Coliving Hostels: గ్రేటర్ సీటీలో నయా కల్చర్ వేళ్లూనుకుంటోంది. కో లివంగ్ హాస్టళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మీకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయితో కలిసి ఉండవచ్చు…అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ వీటి నిర్వాహకులు ప్రచారం చేసుకుంటూ మరీ ఈ విష సంస్కృతిని పెంచుతున్నారు. ఒక్కొక్కరి నుంచి నెలకు 25 నుంచి 40వేల రూపాయలు వసూలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. కాగా, రోజురోజుకు పెరిగిపోతున్న ఈ ధోరణులపై ఫ్యామిలీ కౌన్సిలర్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిణామాలు మనుషుల్లో నైతిక విలువల పతనానికి కారణమవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతోపాటు శాంతిభద్రతల సమస్యలు ఏర్పడే ప్రమాదం కూడా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
25 నుంచి 40వేల రూపాయలు
విశ్వనగరంలో వృద్ధి చెందుతున్న గ్రేటర్ హైదరాబాద్ లో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. వీటిల్లో తెలంగాణకు చెందిన వారితోపాటు వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన యువతీ, యువకులు పని చేస్తున్నారు. ఓ అంచనా ప్రకారం ఒక్క సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన సంస్థల్లోనే ఒక్కో షిఫ్టులో పని చేస్తున్న వారి సంఖ్య లక్షన్నరకు పైగానే ఉంది. ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి ఉద్యోగం చేయటానికి ఇక్కడకు వచ్చే వారు గతంలో బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, వర్కింగ్ ఉమెన్, మెన్ హాస్టళ్లలో ఉండేవారు. ఇవి నచ్చని పక్షంలో పెయింగ్ గెస్టులుగా ఎవరో ఒకరి ఇంట్లో ఆశ్రయం తీసుకునేవారు. అయితే, బాయ్స్, గర్ల్స్, వర్కింగ్ ఉమెన్, మెన్ హాస్టళ్ల నిర్వాహణలో లాభాలు అంతంత మాత్రంగానే ఉండటంతో వీటి నిర్వాహకుల్లో కొందరు కొత్త సంస్కృతికి తెర లేపారు. అవే కో లివింగ్ హాస్టళ్లు. వీటిల్లో యువతీ, యువకులు తమకు నచ్చిన వారితో ఒకే గదిలో ఉండవచ్చు. ఇక, వీరిని ఆకర్షించటానికి 24గంటలు ఇంటర్ నెట్, లాండ్రీ, డాక్టర్ ఆన్ కాల్, లగ్జరీ గదులను సమకూరుస్తున్నారు. అయితే, కల్పించే సౌకర్యాలను బట్టి నెలకు 25 నుంచి 40వేల రూపాయలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. గమనించాల్సిన అంశం ఏమిటంటే పోలీసుల నుంచి ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతుండటం.
Also Read- Tollywood: డబ్బులిచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటూ.. మళ్లీ ఈ సారీలు చెప్పించుకోవడం ఏంటి?
పోలీసుల నిఘా కూడా అంతంత మాత్రంగానే
ఇలా పుట్టుకొస్తున్న కో లివింగ్ హాస్టళ్లలో ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు చేయటానికి ఇక్కడికి వచ్చిన వారే అధికంగా ఉంటున్నారు. నచ్చినన్ని రోజులు నచ్చిన వారితో కలిసి ఉండటం…లేనిపక్షంలో రూమ్మేట్ ను మార్చుకోవటం చేస్తున్నారు. ఇలా నడుస్తున్న కో లివింగ్ హాస్టళ్లు ఎక్కువగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, కావూరి హిల్స్ ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తున్నాయి. పోలీస్ లెక్కల ప్రకారమే ఒక్క మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 108 కో లివింగ్ హాస్టళ్లు నడుస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ కో లివింగ్ హాస్టళ్లలో అసలేం జరుగుతుందో అన్న దానిపై ఏమాత్రం నిఘా లేకపోవటం. హాస్టళ్ల నిర్వాహకులు నెల నెలా రావాల్సిన డబ్బు వస్తుందా? లేదా? అన్న లెక్కలు మాత్రమే చూసుకుంటున్నారు. ఇక, పోలీసుల నిఘా కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. దీనిపై ఓ ఇన్స్ పెక్టర్ తో మాట్లాడగా శాంతిభద్రతల సమస్యలు ఏర్పడితేనే తాము ఇలాంటి హాస్టళ్లకు వెళుతుంటామని చెప్పారు. వీటిల్లో ఉండేవారంతా మేజర్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాము వెళ్లి తనిఖీలు చేసినా మా ఇష్టంతోనే కలిసి ఉంటున్నామన్న సమాధానాలు వస్తుంటాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేయగలం? అని ప్రశ్నించారు. అయితే, కో లివింగ్ హాస్టళ్ల నిర్వాహకుల నుంచి ప్రతీనెలా ఆయా పోలీస్ స్టేషన్లకు ఠంచనుగా మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే పోలీసులు వాటి గురించి పట్టించుకోరన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read- Oka Manchi Prema Katha: నవ్విస్తూ, ఏడ్పించేలా ‘ఓ మంచి ప్రేమ కథ’.. ట్రైలర్ ఎలా ఉందంటే..
ఇతర రాష్ట్రాలకు చెందిన వారే
ఇక, పెరిగిపోతున్న కో లివింగ్ హాస్టళ్ల కల్చర్ ఖచ్చితంగా మనుషుల్లో నైతిక విలువల పతనానికి కారణమవుతుందని ఫ్యామిలీ కౌన్సిలర్ సునీత అన్నారు. కుటుంబ సభ్యుల ఆజమాయిషి ఉండగానే ఎంతోమంది తప్పుడు దారులు పడుతూ కొన్నిసార్లు ఘోరమైన నేరాలకు సైతం పాల్పడుతున్నారని చెప్పారు. ఇక, ఈ కో లివింగ్ హాస్టళ్లలో ఉండేవారిలో అధికశాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అని చెప్పారు. తమను అడిగేవారు లేకపోవటం…ఆర్థిక స్వాతంత్ర్యం ఉండటంతో నచ్చింది చేసుకుంటూ పోతారన్నారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు కో లివింగ్ హాస్టళ్లలో పెద్ద నేరమేదీ జరగలేదని అంటూ జరగదన్న గ్యారంటీ కూడా ఏమీ లేదని చెప్పారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
