CM Revanth Reddy: రాష్ట్రంలో వర్ష సూచనల నేపథ్యంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Redy) అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం జరుగకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రత్యేక బృందాలు పంట కొనుగోళ్లపై దృష్టి సారించాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సోమవారం సాయంత్రం అన్ని జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట ఉత్పత్తి, సేకరణ, కొనుగోలు ప్రాసెస్‌పై ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొనుగోళ్లపై నిరంతరం పర్యవేక్షణ
ధాన్యం కొనుగోలు సమయంలో అవినీతి చోటు చేసుకుంటే ఉపేక్షించేది లేదని మంత్రి ఉత్తమ్(Uttam) హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. మొంథా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద తుఫాను ప్రభావం పడకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లో రైతాంగం నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. టార్బాలిన్‌లను వినియోగించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన రవాణా వసతి ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటి వరకు 4,428 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, మిగిలిన 3,814 ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం వరకు 22,433 మంది రైతుల నుంచి ప్రభుత్వం 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.431.09 కోట్లు అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?
కేంద్రమంత్రికి తుమ్మల లేఖ
పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తేమ శాతంలో మినహాయింపు ఇచ్చి పత్తిని కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర ఔళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహన్(Minister Giriraj Singh Chouhan)కు సోమవారం లేఖ రాశారు. పత్తి రైతులకు గరిష్ట మద్ధతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వారు తమ పంటను మార్కెట్ యార్డుకు లేదా జిన్నింగ్ మిల్లుకు అమ్ముకోవడానికి తీసుకురావడానికి ముందు తేమ శాతం 12 మించకుండా చూసుకోవాలని కోరారు. మించినట్టయితే కనీస మద్ధతు ధర పొందే అవకాశం ఉండదన్నారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చే వరకు పత్తి రైతులు అమ్ముకునే ముందు తేమ శాతాన్ని 12 శాతం మించకుండా చూసుకోవాలన్నారు. కపాస్ కిసాన్ యాప్‌లో రిజిస్ట్రర్ చేసుకోవడం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిక బృందాలు జిల్లాలో పర్యటిస్తున్నాయన్నారు. రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5779ను మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిందని వివరించారు.
పీఎస్ఎస్‌తో పంట కొనుగోలు చేయాలి
ప్రైస్ సపోర్ట్ స్కీం (పీఎస్ఎస్)కింద చేపట్టనున్న పంటల కొనుగోలుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని తుమ్మల కేంద్రాన్ని కోరారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పెసర, మినుము పంటలు 100%, సోయాబీన్ 50% వరకు కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ) కింద కొనుగోలు అనుమతులు ఇవ్వాలని కోరారు. మొక్కజొన్న, జొన్న పంటలను కూడా పీఎస్ఎస్‌లో చేర్చాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.
Also Read: Kishan Reddy: జూబ్లీ హిల్స్‌లో నామినేషన్ తర్వాత కనిపించని బీజేపి నాయకులు
