Tollywood: టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్ సందర్భంగా నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఒక సీనియర్ జర్నలిస్ట్ (Sr Journalist)తో నిర్వహించిన ఇంటర్వ్యూ వ్యవహారం ఇటీవల పెద్ద దుమారం రేపింది. ఆ జర్నలిస్ట్ అడిగిన వ్యక్తిగత, వస్త్రధారణకు సంబంధించిన ప్రశ్న పట్ల మంచు లక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేయడం, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం, ఆ తరువాత జర్నలిస్ట్ సారీ చెప్పడంతో ఈ వివాదం ముగిసింది. అయితే, ఈ మొత్తం వ్యవహారం టాలీవుడ్‌లో సెలబ్రిటీలు, మీడియా మధ్య సంబంధాలపై కొత్త ప్రశ్నలను, చర్చను లేవనెత్తింది. ఒక వైపు, సదరు జర్నలిస్ట్ ప్రశ్నలు అభ్యంతరకరంగా, వ్యక్తిగతంగా ఉంటున్నాయనే విమర్శలు తరచూ వినిపిస్తున్నా, మరోవైపు ఆయన ఇంటర్వ్యూల కోసం సెలబ్రిటీలు, ముఖ్యంగా కొత్త సినిమా ప్రమోషన్స్ ఉన్న నటీనటులు ఎగబడుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, కొందరు సినీ ప్రముఖులు స్వయంగా డబ్బులు చెల్లించి మరీ ఆ జర్నలిస్ట్‌తో ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా కేవలం తమ సినిమాకు హైప్ తీసుకురావడం, తద్వారా వీక్షణలు, వైరాలిటీని పెంచుకోవడం కోసమేనని తెలుస్తోంది.
Also Read- Oka Manchi Prema Katha: నవ్విస్తూ, ఏడ్పించేలా ‘ఓ మంచి ప్రేమ కథ’.. ట్రైలర్ ఎలా ఉందంటే..
డబుల్ స్టాండర్డ్స్
ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతోంది. తమకు కావాల్సిన ప్రచారం కోసం ఎదురు డబ్బులిచ్చి మరీ ఇంటర్వ్యూలు చేయించుకుంటూ, ఆ తరువాత ఏదైనా ప్రశ్న తమ వ్యక్తిగత హద్దులు దాటిందనో లేదా బాధ కలిగించిందనో భావించినప్పుడు వెంటనే క్షమాపణలు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న వినిపిస్తోంది. ఒకవేళ ఆ జర్నలిస్ట్ విధానం, ప్రశ్నలు సరైనవి కాదని నిజంగా భావిస్తే, అందరూ ఏకమై ఆయన్ను దూరం పెట్టాలి. కానీ కొందరు ప్రోత్సహించి, డబ్బులిచ్చి దగ్గర చేసుకొని, మళ్ళీ హర్ట్ అయ్యామని చెప్పి సారీ చెప్పించుకోవడం డబుల్ స్టాండర్డ్‌గా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సదరు జర్నలిస్ట్ సోషల్ మీడియాను గమనిస్తే.. ప్రతి సినిమాకు పదేసి టికెట్స్ తన ఫాలోయర్స్‌కు ప్రకటిస్తూ ఉంటారు. ఆ టికెట్స్ ఎక్కడివి? ఎవరు ఇస్తున్నారు? నిర్మాతలే కదా.. టికెట్స్ ఆయనకు ఇచ్చి.. ఈ విధంగా కూడా ప్రమోట్ చేయించుకుంటుంది. మరి మళ్లీ ఈ క్షమాపణల రాద్ధాంతం ఎందుకు?
Also Read- Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఆ ఇద్దరు పండిట్స్! థమన్ స్కెచ్ అదిరింది
ఇది ఎంత వరకు కరెక్ట్?
ప్రస్తుత డిజిటల్ యుగంలో, ఇంటర్వ్యూలు కేవలం సమాచారం ఇవ్వడానికి మాత్రమే కాకుండా, సినిమా ప్రమోషన్స్‌లో ముఖ్య భాగంగా మారాయి. ఈ క్రమంలో వివాదాస్పద అంశాలు, పర్సనల్ ప్రశ్నలు అడిగే జర్నలిస్ట్‌లను ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కువ రీచ్ వస్తుందని నిర్మాతలు, నటీనటులు భావిస్తున్నారు. అయితే, అలా హైప్ కోసం వెంపర్లాడి, ఆ తర్వాత పరువు పోయిందని భావించడం ఎంత వరకు కరెక్ట్? సెలబ్రిటీలు తమకు నచ్చని జర్నలిస్ట్‌లను పూర్తిగా దూరం పెట్టాలి, లేదా ప్రొఫెషనల్‌గా అన్ని ప్రశ్నలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. డబ్బులిచ్చి ప్రమోషన్స్ చేయించుకుంటూ, మళ్లీ ‘సారీ’లు అడగడం అనేది టాలీవుడ్ వ్యవహారశైలిలోని పారదర్శకత లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఈ ధోరణి మీడియా విలువలతో పాటు, సినిమా ప్రమోషన్స్ విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు క్షమాపణ అడిగిన మంచు లక్ష్మి.. మళ్లీ తన సినిమా ఏదైనా విడుదల అవుతుందంటే.. సదరు జర్నలిస్ట్‌తోనే ఇంటర్వ్యూకు సిద్ధమవుతారు. ఒక రకంగా ఆయనతో కాంట్రవర్సీ సినిమా ప్రమోషన్స్‌కు బాగా ఉపయోగపడుతుందనే విధానాన్ని క్రమక్రమంగా బలపరుస్తున్నారు. మరి ఈ విధానానికి ఎప్పటికి బ్రేక్ పడుతుందో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
