Suspicious Death: దౌల్తాబాద్‌లో గత నెల ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి
అటవీ ప్రాంతంలో శవం గుర్తింపు
హత్యా?, ఆత్మహత్యా?.. వ్యక్తమవుతున్న సందేహాలు
దుబ్బాక,స్వేచ్ఛ: గత నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి, అదృశ్యమైన వ్యక్తి శవంగా మారిన ఘటన దౌల్తాబాద్ మండలంలో కలకలం రేపింది. దౌల్తాబాద్ శివారు అటవీ ప్రాంతంలో పూర్తిగా కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించడం స్థానికంగా తీవ్ర (Suspicious Death) ఆందోళన కలిగించింది. శనివారం సాయంత్రం ఆ ప్రాంతం వైపు వెళ్లిన కొందరు స్థానికులకు తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానంతో అడవి లోపలికి కాస్త ముందుకు వెళ్లి చూడగా చెట్ల మధ్యలో కుళ్లిన శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై గంగాధర అరుణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
మృతి చెందిన వ్యక్తి పేరు శ్రీశైలం
పోలీసుల విచారణలో మృతుడు పేరు శ్రీశైలం అనే వ్యక్తిగా గుర్తించారు. చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామానికి చెందినవాడని తెలిపారు. గత నెల రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే, అనూహ్యంగా శవం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో సంఘటన స్థలంలోనే గజ్వేల్ ఏరియా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ తర్జని ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి మరణానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్యనా? ఆత్మహత్యనా? లేక మరే ఇతర కారణమా? అన్న కోణాల్లో విచారణ చేపట్టారు.
Read Also- Travel Advice: సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా!.. పోలీసులు చెప్పిన ఈ సూచనలు పాటించారా లేదా మరి?
చైనా మాంజా విక్రేత అరెస్ట్
నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 7 లక్షల రూపాయల విలువ చేసే మాంజాను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ మహ్మద్ ఇక్భాల్ సిద్దిఖీ తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వట్టేపల్లి ప్రాంత వాస్తవ్యుడైన మహ్మద్ షాజైబ్ (42) గాలిపటాల వ్యాపారి. సంక్రాంతి పండుగ సమీపించిన నేపథ్యంలో హర్యానా రాష్ట్రం కర్నల్ ప్రాంత నివాసి విక్రమ్ మెహతా నుంచి పెద్ద ఎత్తున చైనా మాంజా బబూన్లు తెప్పించుకున్నాడు. ఒక్కో బబూన్ ను 2వేల రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సీఐ యదేంధర్, ఎస్ఐ సందీప్ రెడ్డితోపాటు సిబ్బందితో కలిసి అతని షాపుపై దాడి చేశారు. తనిఖీలు జరిపి 345 బబూన్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

