DGP Shivadhar Reddy: సంప్రదాయ నేరాలు తగ్గుముఖం పడుతున్నా ఏయేటికాయేడు సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) అన్నారు. వీటిని అరికట్టడంలో దేశంలోనే రాష్ట్రం అగ్ర స్థానంలో ఉన్నా మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఎక్కడో వందలు వేల మైళ్ల దూరంలో కూర్చుని జనం కష్టార్జితాన్ని కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్‌కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని చెప్పారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ ఆడిటోరియంలో మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సైబర్ నేరాల కట్టడికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ఆరు వారాల అవగాహనా కార్యక్రమాలను ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరపాలని చెప్పారు. ఈ ఆరు వారాల్లో డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, ఓటీపీ, కేవైసీ ఫ్రాడ్లు, లోన్ యాప్‌ల వేధింపులు, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ సైబర్ క్రిమినల్స్ చేస్తున్న నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థల కోసం రూపొందించిన స్టూడెంట్ ప్రోగ్రాం ఫర్ అవేర్‌నెస్ అండ్ రెస్పాన్స్‌బుల్ సైబర్ స్పేస్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ఆయా స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎస్బీఐ సిబ్బందితో కలిసి సైబర్ డిఫెండర్స్ అనే కార్యక్రమాన్ని కూడా డీజీపీ ఆరంభించారు.
29 శాతం పెరుగుదల
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 29 శాతం పెరిగాయన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో 8 శాతం తగ్గినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బు 6 శాతం తగ్గితే రాష్ట్రంలో 30 శాతం తగ్గిందని వివరించారు. 1930 హెల్ప్ లైన్ అప్ గ్రేడ్ చేయడంతోపాటు పుట్ ఆన్ హోల్డ్ వ్యవస్థను బలోపేతం చేయడం, ఆయా కేసుల్లో పకడ్బందీగా, వేగంగా విచారణ జరపడం వల్ల ఈ ఫలితాలను సాధించగలిగామన్నారు. హైకోర్టుతో కలిసి రూపొందించిన రీఫండ్ ప్రాసెస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పడిన తరువాత 2.44 లక్షల ఎన్సీఆర్పీ ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. 58,244 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు చెప్పారు. బాధితులకు 350 కోట్ల రూపాయలకు పైగా రీఫండ్ చేసినట్టు వివరించారు. సైబర్ నేరాలకు మరింత సమర్థవంతంగా కళ్లెం వేయడానికి రూపొందించిన ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ ప్రజలతో నేరుగా కలిసే భారీ ఉద్యమమని చెప్పారు. ఆరు వారాలపాటు ప్రతీ వారం ఒక ప్రత్యేక సైబర్ మోసంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఆరు వారాల్లో..
– మొదటి వారం సైబర్ సారథి @ 1930 – గోల్డెన్ హవర్ రిపోర్టింగ్, 1930 హెల్ప్ లైన్‌పై అవగాహన
– రెండోవారం డిజిటల్ అరెస్ట్, సెక్సార్షన్, సైబర్ స్లేవరీపై ప్రచారం
– మూడో వారం పైసా పైలం పేర ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు, లోన్ యాప్‌లు, ఫేక్ రివార్డులపై అవగాహన
– నాలుగో వారం హ్యాకింగ్, రాన్‌సమ్ వేర్, ఫేక్ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లపై ప్రచారం
– ఐదో వారం మేరా లాగిన్ మేరా రూల్ పేర ఐడెంటిటీ థెఫ్ట్, ఇంపర్సనైజేషన్, ఓటీపీ, కేవైసీ మోసాలు ఎలా జరుగుతాయన్న దానిపై అవగాహన
– ఆరో వారం మహిళలు, పిల్లలకు సంబంధించి ఆన్ లైన్ ముప్పుల గురించి తెలియ చేస్తారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా వర్క్ షాపులు, సెమినార్లు జరుపుతారు. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన ఆర్యక్రమాలు నిర్వహిస్తారు. సైబర్ సేఫ్టీ వాక్స్, ర్యాలీలు నిర్వహిస్తారు. పోస్టర్ పెయింటింగ్, షార్ట్ వీడియోల పోటీలు జరుపుతారు. సోషల్ మీడియా ఛాలెంజ్లతోపాటు లైవ్ ఇంటరాక్షన్‌లు జరుపుతారు. జంక్షన్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండుల్లో జింగిల్స్ ప్రచారం చేస్తారు.
