CPI Narayana: ఉగ్రవాదులు ఏ మూలన ఉన్నా మట్టు పెట్టాల్సిందేనని, ఇందుకు వేరే అలోచనే అవసరంలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుంభవన్ లో పార్టీ జాతీయకార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదుల క్యాంపులపై దాడి క్రమంలో పాకిస్తాన్ సామాన్య జనాలకు ఇబ్బందులు కలిగించ వద్దని మాత్రమే తాను మాట్లాడానని, తన వ్యాఖ్యలు వక్రీకరించారని, ఇది సరైంది కాదన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో దౌత్యపరంగా ప్రపంచ దేశాలతో మరింత మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకుని వాటిని ఏకం చేయాల్సిన అవసరముందన్నారు.
అంతర్జాతీయ ఉగ్రవాది అయిన మాసుద్ అజర్ భారత్ రప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాకిస్తాన్ చైనా మద్దతు ఇస్తుందనేది అపోహ మాత్రమేనని, ఇందుకు సంబంధించి చైనా అధికారికంగా సైతం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు ఆయన చేశారు. కేంద్రం చేపట్టనున్న కులగణనను సీపీఐ పూర్తిగా స్వాగతిస్తుందని, ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఖచ్చితమైన కాలపరిమితిని నిర్ణయించాలని కోరారు. తద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి కుల గణన ప్రక్రియను పూర్తి చేసి చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి వారు పోటీ చేసేందుకు అవకాశాన్ని కేంద్రం కల్పించాలని డిమాండ్ చేశారు.
Also Read: Sneha Shabarish: జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలు.. ఇద్దరు అధికారులకు విభాగాల మార్పు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అడ్డంపెట్టుకుని వ్యాపారం చేస్తారా? ఇది హీనాతి హీనమైందని పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఏమీ సందేశం ఇవ్వాలకుంటుందని నిలదీశారు. ఈ చర్య దేశ రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయనడానికి నిదర్శనమన్నారు. యుద్ద కథనరంగంలో దూసుకుపోతున్న కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మనకు ఆదర్శమన్నారు.
కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోయే ప్రపంచ సుందరి పోటీలు మనకు ఎందుకని, వీరు ఎవరికి ఆదర్శమని, ప్రపంచ సుందరీమణులను పర్యాటక ప్రదేశాల్లో ఊరేగించినంత మాత్రాన ఈ రంగం అభివృద్ది చెందుతుందా? ప్రశ్నించారు. పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యం, మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా వివిధ ప్రాంతాలకు పర్యాటకులు వచ్చేందుకు వీలు కలుగుతుందని సూచించారు. ఎండల తీవ్రతతో 500లకు పైగా గుడిసెలు తగలబడి నిలువ నీడలేక, తాగేందుకు మంచి నీరు కూడా లేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకునేందుకు పైసా ఖర్చు చేయని ప్రభుత్వం అందాల పోటీలకు మాత్రం కోట్లాది రూపాయాలను ఖర్చు చేయడం సిగ్గుచేటన్నారు. ఇందు కోసమేనా? ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది, పేదలకు ఆదుకోవడానికి కాదా నిలదీశారు.
Also Read: Miss World 2025: సర్వ సంస్కృతుల నజరానా తెలంగాణా.. విదేశీయులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు!