College Donations: డొనేషన్ల పేరుతో కళాశాలలు చేస్తున్న దందాలను వెంటనే అరికట్టాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు పెంపు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం చైర్మన్ బాలకృష్ణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మూడేళ్లకు ఒకసారి పెరిగే ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను ఇష్టారీతిన పెంచడానికి టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించిన నిర్ణయాన్ని బీఆర్ఎస్వీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కళాశాలలు లక్షలకు లక్షలు ఫీజులు పెంచి పేద, మధ్యతరగతి విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
Also Read: MLA Raja Singh: సొంత పార్టీపైనే రాజాసింగ్.. సంచలన కామెంట్స్!
కాలేజీలు ఫీజులు పెంచుతుంటే ప్రభుత్వం మాత్రం రియంబర్స్మెంట్ పెంచకుండా విద్యార్థుల కుటుంబాలను అప్పుల్లోకి నెట్టుతున్నదని మండిపడ్డారు. ఇంజనీరింగ్ బీ కేటగిరి సీట్లన్నీ ఆన్లైన్లో భర్తీ చేసి కాలేజీల అక్రమార్జనను అరికట్టాలని డిమాండ్ చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ ఎటువంటి వసతులు లేకున్నా ఫీజులు పెంచుకోవడానికి టీఏఎఫ్ఆర్సీ తో కుమ్మక్కై తప్పుడు ఆడిట్ రిపోర్ట్ సమర్పించిన కాలేజీలపై ఉన్నత విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి అటువంటి కాలేజీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగభాలు, కోతి, విజయ్, నేతలు చటారి దశరథ్, యశ్వంత్ కుమార్, కాటం శివ, రమేష్ గౌడ్, హరిబాబు, జంగయ్య, మాజ్ ,నర్సింగ్ ,ప్రశాంత్, నాగరాజు, షేర్ రమన్, పీవీ గౌడ్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్, అవినాష్, సాయి గౌడ్, రాహుల్, అద్వైత్ రెడ్డి, రెహమాత్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Mallareddy On Kavitha: కవిత పులి బిడ్డ.. కేసీఆర్‌ను ఎప్పటికీ వీడదు.. మల్లారెడ్డి