Revanth Reddy: ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు (Aler) నియోజకవర్గం, తిరుమలగిరి గ్రామంలో సుమారు 1051.45 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో ట్రిలియన్ ఎకానమీ (Economy) కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. తెలంగాణ (Telangana) పేద ప్రజలు దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా నిలబెడతానని, జపాన్, సింగపూర్ సరసన రాష్ట్రాన్ని నిలుపుతానని అన్నారు.
గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేస్తాం
దేశంలో వందేళ్లలో ఎవరు చేయని విధంగా మొదటిసారి కులగణనను చేపట్టి రాష్ట్రంలో 56.36% బలహీన వర్గాలు ఉన్నారని లెక్కలు తీశామన్నారు. విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా, 600 బస్సులను స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇచ్చి వారు వ్యాపార రంగంలో రాణించేలా చేశామని, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను, యూనిఫామ్ కుట్టే బాధ్యతలను మహిళలకు అప్పగించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరు పేదలకు నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో గంధమల్ల రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామన్నారు.
Read Also- Akhil Wedding: కొడుకులతో కలిసి కింగ్ నాగ్ ఏ పాటలకు డ్యాన్స్ చేశారో తెలుసా?
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
నల్లగొండ రైతులకు మేలు చేసేలా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని, గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని సీఎం రేవంత్ అన్నారు. ఎన్నికల సమయంలో పాదయాత్ర చేశానని, మూసీ పరివాహక ప్రాంత ప్రజల కష్టాలు స్వయంగా తాను చూశానని తెలిపారు. బీజేపీ నేతలు నర్మద, గంగా నదులను ప్రక్షాళన చేసుకోవచ్చు గానీ, తెలంగాణ ప్రజలు మూసీ నదిని చేసుకోవద్దా అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవనం జరుగుతుంటే, ఇళ్లు కూలగొడుతున్నామని బీఆర్ఎస్, బీజేపీ అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. నది ఒడ్డున ఉండే పేదలను ఆదుకుంటామని చెప్పినా రెచ్చగొట్టారని ఫైరయ్యారు.
బీఆర్ఎస్‌కు కొత్త పేరు పెట్టిన సీఎం
బీఆర్ఎస్‌లో దయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఆ పార్టీ బీఆర్ఎస్ కాదు డీఆర్ఎస్ అని, అంటే దయ్యాల రాజ్య సమితి అని ప్రతిపక్ష పార్టీకి పేరు పెట్టారు. ఆ దయ్యాలు, కొరివి దయ్యాలతో తెలంగాణకు పని లేది తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారని, బొందలగడ్డలా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాసాలమర్రిలో ఇళ్లు కూల్చారని, ఫాంహౌస్‌కు రోడ్డు కోసం చేయాల్సిన పాపాలన్నీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నా కూడా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని సీఎం మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా 1వ తేదీన జీతాలు వేశారా అని ప్రశ్నించారు.
అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునే విధంగా 100 నియోజకవర్గాలలో 20వేల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ తరహాలో యాదగిరిగుట్టకు వైటీడీ (యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్)ని ఏర్పాటు చేసుకోబోతున్నామని, తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాదిరిగానే ఇక్కడ చేపట్టే ప్రభుత్వ వైద్య కళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తామని, దేశంలోనే గుర్తింపు ఉన్న యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు.
Read Also- Modi-G7 Summit: ఊహించని పరిణామం!.. కెనడా రమ్మంటూ మోదీకి పిలుపు