Child demonization: తెలిసినవాళ్లే కదా అని ఏమరుపాటుగా ఉంటున్నారా? చనువు పెంచుకుంటున్నారా? అయితే, జాగ్రత్తగా ఉండాల్సిందే. అవతలివారిలోని మృగం ఎప్పుడైనా మేల్కోవచ్చు. లైంగిక దాడి జరపొచ్చు. బయటివారి సంగతి అలా ఉంచితే జన్మనిచ్చినవారు తోబుట్టువులు బంధువులు తెలిసిన వారే ఈ నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. బాధితుల్లో బాలురు కూడా ఉండటం. పోలీస్ లెక్కల ప్రకారం 2024లో 15 సంవత్సరాలలోపు బాలబాలికలపై 87 లైంగిక దాడులు జరుగగా 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న 1,970మందిపై అఘాయిత్యాలు జరిగాయి.
18 సంవత్సరాలకు పైబడిన మరో 888 మంది కూడా లైంగిక దాడులకు గురయ్యారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే 99.2శాతం కేసుల్లో బాధితులకు బాగా తెలిసిన వారే ఈ నేరాలకు పాల్పడటం. నిందితుల్లో మైనర్లు కూడా ఉంటుండటం. పోక్సో కేసుల్లో వరుసగా 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు పడుతున్నా పలువురు ఈ దారుణాలకు తెగబడుతుండటం. ఏయేటికాయేడు ఈ తరహా నేరాలు పెరిగి పోతుండటానికి మద్యం, గంజాయి మత్తు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దాంతోపాటు అరచేతుల్లోకి వచ్చేసిన మొబైల్ ఫోన్లు కూడా ఈ తరహా దారుణాలు పెరిగి పోతుండటానికి దారి తీస్తోంది.
Also Read: Minister Punnam Prabhakar: ములుగు ప్రజల దశాబ్దాల కల నెరవేరింది.. మంత్రి పొన్నం ప్రభాకర్!
దీనికి నిదర్శనంగా షాద్ నగర్ స్టేషన్ పరిధిలో జరిగిన ఉదంతాన్ని పేర్కొనవచ్చు. మద్యానికి అలవాటు పడ్డ ఓ కిరాతకుడు జన్మనిచ్చిన కూతురి పైనే ఆరునెలలపాటు లైంగిక దాడి జరిపాడు. బాలిక ఆరోగ్య పరిస్థితిలో మార్పును గమనించిన స్కూల్ టీచర్ల ప్రశ్నించినపుడు బాలిక తండ్రి చేతుల్లో అనుభవిస్తున్న నరకయాతన గురించి చెప్పింది. దాంతో టీచర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపించగా ఆ చిన్నారి గర్భం దాల్చినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు.
నందనవనం కాలనీలో గంజాయి మత్తుకు బానిసైన ఆబేద్ బిన్ ఖాలీద్ అనే వ్యక్తి సహచరులతో కలిసి పట్టపగలే ఇంట్లోకి చొరబడి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు. బాధితురాలి తమ్మునికి కత్తులు చూపించి ఓ గదిలో నిర్భంధించి ఈ నేరానికి పాల్పడటం గమనార్హం. వనపర్తిలో ఓ ట్యూషన్ టీచర్ తన వద్ద చదువుకోవటానికి వచ్చిన 11మంది నాలుగో తరగతి విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడి చివరకు విషయం వెలుగులోకి రావటంతో కటకటాల పాలయ్యాడు. ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే మైనారిటీ తీరని యువకులు కూడా ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం. దీనికి ప్రధాన కారణం ఇంటర్ నెట్ అన్నది సుస్పష్టం. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థి వద్ద కూడా మొబైల్ ఫోన్ ఉండటం కామన్ అయిపోయింది.
తెలిసీ తెలియని వయసులో సెల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తున్న వారిలో కొందరు అలాంటి అనుభవం కోసం దారుణాలకు తెగిస్తున్నారు. హయత్ నగర్ స్టేషన్ పరిధిలో పదో తరగతి చదువుతున్న నలుగురు ఇలా వీడియోలు చూడటానికి అలవాటుపడి తమ తరగతిలోనే చదువుతున్న మానసిక పరిస్థితి సరిగ్గా లేని బాలికపై అత్యాచారం జరిపారు. దానిని వీడియో కూడా తీశారు. వీడియో వెలుగు చూడటంతో బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఇక్కడ సీరియస్ గా పట్టించుకోవాల్సిన అంశం ఏమిటంటే బాధితుల్లో మైనర్ బాలురు కూడా ఉంటుండటం.
తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి:
తల్లిదండ్రులు ప్రతీ రోజూ కనీసం గంట సమయాన్ని పిల్లలకు కేటాయించి వారికి బ్యాడ్ టచ్…గుడ్ టచ్ పై అవగాహన కల్పించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తూ పిల్లలను పెద్దగా పట్టించుకోవటం లేదన్నారు. అలా కాకుండా ఓ గంట సమయం వారికిచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడాలన్నారు. తమకు ఏదైనా సమస్య ఎదురైతే పిల్లలు ధైర్యంగా చెప్పుకునే వెసులుబాటును కల్పించాలన్నారు. పెద్ద స్కూల్లో వేశాం…ట్యూషన్ పెట్టించాం…అంతటితో తమ బాధ్యత తీరిపోయినట్టుగా వ్యవహరించ వద్దని సూచించారు.
స్కూళ్లలో కూడా టీచర్లు పిల్లలకు గుడ్ టచ్…బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు. ఇక, చాలామంది పదో తరగతికి కూడా రాక ముందే పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇస్తున్నారన్నారు. అయితే, పిల్లలు ఫోన్ లో ఏం చూస్తున్నారన్న దాని గురించి పట్టించుకోవటం లేదన్నారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు బ్రౌజింగ్ హిస్టరీని చెక్ చేయాలన్నారు. పోర్న్ సైట్లను బ్లాక్ చెయ్యాలన్నారు. ఇక, పోలీసులు ఇలాంటి కేసుల్లో వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. అప్పుడే కొంతలో కొంతైనా ఈ తరహా దారుణాలు తగ్గుతాయని వ్యాఖ్యానించారు.
Also Read: Telangana Tunika: తునికాకు సేకరణపై నీలి నీడలు.. సిగరెట్ మోజే కారణమా!