CM Revanth Reddy - Harish Rao:
తెలంగాణ

CM Revanth Reddy – Harish Rao: రేవంత్ తో హారీశ్ భేటీ.. ఏం జరగబోతుంది?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ :  తెలంగాణ రాజకీయాల్లో అసలు ఇలాంటిది కూడా జరుగుతుందా? అనే లాంటి సంఘటన ఒకటి ఇవాళ జరిగింది. రాజకీయంగా బద్ద శత్రువులైన  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు కలుసుకున్నారు. స్వయంగా హరీశ్ రావు సీఎంతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా ఉన్నారు. ఎంత సంచలనమైన విషయమో వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ భేటీ అయ్యారు. సహజంగానే ఈ భేటీపై రాజకీయ చర్చలు మొదలయ్యాయి. సికింద్రాబాద్‌లోని ఓ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదలపై భేటీ అయినట్లు హరీశ్ రావు వివరణ ఇచ్చినా ఊహాగానాలు మాత్రం ఆగలేదు. దాదాపు పావుగంటకు పైగా ఈ ముగ్గురి మధ్య జరిగిన భేటీపై అసెంబ్లీ లాబీలో అన్ని పార్టీల సభ్యుల మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరీశ్‌రావు భేటీ అయిన నేపథ్యాన్ని పోల్చుకుంటూ ఇప్పుడు సీఎంగా ఉన్న రేవత్‌తో ఎందుకు కలవాల్సి వచ్చిందనేది అన్ని పార్టీల్లో ఆసక్తికి కారణం. బీఆర్ఎస్ పార్టీలో ఒకింత లోతుగానే గుసగుసలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఏ టర్న్ తీసుకుంటుందన్నది కీలకంగా మారింది.

Harish Rao vs Komatireddy: హరీష్ వర్సెస్ కోమటిరెడ్డి.. అసెంబ్లీ వేదికగా పేలిన మాటల తూటాలు

వాడీవేడీగా వాదనలు.. విడిగా భేటీ

బడ్జెట్‌పై ఉదయం రెండున్నర గంటల పాటు చర్చలో పాల్గొన్న హరీశ్‌రావు.. రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వాస్తవిక బడ్జెట్ అంటూనే అంచనాలు పెంచి గొప్పలు చెప్పుకున్నదని, ఇచ్చిన హామీలను, గ్యారంటీలను గాలికొదిలేసిందని తూర్పారబట్టారు. గతేడాది సమర్పించిన బడ్జెట్ తరహాలోనే ఈసారి కూడా సవరించిన అంచనాల్లో లెక్కలను తగ్గించే అవకాశమున్నదని పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా గత బడ్జెట్‌లో అంచనాలు తగ్గించక తప్పలేదన్న ప్రభుత్వ సమర్ధనను హరీశ్‌రావు ప్రస్తావిస్తూ మాంద్యం రాష్ట్రంలో లేదని, బుద్ధిలో ఉన్నదని చేసిన కామెంట్లకు మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలన్న డిమాండ్ కూడా వచ్చింది. ఇంత ఆవేశంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యానించిన హరీశ్‌రావు ఆ తర్వాత సీఎంతో ఆయన ఛాంబర్‌లో భేటీ కావడంతో రకరకాల ఊహాగానాలకు తావిచ్చినట్లయింది.

పార్టీ శ్రేణులకు ఏం మెసేజ్ ఇచ్చినట్లు? 
ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కేసీఆర్, కేటీఆర్ వేర్వేరు సందర్భాల్లో తప్పుపడుతూ ఉండగా కౌన్సిల్ వేదికగా ఎమ్మెల్సీ కవిత కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్‌తో హరీశ్‌రావు భేటీ కావడం మరే పార్టీలోకంటే బీఆర్ఎస్‌లో లోతుగా చర్చకు దారితీసింది. రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్‌తో ప్రభుత్వం మీద యుద్ధం చేసే సమయంలో జరిగిన ఈ సమావేశం గులాబీ శ్రేణులకు, లీడర్లకు మింగుడుపడలేదు. ఉద్దేశమేదైనా రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే కులగణన విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు దూరంగా ఉన్నా కవిత మాత్రం పాల్గొనడంతో ఆ పార్టీ డిఫెన్సులో పడినట్లయింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు హరీశ్‌రావు వ్యవహారం ఆ పార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చినట్లయింది. రానున్న రోజుల్లో కేసీఆర్ ఎలా స్పందిస్తారు.. ఫామ్ హౌజ్‌కు పిలిపించుకుని వివరణ తీసుకుంటారా?.. కేటీఆర్ ఎలాంటి వైఖరి తీసుకుంటారు?.. ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రిని ఎందుకు కలిశామనే అంశానికి హరీశ్‌రావు స్వయంగా వివరణ ఇచ్చినా దానికంటే ఊహాగానాలే హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం రేవంత్ పదేపదే కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, ఆయన వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉన్నదని, అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వ వైఫల్యాలంటూ తప్పు పడుతున్నారని.. ఇలాంటి మాటలు కవిత, కేటీఆర్ నుంచి వినిపిస్తున్న సమయంలో హరీశ్‌రావు వెళ్ళి కలవడం శ్రేణుల్ని అయోమయంలో పడేసింది. నిజంగా పద్మారావు గౌడ్ నియోజకవర్గానికి సంబంధించిన అంశం గురించే సీఎంతో చర్చించాల్సి వస్తే ఛాంబర్‌కు వెళ్ళాల్సిన అవసరమేంటి.. ఫోటోలు కూడా బైటకు రాకుండా జాగ్రత్త పడాల్సిన పనేంటి.. అసెంబ్లీ హాల్‌లోనే ఇవ్వొచ్చుగదా.. ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతూ రాజకీయంగా కొట్లాడుతున్న సమయంలో హరీశ్‌రావు వెళ్ళి కలవడం నీళ్ళు చల్లినట్లయిందనేది గులాబీ లీడర్ల వాదన.

ఎస్డీఎఫ్ నిధుల కోసమే కలిశాం : హరీశ్‌రావు
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తన నియోజకవర్గం పరిధిలోని సీతాఫల్‌మండిలో పెండింగ్‌లో ఉన్న స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశామని హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. హైస్కూల్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల ఒకేచోట ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ హయాంలోనే రూ. 32 కోట్లు మంజూరయ్యాయని, ఎన్నికల కోడ్ రావడంతో నిధుల విడుదలకు బ్రేక్ పడిందని వివరించారు. ఇప్పుడు వాటిని విడుదల చేయాలని కోరేందుకే ముఖ్యమంత్రి దగ్గరకు పద్మారావుగౌడ్ వెళ్తూ తనను కూడా రమ్మన్నారని, రాతపూర్వకంగా విజ్ఞప్తిని ఇచ్చామని తెలిపారు. అంతకుమించి ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు