CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ సారి కూడా నిమజ్జనంలో జనాన్ని ఆకర్షించుకున్నారు. గతేడాది కూడా సీఎం ఇక్బాల్ మినార్ నుంచి సచివాలయం వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన ఊరేగింపులో ముందు నడిచి సరి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ సారి నిమజ్జనంలో సీఎం రేవంత్ రడ్డి(CM Revanth Reddy) సడెన్ ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద జరుగుతున్న నిమజ్జనోత్సవంలో సాయంత్రం దర్శనమిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా శనివారం అంగరంగ వైభవంగా జరుగుతున్న గణనాథుడి నిమజ్జనానికి శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాంప్రదాయ దుస్తుల్లో సింపుల్ గా హాజరయ్యారు.
Also Read: CM Revanth Reddy: ఖైరతాబాద్ గణనాధుడ్ని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి తన ప్రత్యేకత
గడిచిన రెండేళ్లలో సీఎం నేరుగా గణేశ్ నిమజ్జనంలో సీదాసాదాగా పాల్గొని ముఖ్యమంత్రి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గతేడాది కూడా నిమజ్జనంలో ముందు నడుస్తూ ప్రజలకు, మండప నిర్వాహకులకు అభివాదం చేస్తూ సీఎం మరింత జోష్ నింపారు. ముందస్తు ఎలాంటి సమాచారం గానీ, కాన్వాయి సైరన్ గానీ లేకుండా, కేవలం మూడు కార్ల కన్వాయితో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్టీఆర్ మార్గ్ లో ఖైరతాబాద్ భారీ గణపయ్యను నిమజ్జనం చేసిన క్రేన్ నెం.4 వద్దకు వచ్చారు. భద్రత లేకుండా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన రేవంత్ నిమజ్జనం ఎలా జరుగుతుందని అధికారులను అడిగి తెల్సుకున్నారు.
ఎప్పటికపుడు వ్యర్థాలను తొలగిస్తున్నారా?
విగ్రహాల నిమజ్జనం పూర్తి కాగానే ఎప్పటికపుడు వ్యర్థాలను తొలగిస్తున్నారా? అని ప్రశ్నించారు. నిమజ్జనం ఏర్పాట్లు, సరళిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ముఖ్యమంత్రికి వివరించారు. సడెన్ గా ముఖ్యమంత్రి నిమజ్జనంలో ప్రత్యక్షం కావటంతో జనం ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. తనను కలిసేందుకు ప్రయత్నించిన భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ, ఏమైనా ఇబ్బందులున్నాయా? అంటూ అడిగి తెల్సుకున్నారు. తొలుత నిమజ్జన ప్రక్రియను చార్మినార్ వద్ద తిలకించాలని సీఎం భావించినా, ఆ తర్వాత సడెన్ గా ఎన్టీఆర్ మార్గ్ లో ఎంట్రీ ఇవ్వటం ప్రజలను బాగా ఆకట్టుకుంది. సుమారు అరగంట సేపు నిమజ్జనాన్ని పరిశీలించినానంతరం సీఎం తన కాన్వాయి నుంచి భక్తులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
Also Read: Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం