Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. దీంట్లో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ప్రభాకర్రావు స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈనెల 5న విచారణకు హాజరవుతానని ఇప్పటికే ఆయన సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారులు ఫోన్‌ట్యాపింగ్ లో సూత్రధారులు ఎవరన్నది నిగ్గు తేల్చటానికి ప్రభాకర్ రావుకు సంధించాల్సిన ప్రశ్నలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభాకర్‌రావు నోరు తెరిస్తే ఈ వ్యవహారంలోని సూత్రధారులు ఎవరన్నది బయట పడుతుందని అధికారులు అంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొన్నాళ్లకే
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నడిచిన ఫోన్ ట్యాపింగ్బాగోతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే బయట పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు మొదటగా ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావును అరెస్ట్ చేశారు. ఆ తరువాత అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలతోపాటు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేసిన రాధాకిషన్ రావును కూడా కటకటాల వెనక్కి పంపించారు. విచారణలో ఈ నలుగురు వెల్లడించిన వివరాలతో ఎస్ఐబీ ఛీఫ్‌గా పని చేసిన ప్రభాకర్ రావును కేసులో ప్రధాన నిందితునిగా చేర్చారు. ఓ ఛానల్‌కు యజమానిగా ఉన్న శ్రవణ్ రావును కూడా నిందితునిగా పేర్కొన్నారు.
అమెరికాకు పరార్
కాగా, కేసులు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయారు. విచారణకు రావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. దాంతో దర్యాప్తు అధికారులు పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభాకర్ రావు పాస్ పోర్టును రద్దు చేయించారు. అదే సమయంలో సీబీఐ సహకారంతో ఇంటర్ పోల్ ద్వారా ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్‌జారీ చేయించారు. మరోవైపు ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తునిగా గుర్తించాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జూన్20వ తేదీలోపు పరెండర్కాని పక్షంలో ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తునిగా ప్రకటిస్తామంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటీసులను పోలీసులు తారామతి బారాదరి ప్రాంతంలోని ప్రభాకర్ రావు ఇంటికి అంటించారు. ఇలా ఒత్తిడి పెరిగి పోతుండటంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే, ఈ అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తోసి పుచ్చింది. మరోవైపు రెడ్‌కార్నర్ నోటీస్‌జారీ అయిన నేపథ్యంలో అమెరికా హోం ల్యాండ్స్ఏజన్సీ ప్రభాకర్‌రావును భారత్ కు డిపోట్చేయటానికి చర్యలకు శ్రీకారం చుట్టింది.
Also Read: MLC Kavitha: మనసులో బాధ కక్కేసిన కవిత.. బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై షాకింగ్ కామెంట్స్!
అన్ని దారులు మూసుకుపోవటంతో
ఇలా అరెస్ట్ నుంచి తప్పించుకునే అన్ని దారులు మూసుకుపోవటంతో విచారణకు సహకరించటానికి తాను సిద్ధంగా ఉన్నానని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్ రావు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రభాకర్ రావు స్వదేశానికి వచ్చి విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయన ఇక్కడకు రావటానికి వీలుగా పాస్ పోర్టును పునరుద్ధరించాలని పేర్కొంది. కానిపక్షంలో ట్రావెల్ పర్మిట్జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు (అరెస్ట్ చేయవద్దని) తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. అదే సమయంలో విచారణకు సహకరిస్తానంటూ కోర్టుకు అండర్ టేకింగ్ లేఖను సమర్పించాలంటూ ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు అండర్ టేకింగ్ లేఖను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఇక, ఆయన భారత్ రావటానికి వీలుగా అమెరికాలోని భారత ఎంబసీ వర్గాలు ఎమర్జన్సీ ట్రావెల్ పర్మిట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి రావటం ఖాయమైంది. ఈనెల 5న విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు ఇప్పటికే సిట్అధికారులకు తెలియచేసినట్టు సమాచారం.
ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్న సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు రానున్న నేపథ్యంలో సిట్అధికారులు ఆయనకు సంధించాల్సిన ప్రశ్నలతో ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరన్నది తేల్చే దిశగా ఇవి ఉండనున్నాయి. కాంగ్రెస్తదితర పార్టీలకు చెందిన అగ్ర నాయకులు, వారి బంధుమిత్రులతోపాటు జడ్జిల ఫోన్లను ట్యాప్చేయమని ఆదేశించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఎవరు? అన్న దానిపైనే ఎక్కువగా ఫోకస్చేయనున్నారు.
Also Read: GHMC Employees: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు .. అందని ద్రాక్షగా పదోన్నతులు!