Telangana Administration: బీఆర్ఎస్ (BRS) సర్కార్ మొదలు పెట్టిన సంప్రదాయన్ని కాంగ్రెస్కూ (Congrees) డా ఫాలో అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పాత పద్ధతులనే మళ్లీ పాటిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రభుత్వంలోనూ రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల హవా నడుస్తున్నది. కీలక శాఖల్లో తిష్ట వేసి తమ వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటున్నారు. ప్రభుత్వంలోని పెద్దలతో పాత పరిచయాలను అడ్డంపెట్టుకొని పోస్టుకు ఎక్స్ టెన్షన్‌లు తెచ్చుకుంటున్నారు.
రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత కూడా రెండేళ్ల కాల పరిమితితో పోస్టును ఎక్స్ టెన్షన్ చేపించుకుంటున్నారు. కొందరు కీలక అధికారులు ఈ విధానం ఫాలో అవుతుండగా, మరి కొంత మంది ఉద్యోగులు పైరవీలకు పెద్దపీఠ వేస్తున్నట్లు తెలుస్తున్నది. సెక్రటేరియట్ (Secretariat) నుంచి హెచ్ వోడీ కార్యాలయాల వరకు రిటైర్డ్ ఉద్యోగులు తిష్ట వేస్తున్నారు. కొందరైతే ప్రభుత్వ పెద్దల పరిచయాలతో పెత్తనాలు చేస్తుండగా, మరి కొందరు యూనియన్ పేర్లతో హంగామా సృష్టిస్తున్నట్లు సర్కారీ ఉద్యోగులే వాపోతున్నారు.
Also Read: Dengue cases: సిటీపై సీజనల్ వ్యాధుల వార్.. పెరుగుతున్న డెంగ్యూ కేసులు
హెల్త్, ఇరిగేషన్, జీఏడీ, జీహెచ్‌ఎంసీ, (GHMC) ఎంఏయూడీ, విద్యుత్ శాఖ, మెట్రో రైల్, అగ్రికల్చర్ తదితర కీలక శాఖల్లో మాజీ ఉద్యోగుల్లోని కొంత మంది వ్యవహారం ప్రభుత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్నదట. కొన్ని సందర్భాల్లో ఐఏఎస్‌లనూ ఇరకాటంలో పెట్టేందుకు రిటైర్డ్ ఆఫీసర్లు, ఉద్యోగులు తమ మెదడుకు పదును పెడుతున్నారని తెలుస్తున్నది. రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులకు చెక్ పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందే ప్రకటించింది. కానీ, ప్రభుత్వం ఏర్పడి18 నెలలు గడిచినా, ఇప్పటికీ కొందరికి ప్రాధాన్యత ఇస్తూ ఎక్స్ టెన్షన్ ఇవ్వడం, మరి కొందరిని ఇతర శాఖల్లో కొత్త పోస్టుల పేరుతో నియమించడం వంటివి చేస్తున్నారు. వీటన్నింటిపై ఇటు నిరుద్యోగులతో పాటు, ఇప్పటికే ఆయా శాఖల్లో పనిచేస్తున్న వారు మండిపడుతున్నారు.
తమకు అంతా తెలుసు అంటూనే?
పాత శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవంతో ఆయా డిపార్ట్‌మెంట్‌లోని సమస్యలను ప్రస్తావిస్తూ రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా చేరుతున్నారు. ఆయా సమస్యలకు సలహాలు, సూచనలు ఇస్తూ, మళ్లీ ప్రభుత్వంలో ఏదో ఒక పోస్టు లేదా, ఉన్న దాని నుంచే ఎక్స్ వంటివి చేపించుకుంటున్నారు. ఉద్యోగుల తరపున తాము ఫాలోఅప్ చేస్తున్నామని చెబుతూ ఉన్నతాధికారులపై కూడా ప్రెజర్ పెడుతున్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధి తరహాలో మరి కొందరు రిటైర్మెంట్ ఉద్యోగులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఊదాహరణకు వైద్యారోగ్యశాఖలో ముగ్గురు నలుగురు ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా హెచ్ వోడీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పోస్టింగ్‌లు, ప్రమోషన్లు, ఇతర సర్వీస్ విషయాల్లో జోక్యం చేసుకొని ఏకంగా హెచ్ వోడీలకే సలహాలు ఇస్తున్నారని ఆయా కార్యాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. తమ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కొందరు, యూనియన్ తరపున వచ్చామని ఇంకొందరు ఇలా హెచ్ వోడీల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అగ్రికల్చర్, ఇరిగేషన్, జీఏడీలోనూ ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతున్నాయని ఓ అధికారి తెలిపారు. ఇక డిపార్ట్‌మెంట్‌లో పాత పరిచయాలను అడ్డంపెట్టుకొని తమ వ్యవహారాన్ని అంతా సాఫీగా అయ్యేందుకు చొరవ తీసుకుంటున్నారు. దీని వలన కొన్ని సందర్భాల్లో తమ వర్క్స్‌కు ఆటంకం కలుగుతున్నట్లు స్వయంగా అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఒక్కోసారి ఆయా రిటైర్మెంట్ ఉద్యోగులు, అధికారుల్లోని కొందరు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని, వీలైతే కోర్టుల్లో కేసులు కూడా వేపించేందుకు వెనకాడడం లేదని సెక్రటేరియట్‌లోని ఓ అధికారి స్పష్టం చేశారు.
మాజీ సీఎస్ రిపోర్టు కీలకం?
ప్రభుత్వ, కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశాలపై పూర్తి స్థాయిలో స్టడీ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనున్నది. అయితే, ప్రభుత్వంతో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, సవాళ్లు, పరిష్కారాలు, నూతన మార్పులు, ఉద్యోగుల వివరాలు, ఇలా వివిధ అంశాలపై ఈ కమిటీ క్షుణ్ణంగా స్టడీ చేయనున్నది. అంతేగాక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎందుకు ఆందోళనలు జరగుతున్నాయి? ప్రభుత్వ నిర్ణయాలను ముందుకు సాగేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల పాత్ర డిపార్ట్‌మెంట్లపై ఏ స్థాయిలో ఉన్నది? అనే తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేయనున్నది. 60 రోజుల్లో తమకు రిపోర్టు ఇవ్వాలని తాజాగా సర్కార్ ఆదేశించినట్లు తెలిసింది. అయితే, ప్రభుత్వం వేసిన కమిటికీ రిటైర్డ్ అధికారిణి లీడ్ చేయడం గమనార్హం. దీంతో ఏ మేరకు పరిష్కారాలు లభిస్తాయనేది? త్వరలో తేలనున్నది.
Also Read: V.S. Achuthanandan: కమ్యూనిస్ట్ కురువృద్ధుడు అచ్యుతానందన్ కన్నుమూత