COLDWAVE 2.0: జనవరి 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో చలి కాస్తంత తగ్గింది. జనాలు రిలీఫ్ అవుతుండగా, మరోసారి చలి పులి పంజా విసిరేందుకు తయారైంది. కోల్డ్ వేవ్ 2.O షురూ (COLDWAVE 2.0) కాబోతోంది. జనవరి 5 నుంచి తిరిగి మళ్లీ విపరీతమైన చలి పెడుతుందని వాతావరణ అప్‌డేట్స్ అందించే పాపులర్ ట్విటర్ పేజీ ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ అప్రమత్తం చేసింది. శీతల గాలుల వీస్తాయని తెలిపింది. జనవరి 5 నుంచి 12 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే తగ్గుతాయని, 25 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు కురుస్తుందని తెలిపింది. ఇక, పగటిపూట మసకగా ఉంటుందని, మంచు వాతావరణం కొనసాగుతుందని వివరించింది. మొత్తంగా గత నెల జనవరిలో ఉన్న వాతావరణం తిరగి వారం రోజులపాటు ఉంటుందని హెచ్చరించింది.
కాగా, ఈ తరహా శీతల గాలులు, చల్లటి వాతావరణంలో వృద్ధులు, చిన్న పిల్లలు, శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్త తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. కాబట్టి, బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్లు ధరించడం మంచిది. అలాగే, విజిబిలిటీ తక్కువగా ఉండే ఉదయం వేళలు, రాత్రి పూటల్లో ప్రయాణాలు చేయకపోవడం మంచిదని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు.
ఉత్తర భారతంలో వణుకుపట్టే చలి
ఉత్తర భారతదేశంలో కూడా కోల్డ్ వేవ్ కొనసాగనుందని భారత వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన చలి ఉంటుందని తెలిపింది. ఇక, వాయువ్య భారతంలో చలి తీవ్రత పెరగడంతో ‘యెల్లో అలర్ట్’ను జారీ చేసింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా రాష్ట్రాల్లో జనవరి 4 నుంచి జనవరి 6 వరకు శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. శీతల గాలులు, మంచు ప్రభావంతో ఉత్తర భారతదేశంలో గాలి నాణ్యత (AQI) కూడా ఆందోళనకరంగా మారింది. ఆదివారం నాడు ఢిల్లీ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 248గా నమోదయింది. అంటే, గాలి నాణ్యత చాలా పేలవంగా ఉందని దీనిర్థం. ఈ ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. విమాన ప్రయాణాల్లో కూడా అవాంతరాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కూడా ఆదివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది.

