Kishan Reddy: కోల్ సేతు విండోకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan Reddy) ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని బొగ్గు, గనుల రంగంలో ప్రధాని మోడీ(PM Modhi) సర్కార్ అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, ఫలితంగా గనుల రంగంలో సమూల మార్పులు జరిగాయన్నారు. కొన్నేళ్లలో బొగ్గు, గనుల రంగంలో అనేక రికార్డులను తిరగరాశామని, చరిత్రలోనే తొలిసారిగా బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 1 బిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించినట్లు వివరించారు.
చట్టంలో మార్పులు
మైన్స్ అండ్ మినరల్స్(డెవలప్ మెంట్ అండ్ రెగ్యులరైజేషన్) చట్టంలో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. 2015 నుంచి గనుల కేటాయింపులో పారదర్శకంగా వేలం ప్రక్రియను ప్రారంభించామన్నారు. దీంతో గనుల కేటాయింపులో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చేశామని వివరించారు. తాజాగా కోల్ సేతు విండోకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, దీంతో బొగ్గు, గనుల రంగంలో మరింత పారదర్శకత వస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
విదేశాలకు కూడా ఎగుమతి
దేశంలోని బొగ్గు రంగం ఆత్మ నిర్భరత దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో సరికొత్తగా తీసుకొచ్చిన ఈ కోల్ సేతు విండో ద్వారా బొగ్గును ఫర్టిలైజర్(Fertilizer), పవర్ సెక్టార్ మినహా సిమెంట్, స్టీల్, స్పాంజ్ ఐరన్, అల్యూమినియం వంటి నాన్ రెగ్యులేటెడ్ సెక్టార్ కంపెనీలు తమ సొంత అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం కలుగుతుందన్నారు. తద్వారా భారతదేశం ఎగుమతులకు హబ్ గా మారనుందని వెల్లడించారు. దేశంలో వాష్ చేసిన బొగ్గుకు డిమాండ్ ఉండటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అయితే తాజా విండోతో బొగ్గును వాషరీ ఆపరేటర్లు వాషింగ్ చేయొచ్చని, దీంతో దేశంలోనే నాణ్యమైన బొగ్గు లభ్యత పెరిగి దిగుమతులు తగ్గుతాయని కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read: Huzurabad: వరి కొయ్యకాల్లను పొలంలోనే కలియదున్నండి.. ఎరువుల ఖర్చు తగ్గించే సాగు పద్ధతి ఇదే!

