Local Body Polls: సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి!
నేడు క్యాబినెట్‌లో చర్చించే అవకాశం
అధికారులు,రాజకీయ నేతల్లో ఉత్కంఠ
ఇప్పటికే అధికారులను అలర్ట్ చేసిన పంచాయతీ రాజ్ శాఖ
బ్యాలెట్ పత్రాలు, బాక్సులు చెకింగ్
మరోవైపు వేగం పెంచిన ఎన్నికల సంఘం
సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితా ప్రదర్శించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశం
పల్లెల్లోనూ మొదలైన స్థానిక ఎన్నికలపై చర్చ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికలపై (Local Body Polls) ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శనివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం ఉండటంతో ఆ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని, తేదీని సైతం ఖరారు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అధికారులు, రాజకీయ నేతల్లోనూ దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో కేబినెట్ భేటీపై ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏం నిర్ణయం తీసుకుంటారు?, పంచాయతీ ఎన్నికలను ఒకే విడతగా నిర్వహిస్తారా? రెండు విడుతలు నిర్వహిస్తారా? అనేదానిపై చర్చ జరుగుతోంది.
పంచాయతీ అధికారులు సైతం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను భద్రపరిచారు. ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారులకు శిక్షణ ఇచ్చారు. పలుమార్లు ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పాల్గొని ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు గ్రామ, వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేశారు. వాటి ఆధారంగా బ్యాలెట్ పేపర్లు, ఇతర సమాగ్రిని సైతం సిద్ధంచేశారు. ఎప్పటికప్పుడు పంచాయతీ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులు తడిచాయా?, బ్యాలెట్ పత్రాలు భద్రంగా ఉన్నాయా? అనేది కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
Read Also- Telangana Assembly: కేసీఆర్ అసెంబ్లీ వస్తారా?.. బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయంటే?
రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఓటర్ల జాబితా సవరణకు సెప్టెంబర్ 2 వరకు గడువు ఇచ్చింది. గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ల లిస్టును ప్రకటించనున్నారు. అందులో చేర్పులు, మార్పులు ఏవైనా ఉంటే సరిచేసుకునే అవకాశం ఇచ్చింది. దీనికి తోడు అన్ని రాజకీయ పార్టీలతో మండల స్థాయిలో అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. దీంతో అన్ని పార్టీలు అప్రమత్తం అయ్యాయి. వార్డుల వారీగా వివరాలను సేకరిస్తున్నారు. ఓటర్ల లిస్టు ప్రకారం అందరికి ఓటు హక్కు ఉందా? ఉన్నవారిని ఏమైనా తొలగించారా? లిస్టు సరిగ్గా ఉందా? లేదా? కొత్తవారిని ఓటర్లుగా నమోదు చేశారా? లేదా? అనే వివరాలను పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా ఒకే వార్డులో ఉన్నారా? లేదా? లేకుంటే వారిని చేర్చే విధంగా చర్యలు చేపట్టనున్నారు. అన్ని పార్టీల నేతలు సైతం తమకు అనుకూలంగా, పార్టీ కార్యకర్తల ఓటర్లను ఏమైనా తొలగించారా? అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Read Also- Hyderabad Schools: హైదరాబాద్ సిటీలో పాఠశాలలకు నయా రూల్.. త్వరలోనే అమల్లోకి!
పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో గ్రామాల్లో పార్టీల నేతలతో పాటు ఆశావాహుల్లో సైతం చర్చ మొదలైంది. తమకు టికెట్ ఇవ్వాలని గ్రామశాఖ అధ్యక్షులతో ఎమ్మెల్యేలకు రిఫర్ చేసుకుంటున్నారు. ఎవరికి వారుగా మంతనాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఎక్కువమంది ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం గ్రామాల్లో సత్తాచాటాలని భావిస్తుంది. ఇప్పటికే గులాబీ అధిష్టానం నేతలకు ఆదేశాలు ఇవ్వడంతో గ్రామాల్లో బలమైన నాయకుల లిస్టును సిద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా కేబినెట్ సమావేశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.