CM Revanth: దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ (Gandhi Bhavan) లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా చేయడంలో విజయం సాధించామని అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు నమోదు చేశామని చెప్పుకొచ్చారు.
పదవులతోనే గౌరవం
తాను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. యూత్ కాంగ్రెస్, NSUI, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు వరించాయని అన్నారు. పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దన్న సీఎం.. వాటితోనే మీకు గుర్తింపు, గౌరవం లభిస్తాయని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మీ ఎదుగుదలకు అది ఉపయోగపడుతుందని సూచించారు.
క్షేత్రస్థాయిలో పర్యటించాలి
రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలి ఎన్నికలు.. రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయని అన్నారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని సీఎం అన్నారు. మీరు నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Also Read: Rupee Bond Market: రూపీ బాండ్ మార్కెట్‌కు కష్టకాలం.. ఆర్‌బీఐ సంకేతాలతో మందగమనం తప్పదా!
ఖర్గేను స్ఫూర్తిగా తీసుకోండి
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని టీపీసీసీ కార్యవర్గానికి రేవంత్ దిశానిర్దేశం చేశారు. ‘మనమంతా కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలి. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేది. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలి’ అని రేవంత్ అన్నారు.