Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నట్టు స్పష్టమవుతున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే దీనికి నిదర్శనం. జిల్లాల వారీగా మెజారిటీ గ్రామ పంచాయతీల్లో బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ సత్తా చాటింది. ఒకనాడు ప్రత్యేక తెలంగాణను ఇచ్చిన పార్టీగా అనంతరం పరిణామాల్లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఇప్పుడు కాంగ్రెస్ తిరిగి తన పట్టును నిలుపుకుంటున్నది. తెలంగాణ పల్లెల్లో తిరిగి తన జెండాను రెపరెపలాడిస్తున్నది. తొలి విడుత ఎన్నికల ఫలితాల్లో 90 శాతం కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచినట్లు పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఇది సర్కార్‌కు పాజిటివ్ అంశంగా మారింది. పదేళ్ల పవర్‌పై ధీమా పెరిగినట్లు హస్తం నేతలు వివరిస్తున్నారు.
సంక్షేమ పథకాలే విజయ రహస్యం
కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ అనేంతగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామీణ ప్రజానికం స్వాగతిస్తున్నట్టు ఈ ఫలితాలతో తేటతెల్లమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉచితంగా సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్, రైతు భరోసా,15 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలకు తెలంగాణ పల్లె ప్రజలు జై కొట్టారు. ఈ సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రజానీకం లబ్ధి పొందుతున్నారనేందుకు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Telangana Congress: గ్రేటర్‌లో పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం, పార్టీలో నూతనోత్సాహం!
సీఎం రేవంత్ రెడ్డి బలమైన నాయకత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలమైన నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి అదనపు బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న వేళ, పార్టీలో ఆయన నాయకత్వానికి ఎదురులేకపోవడం, రేవంత్ రెడ్డి నాయకత్వంతో మంత్రులు మొదలుకొని, పీసీసీ కార్యకవర్గం వరకు నేతలందరూ పూర్తి సమన్వయంతో పని చేస్తుండడం కాంగ్రెస్‌ను తెలంగాణలో తిరుగులేని శక్తిగా నిలుపుతున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా బాధ్యత వహించి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చడం, ఇందుకోసం ఆయన అలుపెరుగని వ్యూహాలు అమలు చేయడం పార్టీ నేతల్లో కొత్త జోష్ నింపింది. ఇదే ఉత్సాహంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితమే నేటి పంచాయతీ ఎన్నికల ఫలితాలని గాంధీ భవన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నియోజకవర్గ స్థాయిలో బలోపేతం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందడం నియోజకవర్గ స్థాయిలో కూడా కాంగ్రెస్ బలోపేతం అవుతోందనడానికి సంకేతంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం, సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ పీసీసీ కార్యవర్గంలో కొత్త నాయకత్వానికి అవకాశాలు ఇవ్వడం వంటి చర్యలు పార్టీ బలాన్ని పెంచాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ గెలుపు ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తిరిగి సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, బలమైన రాజకీయ శక్తిగా అవతరించిందని అంటున్నారు.
Also Read: Telangana Congress: గ్రేటర్‌లో పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం, పార్టీలో నూతనోత్సాహం!

