DEO VRS Issue: తెలంగాణ విద్యాశాఖలో గత కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించలేక, ఉన్నతాధికారుల ఒత్తిడిని తట్టుకోలేక పలువురు జిల్లా విద్యాశాఖాధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. వీఆర్ఎస్(VRS) తీసుకున్న వారిలో నిర్మల్(Nirmal), సూర్యాపేట(Suryapet) జిల్లాల డీఈవో(DEO)లు ఉన్నట్లుగా చెబుతున్నారు. విద్యాశాఖ నుంచి వస్తున్న నిరంతర ఆదేశాలు, మరోవైపు జిల్లాల కలెక్టర్ల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన ఒత్తిడి డీఈవోలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో సమయపాలన లేని పని గంటలు, సెలవు రోజుల్లోనూ సమీక్ష సమావేశాలతో అధికారులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేధింపులను భరించడం కంటే పదవి నుంచి తప్పుకోవడమే మేలని కొందరు సీనియర్ అధికారులు భావిస్తున్నారు.
విద్యాశాఖ అధికారులు డిజైన్..
వార్షిక విద్యా ప్రణాళికకు అదనంగా, ప్రభుత్వం రోజుకో కొత్త కార్యక్రమాన్ని తెరపైకి తెస్తోంది. బోధనా సమయాన్ని కాదని, కేవలం నివేదికలు పంపడానికే ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బోధన ఎప్పుడు చేయాలి? ఈ అదనపు కార్యక్రమాల అమలు ఎప్పుడు చూడాలి? అని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వీటికి తోడు ఏదైనా కొత్త కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు డిజైన్ చేసే సమయంలో ఉన్నతాధికారులు కేవలం ఏసీ రూంలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఆ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అమలులో ఎదురయ్యే ఇబ్బందులేంటి? అనే అంశాలపై కనీసం ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లతో చర్చించడం లేదని తెలుస్తోంది. కేవలం ఆదేశాలు జారీ చేయడం, అవి అమలు కాకపోతే చర్యలు తీసుకోవడం వంటి ధోరణి వల్ల విద్యా వ్యవస్థలో సమన్వయం లోపిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: Hydra: బడాబాబుల ఆక్రమణలకు హైడ్రా చెక్.. రూ. 2500 కోట్ల విలువైన భూమికి ఫెన్సింగ్!
కింది స్థాయి ఉద్యోగులు
అధికారుల మధ్య సమన్వయ లోపం, పని భారం కారణంగా పాఠశాలల్లో విద్యాబోధన కుంటుపడుతోంది. విద్యారంగంపై మానిటరింగ్ కొరవడటమే దీనికి కారణంగా తెలుస్తోంది. అధికారులు ఎంతసేపు పలు రకాల కార్యక్రమాల అమలుపై గురించి తప్పితే విద్యార్థులకు చదువు చెబుతున్నారా? లేదా? అని కూడా అడగని పరిస్థితితో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగులు చెప్పేది అధికారులు, కలెక్టర్లు ఏమాత్రం పట్టించుకోకుండా.., తాము చెప్పేదే చేయాలని ఆదేశిస్తున్నట్లుగా పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా నిర్మల్(Nirmal), సూర్యాపేట జిల్లాల డీఈవోలు ఇప్పటికే వీఆర్ఎస్ తీసుకోగా మెదక్(Medak) డీఈవో(DEO) వీఆర్ఎస్(VRS) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా వీఆర్ఎస్ అవసరం లేదని, డైట్ ప్రిన్సిపాల్ గా కొనసాగిస్తున్నట్లు అధికారులు స్పష్టంచేయడంతో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.
ఆ ఫోన్ లేనిదే పని జరగని స్థాయి..
విద్యార్థులకు చదువు మినహా.. ఇతర కార్యక్రమాల పనిభారం నేపథ్యంలో డీఈవోగా పంపిస్తామన్నా వెళ్లేందుకు ఎవరూ అంగీకరించడంలేదని సమాచారం. డీఈవో పోస్ట్ అంటేనే ఆమడ దూరంలో ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులు ఎవరూ ఆసక్తి కనబరచకపోవడంతో డీఈవోలుగా.. ఐఏఎస్ స్థాయి అధికారులను ఇటీవల సర్కార్ నియమించిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం టీచర్లు, విద్యార్థుల అటెండెన్స్, ఇతర అంశాల్లో పారదర్శకత పాటించేందుకు ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ ఎఫ్ఆర్ఎస్ ద్వారా పిల్లల అటెండెన్స్ తీసుకునేందుకు ఒక పీరియడ్ సమయం వృథా అవుతోందని టీచర్లు చెబుతున్నారు. స్కూళ్లో అసలు ఫోన్ వినియోగాన్ని నిషేధించిన స్థాయి నుంచి ఆ ఫోన్ లేనిదే పని జరగని స్థాయికి తీసుకొచ్చారని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం సైతం విపరీతంగా పెరుగుతోందని, వారి కారణంగానే ఒత్తిడి మరింత ఎక్కువవుతుందని పలువురు టీచర్లు చెబుతున్నారు. అన్ని సబ్ కమిటీల్లో ఎన్జీవోల ప్రమేయం కొనసాగుతోందని వాపోయారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, విద్యాశాఖలో పని ఒత్తిడిని తగ్గించి, ఉపాధ్యాయులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Hydraa: ప్రగతినగర్ చెరువు పునరుద్దరణపై హైడ్రా ఫుల్ ఫోకస్..!

