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
హైదరాబాద్ వెళ్లి కోచింగ్
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందితే స్థానిక రైతులకు యువతకు మేలు చేకూరుతుందన్న ఆలోచనతో మధిర, ఎర్రుపాలెం రెండు ప్రాంతాల్లో ఆధునిక ఇండస్ట్రియల్ పార్కులు ప్రారంభించామన్నారు. ఈ పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన కరెంటు, నీళ్లు, రోడ్డు, మార్కెట్ వంటి అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకుంటే పరిశ్రమలు పెట్టుకునేందుకు స్థలాలు కేటాయిస్తాం అన్నారు.
మహిళలకు స్వయం ఉపాధి
గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టే మధిర పట్టణంలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు మెప్మా ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తాం అన్నారు. ఎన్ని ఎక్కువ గ్రూపులు పెట్టుకుంటే అంత మంచిది, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్, సబ్బులు, అగరవత్తుల తయారీ వంటి కార్యక్రమానికి వారం రోజుల్లో భూమి పూజ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
రాజకీయాలకు అతీతంగా..
మధిర పట్టణం మన అందరిదీ పట్టణానికి సమీపంలో అమరావతి నగరం, బందర్ పోర్టు, రైల్వే ట్రాక్, నాలుగు గ్రీన్ ఫీల్డ్ హైవేలు వెళ్తున్నాయి ఇక్కడ ఉత్పత్తి చేసే వస్తువులన్నిటిని సులభంగా రవాణా చేసుకునే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం వివరించారు. రాజకీయాలు ఎన్నికల వరకే మళ్లీ ఎన్నికలు మరో మూడు సంవత్సరాలకు జరుగుతాయి రాజకీయాలకు అతీతంగా మధిర పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎవరికి ఏ ఆలోచన ఉన్న తనతో పంచుకోవాలని డిప్యూటీ సీఎం పట్టణ మేధావులు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. మధిర పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోంది, ఐదు చెరువులను అభివృద్ధి చేస్తున్నాం, జమలాపురం ఆలయాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి నియోజకవర్గంలో మొత్తంగా టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
Also Read: GHMC: గాంధీ ఆస్పత్రి పరిసరాలలో దర్శనమిచ్చిన కుక్కలు.. కమిషనర్ సీరియస్!

