MLC Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కవిత అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన తండ్రికి చెందిన బీఆర్ఎస్ పార్టీపై ఆమె చేస్తున్న విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న కవిత.. తను చేసిన కామెంట్స్ పై మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. తనకంటూ ప్రత్యేక ఎజెండా లేదన్న ఆమె.. అయితే పెద్దాయన (కేసీఆర్)ను ఎవరేమన్నా ఊరుకోనని స్పష్టం చేశారు. ఎన్నో ఆవేదనలు భరించలేక.. పార్టీని కాపాడుకోవాలనే.. కేసీఆర్ కు లేఖ రాసినట్లు స్పష్టం చేశారు.
కేసీఆర్ నోటీసులపై స్పందనేది!
ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తనకంటూ ప్రత్యేకంగా ఎలాంటి ఎజెండా లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీస్ ఇస్తే ఎందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తాను లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ ప్రజలు అనుకుంటున్నవేనని చెప్పారు.
బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై
బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరిగిందంటూ ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మరోమారు కవిత మాట్లాడారు. బీజేపీ వైపు బీఆర్ఎస్ పార్టీ చూడొద్దని హితవు పలికారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎక్కడా బాగుపడలేదని కవిత అన్నారు. కేసీఆర్ కు ఫ్యామిలీ కంటే ప్రజలంటేనే మక్కువ ఎక్కువని చెప్పారు. తాను లిక్కర్ కేసులో జైలుకు వెళ్లినప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ ను కలుపుతామని చెప్పారని కవిత పేర్కొన్నారు.
Also Read: MP Raghunandan Rao: చచ్చిన పార్టీకి బ్రాండింగ్.. కవితది డబుల్ గేమ్.. బీజేపీ ఎంపీ ఫైర్!
అందుకు ఒప్పుకోను
బీజేపీలో విలీనానికి తాను పూర్తి వ్యతిరేకమని కవిత మరోమారు స్పష్టం చేశారు. ఇందుకు అస్సలు అంగీకరించనని చెప్పారు. అంతేకాదు లేఖ రాయడంలో తన తప్పు కూడా ఏమి లేదని స్పష్టం చేశారు. తాను నేరుగా కేసీఆర్ నే కలిసి ఇదంతా చెప్పాలని భావించినట్లు తెలిపారు. అలా కుదరకపోవడం వల్లే లెటర్ రాయాల్సి వచ్చిందని కవిత అన్నారు. అది పార్టీలోని కొందరి వ్యక్తుల కారణంగా బయటకు వచ్చేసిందని పేర్కొన్నారు.