Ganesh Chaturthi festival: గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ఘనంగా జరుపుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం డిసిపిలు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనరులు, పోలీస్ అధికారులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకూ వినాయకచవితి ఉత్సవాలు జరగనున్నందున వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు, నిర్వాహకులు భక్తి శ్రద్దలతో సురక్షిత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
‘ప్రజలకు ఇబ్బంది కలగొద్దు’
రంగారెడ్డి జిల్లాలో గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు 44 చెరువులను గుర్తించినట్లు తెలిపారు. గణేష్ శోభాయాత్ర నిర్వహించే దారిలో గుంతలు పడిన రహదారులు, ప్యాచ్ వర్క్ రిపేర్ పనులు, గణేష్ నిమజ్జనం నిర్వహించే ప్రదేశాల వద్ద క్రెన్లు, బారికేడింగ్, వేదిక ఏర్పాట్లను మున్సిపల్, ఆర్ అండ్ బి శాఖ అధికారులు కలసి చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని సమన్వయముతో పని చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగించాలని, సమస్యలు ఎక్కువగా ఉన్నచోట భారీ బందోబస్తూ కల్పించాలని, సిసి కెమెరాలు ఏర్పాట్లు చేయాలని, భారీ కేడింగ్, బందోబస్త్, మెడికల్, సానిటేషన్, కంట్రోలింగ్ రూం తదితర ఏర్పాట్లు చేయాలని అన్నారు.
చెరువుల వద్ద క్రేన్ ఏర్పాట్లపై
నంబరింగ్ ఇచ్చిన మండపాల దగ్గర పరిశుభ్రత పాటించేలా చూసుకోవడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విగ్రహాలు ఊరేగింపు సమయంలో వాహనాల్లో ఎటువంటి యాంత్రిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, నిమజ్జనం సమయంలో వేలాడే తీగలు, వంగి ఉన్న చెట్లు, తదితర వాటిని తొలిగించాలని తెలిపారు. చెరువుల వద్ద క్రేన్ లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెరువుల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలి సూచించారు.
Also Read: Stray Dog vs Leopard: ప్రతీ కుక్కకు ఓ రోజు వస్తుందంటారు కదా.. ఆ రోజు వచ్చేసింది.. చింటూ దుమ్ములేపాడు!
ప్రతినిధి ఏమన్నారంటే?
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ను కోరినట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ ఏర్పాట్లు చేపట్టేలా అధికారులకు సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, మహేశ్వరం డిసిపి సునితా రెడ్డి, ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్, శంషాబాద్ అడిషనల్ డిసిపి కె. రామ్ కుమార్, మాదాపూర్ అడిషనల్ డిసిపి సాయిరామ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.