CM Revanth Reddy: ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రాజకీయాలు కలుషితమయ్యాయో, ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని.. పలు కీలక బిల్లులపై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయని చెప్పవచ్చు. కులం పట్లనో, వ్యక్తి పట్లనో ప్రత్యేక అభిమానం ఉండే నైజం తనది కాదని సీఎం తేల్చిచెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం 5 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే పేరుతో 2 తెలుగు రాష్ట్రాలలో యూనివర్సిటీ ఉండడం ద్వారా కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. అందుకే హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలోనే తాము చట్ట సవరణ బిల్లును కోరామని, కానీ గత ప్రభుత్వం ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.
పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటం లేదని, వారి ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలన్నారు. పరిపాలనలో భాగంగా కొన్ని పాలనా పరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు, రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర పునర్విభజన తరువాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని సీఎం తెలిపారు. కొన్ని వర్గాలకు కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదని సూచించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నామని, అంతమాత్రాన ఎన్టీఆర్ ను అగౌరవపరిచినట్టు కాదన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నట్లు, వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామన్నారు. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టగా, ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు నామకరణం చేశామన్నారు. ఏపీలో ఆ పాత పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో పేర్లు మార్చుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ పేర్లు పెట్టుకుంటున్నామన్నారు. అంతే కానీ వ్యక్తులను అగౌరవపరిచేందుకు కాదు.. విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కులాన్ని ఆపాదిస్తున్నారని విమర్శించారు. కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే అది తప్పు.. గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం పేరు తొలగించి ప్రధాని మోదీ పేరు పెట్టినట్లు సీఎం గుర్తు చేశారు.
తాము అలాంటి తప్పిదాలు చేయలేదు.. చేయమని, చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని సీఎం సూచించారు. చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలన్నారు. బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్ కు రోశయ్య గారి పేరు పెట్టుకుందామని, రోశయ్య సేవలను కీర్తించుకునేలా అక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సీఎం తెలిపారు.