DCC Appointment: కాంగ్రెస్ పార్టీకి డీసీసీ(జిల్లా ప్రెసిడెంట్) ఎంపికలో సవాల్ మొదలైంది. ప్రధానంగా 42 శాతం రిజర్వేషన్ల టెన్షన్ పట్టుకున్నది. జిల్లా అధ్యక్షుల ఎంపికలో 42 శాతం రిజర్వేషన్ ఎలా అమలు చేయాలనే దానిపై కసరత్తును మొదలు పెట్టింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని పదేపదే చెబుతున్న నేపథ్యంలో, సంస్థాగత పదవుల నియామకాల్లో కూడా ఇదే సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేయాలనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో కీలకంగా మారింది. ప్రత్యేకించి, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల నియామక కసరత్తు మొదలైన తరుణంలో, ఈ పదవుల్లో కూడా 42 శాతం బీసీలకు కేటాయిస్తారా అనేది ప్రధాన ప్రశ్నగా లీడర్ల నుంచి వినిపిస్తున్నది.
ముఖ్య లీడర్లలో టెన్షన్
పార్టీ నాయకత్వం కూడా గతంలోనే పదవుల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో డీసీసీ(DCC) ఎంపికలోనూ 42 శాతం రిజర్వేషన్లను పాటిస్తూ పోస్టులు కేటాయించాలని నేతల నుంచి డిమాండ్ వినిపిస్తున్నది. డీసీసీ అధ్యక్ష పదవులలో 42 శాతం కోటాను అమలు చేయడం అనేది పార్టీలో సీనియారిటీ, ప్రాంతీయ సమతుల్యత, ఇతర సామాజిక వర్గాల ఆకాంక్షలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో పార్టీకి సవాల్‌గా మారింది. ఈ క్రమంలో 42 శాతం అమలు పార్టీ సంస్థాగత బలాన్ని పెంచేందుకు దోహదపడుతుందా లేదా అంతర్గత విభేదాలకు దారి తీస్తుందా అని ముఖ్య లీడర్లలో టెన్షన్ మొదలైంది.
Also Read: Kalvakuntla Kavitha: జాగృతిలో భారీగా చేరికలు.. కండువా కప్పి ఆహ్వానించిన కవిత
క్షేత్రస్థాయిలో ఏఐసీసీ స్క్రీనింగ్
డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) క్షేత్రస్థాయిలో వడపోతను కఠినంగా అమలు చేస్తున్నది. ఏఐసీసీ, డీసీసీ చీఫ్‌ల నియామకానికి సంబంధించి కొత్త అర్హత నిబంధనలను నిర్దేశించింది. వీటిలో ముఖ్యమైనది, ఇప్పటికే ఒకసారి డీసీసీ చీఫ్‌గా పని చేసిన వారికి రెండోసారి అవకాశం కల్పించకూడదు అనేది. అంతేగాక పార్టీలో ఐదేళ్ల పాటు పని చేసి ఉండాలనే రూల్‌ను తెర మీదకు తీసుకువచ్చింది. దీంతో ఆశావహుల్లో కొంత గందరగోళం నెలకొన్నది. వాస్తవానికి ప్రస్తుత డీసీసీల్లో చాలా మంది మళ్లీ పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. పార్టీ పవర్‌లో ఉండడంతో డీసీసీ కీ రోల్ పోషిస్తుందనే నేపథ్యంలో ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే లిస్ట్ ఎంపికపై గ్రౌండ్ లెవల్‌లో సీరియస్‌గా కసరత్తు జరుగుతున్నది. అయితే, ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఎవరిని తొలగిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
గతంలో హమీలు పొందినోళ్ల పరిస్థితి ఏంటి?
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది లీడర్లకు డీసీసీల హామీలు ఇచ్చారు. ఆయా నేతలతోనే స్థానికంగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం, పార్టీ నిర్వహించే కార్యక్రమాలను సక్సెస్ చేయడం వంటి బాధ్యతలు గాంధీ భవన్ నుంచి అప్పగించారు. డీసీసీ పోస్ట్ వస్తుందనే ఆశతో చాలా మంది నేతలు ఆయా కార్యక్రమాలను సక్సెస్ చేస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు డీసీసీ అధ్యక్షుల ఎంపికలో ఏఐసీసీ కఠినంగా వ్యవహరించడం, కొత్త నిబంధనలు తీసుకురావడం, ముఖ్యంగా 42 శాతం బీసీ కోటా చర్చ వంటివి గతంలో డీసీసీ చీఫ్ పదవిపై హామీ పొందిన కొంతమంది సీనియర్ నేతల్లో టెన్షన్‌కు కారణమయ్యాయి. పార్టీలో పదవులు ఆశించిన నేతలు క్షేత్రస్థాయిలో ఏఐసీసీ పరిశీలకుల స్క్రీనింగ్‌కు ఎలా స్పందిస్తారు? తుది ఎంపికలో వారికి న్యాయం జరుగుతుందా? అనేది ఉత్కంఠగా మారింది. అయితే, డీసీసీ చీఫ్ సెలక్షన్‌లో 42 శాతం అమలు పార్టీకి ఓ పరీక్ష లాంటిదేనని ఓ నాయకుడు తెలిపారు.
Also Read: Kiran Kumar Reddy: బీసీ రిజర్వేషన్ల పై పోరాటం ఆగదు: కిరణ్ కుమార్ రెడ్డి
