CM Revanth Reddy: కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరారు. నిరు పేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలన్నారు. సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మ సంతృప్తి లభిస్తుందని చెప్పారు. హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్‌లో ఏఐజీ నూతన ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్పొరేట్ రంగంలో ఉన్న డాక్టర్లు ప్రభుత్వ సేవలు అందించాలంటే అనుసంధానం కోసం ఇప్పటివరకు సరైన వేదిక లేదన్నారు. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్టు చెప్పారు.
ఉస్మానియా ఆసుపత్రికి 30 ఎకరాల స్థలం
“అమెరికాలో స్థిరపడిన మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు వారు సేవలు అందించాలంటే అందుకు తగిన ప్లాట్‌ఫామ్ ఏదీ లేదు. వారిక్కడ ఉన్న సమయంలో వారి సేవలు అందించాలనుకుంటే అందుకు అనుగుణంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించాం. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ప్రాణాలు పోతాయన్న అభిప్రాయం నుంచి దూరం చేయాలన్న ఆలోచనతో కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నది. అందులో భాగంగానే వందేళ్ల (Osmania Hospital) ఉస్మానియా ఆసుపత్రికి 30 ఎకరాల స్థలం కేటాయించి రూ.3 వేల కోట్లతో కొత్త ఆసుపత్రి నిర్మిస్తున్నాం’’ అని విరించారు.
Also Read: Sigachi Pharma Incident: సిగాచి ఘటనపై నిపుణుల కమిటీ.. ఘటనా స్థలానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్!
రూ.1400 కోట్లు ఖర్చు
నిమ్స్‌లో మరో 2 వేల పడకల విభాగం ప్రారంభించబోతున్నామని, అలాగే వరంగల్, అల్వాల్, ఎల్‌బీ నగర్, సనత్‌నగర్ (Sanatnagar) తదితర ప్రాంతాల్లో కార్పొరేట్‌కు దీటుగా రాష్ట్రంలో 7 వేల పడకలతో ఆసుపత్రులను వచ్చే డిసెంబర్ 9 నాటికి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పెరిగిన వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని అధికారం చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్న సీఎం, దాంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద ఇప్పటివరకు రూ.1400 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
పేదలకు వీలైనంత వరకు విద్య, వైద్యం అందించాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ఆ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ.11,500 కోట్లు, విద్యకు ర.21,000 కోట్లు కేటాయించామన్నారు. ‘‘రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది సభ్యులను చేర్పించడమే కాకుండా వారందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలన్నది మా లక్ష్యం. వారందరికీ వారివారి హెల్త్ ప్రొఫైల్స్‌తో ఒక యూనిక్ ఐడీ నంబర్‌తో కార్డులను జారీ చేయాలి.
Also Read: Harish Rao: అసెంబ్లీలో బనకచర్లపై చర్చకు సిద్ధం.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్!
మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకే నివారణ చర్యల్లో భాగంగా హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేయాలన్న ఆలోచన చేశాం. రాబోయే వంద సంవత్సరాలు లక్ష్యంగా (Telangana Rising) తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌లో ఒక చాప్టర్ ఆరోగ్య రంగం. అందుకోసం డాక్టర్ నాగేశ్వర రెడ్డి (Dr. Nageswara Reddy) భాగస్వామ్యం కావాలి. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఇటీవలే ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించింది’’ అని గుర్తు చేశారు.
ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 దేశాల నుంచి చికిత్స కోసం నగరానికి వస్తున్నారంటే అది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఏఐజీ ఆసుపత్రి రూపొందించిన జననీ మిత్ర యాప్ వినియోగానికి సంబంధించి అధికారులను పంపించి అధ్యయనం చేయమని చెబుతామని తెలిపారు. ప్రస్తుతం నర్సింగ్ ప్రొఫెషన్‌కు జపాన్ దేశంలో మంచి డిమాండ్ ఉందన్న సీఎం, అందుకే మన వాళ్లకు జపనీస్ భాష నేర్పించాలని నిర్ణయించామని వ్యాఖ్యానించారు. భారత్ వెనుకబడిన దేశం అన్న అభిప్రాయం నుంచి బయటకు తీసుకురావాలని, ప్రపంచంలోనే అనేక విషయాల్లో ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర మనకున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వివరించారు.
Also Read: Ranga Reddy District Tahsildar: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్!