CM Revanth Reddy: కేబినేట్ లోని మంత్రులపై వార్తలు రాసేముందు తనను వివరణ కోరాలని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం పరోక్షంగా మీడియా సంస్థల యజమానులను ఉద్ధేశించి కౌంటర్ ఇచ్చారు. మీడియాకు వివరణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉంటానన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఏ ఆరోపణలు వచ్చినా.. ప్రభుత్వ పెద్దగా అది తన గౌరవానికి భంగం కలిగిస్తుందని రేవంత్ పేర్కొన్నారు. తన నాయకత్వంపై అపోహాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాల్లో మంత్రులను బద్నాం చేయవద్దని మీడియాకు సూచించారు.
‘సింగరేణిలో అవినీతికి అవకాశం లేదు’
సింగరేణి బొగ్గుగనుల టెండర్లు పై ఉపముఖ్యమంత్రి పై తాజాగా వచ్చిన కథనాలపై ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ స్పందించారు. ప్రజా పాలనను అందిస్తున్న తమ ప్రభుత్వాన్ని కుట్రలు, కుతంత్రాలతో పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడని కేసీఆర్ ను ఉద్ధేశించి ఆరోపించారు. ఇందులో భాగంగానే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియా ద్వారా అడ్డగోలు ప్రచారం చేయిస్తూ మంత్రుల మీద వార్తలు రాయిస్తున్నారని అన్నారు. సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి అవకతవకలు జరిగే అవకాశమే లేదన్నారు. కోల్ మైన్ టెండర్లను నిఖార్సయిన, అనుభవం ఉన్నవాళ్లకే ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు. అణా పైసా అవినీతికి అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
‘మంత్రులను బద్నాం చేయవద్దు’
ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే కొట్లాడుకోండిగాని తమ మంత్రులను బద్నాం చేయవద్దని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాస్తున్న రాతల పట్ల ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకుని రాయలన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ విషయంలో తెలంగాణ రాష్ట్రం లో అనుసరించాల్సిన వైఖరిపై కూడా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు, గద్దెలు కూలిస్తే అదే దివంగత ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అన్నారు. తెలంగాణాలో టీడీపీ ఉండరాదని, ఆ పార్టీ నాయత్వాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ ను.. వంద మీటర్ల గొయ్యితీసి పాతిపెట్టినపుడే నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళులు అర్పించినవాళ్లమవుతామని రేవంత్ చెప్పుకొచ్చారు.
Also Read: Assembly Session: ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు.. ఈసారి జగన్ రావాల్సిందేనా? లేదంటే సీటు గల్లంతేనా?
టీడీపీ శ్రేణులకు కీలక విజ్ఞప్తి
గులాబీ పార్టీ జెండా గద్దెలను గ్రామాల్లో కూల్చాలని టీడీపీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావును కీర్తిస్తూ పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని రేవంత్ అన్నారు. రూ. 2 కిలో బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపిన ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డ్ ఇచ్చి సన్నబియ్యం అందించనపుడే ఎన్టీఆర్ కు నిజమైన నివాళిగా రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణాలో ఇంకా పేదలెవరైనా మిగిలి ఉంటే వారికి రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. తెలంగాణలో పదేళ్లు మన పాలనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

