Minor Irrigation Census: తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరుల లభ్యత, వినియోగంపై సమగ్ర సమాచారం సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో మైనర్ ఇరిగేషన్ సెన్సెస్‌కు శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలోని చెరువులు, కుంటలతో పాటు వ్యవసాయ బోరుబావుల వివరాలను సేకరించి, వాటిని జియో ట్యాగ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా రాష్ట్రాలకు ప్రాథమిక సూచనలు అందాయి. ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న కీలక సమావేశంతో ఈ గణనపై పూర్తి స్పష్టత రానుంది. అయితే, ఈ సెన్సెస్ ద్వారా భవిష్యత్తులో నీటి వాడకంపై ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు రైతాంగంలో చర్చనీయాంశంగా మారాయి.
జియో ట్యాగింగ్‌తో పక్కా నిఘా..
రాష్ట్రంలో నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం 46,531 చిన్న నీటిపారుదల వనరులు ఉన్నాయి. వీటిలో గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 19,465 చెరువులు, ఫిషరీస్, హెచ్ఎండిఏ పరిధిలో వేల సంఖ్యలో కుంటలు ఉన్నాయి. కేంద్రం చేపట్టబోయే సెన్సెస్ ద్వారా ప్రతి చెరువు కింద ఎంత మేర వరి సాగు అవుతోంది? ఎంత దిగుబడి వస్తోంది? అనే వివరాలను పక్కాగా నమోదు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా 80 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా, అందులో 50 లక్షల ఎకరాలకు పైగా చెరువులు, బోరుబావులే ఆధారంగా ఉన్నాయి. ఈ గణనతో రాష్ట్ర సాగు రంగంపై కేంద్రం పూర్తిస్థాయిలో నిఘా పెట్టినట్లవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Trivikram Controversy: మరో సారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. ఏం జరిగిందంటే?
త్వరలోనే అధికారులకు శిక్షణ..
ఈ సెన్సెస్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఎలా నిర్వహించాలనే అంశంపై త్వరలోనే వ్యవసాయ అధికారులకు (ఏఈఓలకు) శిక్షణ ఇవ్వనున్నారు. చెరువుల జియో ట్యాగింగ్, పంటల వివరాల నమోదు, రైతుల సంఖ్య వంటి అంశాలపై వారికి మౌఖిక సూచనలు ఇప్పటికే అందాయి. కేవలం ఉపరితల నీటి వనరులే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 30 లక్షలకు పైగా వ్యవసాయ బోరుబావుల వివరాలను కూడా ఈ గణనలో చేర్చనున్నారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్న ఈ పంపుసెట్ల డేటాను కేంద్రం సేకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మీటర్ల కోసమేనా.. సస్పెన్స్!
గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తోందని, కానీ తాము దానికి ఒప్పుకోకుండా ఏటా రూ. 5వేల కోట్లు వదులుకున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ పేరుతో ప్రతి బోరుబావి లెక్క తీస్తుండటంతో, ఇది మీటర్లు పెట్టేందుకేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ రైతు ఎంత నీటిని, ఎంత విద్యుత్తును వాడుతున్నారా? అనేది ఈ డేటా ద్వారా స్పష్టమవుతున్నది. తద్వారా ఉచిత సబ్సిడీకి కోత పెడతారా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న తరుణంలో కేంద్రం చేపడుతున్న ఈ చర్యలు రాజకీయంగానూ వేడి పుట్టిస్తున్నాయి.
Also Read: Spirit Movie: ‘స్పిరిట్’ నుంచి ఈ ఫస్ట్ లుక్ చూశారా.. ప్రభాస్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు..

