BRS Party: బీఆర్ఎస్ పార్టీ ఇక ఉద్యోగులపై నజర్ పెట్టింది. ఉద్యమకాలంలో పనిచేసిన ఉద్యోగ నేతలపై దృష్టిసారించింది. ప్రస్తుతం ఉద్యోగుల సమస్యలపై గళం వినిపిస్తుండటంతో వారికి అండగా నిలబడాలని భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు డెడ్ లైన్ విధించడంతో వారికి మద్దతుగా నిలబడటంతో పాటు వారి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరుబాటకు సిద్ధమవుతుంది. ఉద్యమనాటి స్పూర్తిని వారిలో రగిల్చే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఉద్యోగులను బీఆర్ఎస్ పార్టీ తమవైపు తిప్పుకునేందుకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల హామీలపై దృష్టిసారించేందుకు సారించబోతుంది. ఆ హామీలపై ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వానికి డెడ్ లైన్ సైతం విధించాయి. దీంతో ఈ పరిణామాన్ని అనువుగామల్చుకునేందుకు సన్నద్ధమవుతుంది.
ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడి 7 నెలలు అయినా ఒక్క సమావేశం నిర్వహించలేదని, 5 కరువు భత్యాలను ప్రకటించలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. కరువు భత్యాలను విడుదల చేయాలని, 10వేల కోట్ల పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయాలని, పొదుపు చేసిన డబ్బులను అవసరమైనప్పుడు ఇవ్వడం లేదని, 15 రోజుల్లో బిల్స్ క్లియర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా చేయడం లేదని, ఏప్రిల్ నుంచి 650కోట్లు కేటాయించి 16 నెలల్లోకా పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పి ఐదుకోట్ల ను కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు!
కరువు భత్యాలను కలుపుకొని 51శాతం ఫిట్ మెంట్ తో వేతన సవరణను ప్రకటించాలని, ఏప్రిల్ మే నెలలో సాధారణ బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ ను రద్దుచేయాలని, స్థానికత ప్రాతిపదికన అదనపు పోస్టులు సృష్టించి 317 జీవో అమలు చేయాలని, వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన శివ శంకర్ కమిటీ గడువు పూర్తయినా ప్రభుత్వం నివేదిక తెప్పించుకోలేదని మండిపడుతున్నారు.
ఈ నెల 15న నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు, మే 9న మహాధర్నా, రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్, సామూహిక సెలవులకు సిద్ధమవుతున్నారు. వీటిని అనువుగా మలుచుకోవాలని బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ నేతలకు ఫోన్లు చేసి మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిపించుకొని మాట్లాడటం చర్చకు దారితీసింది. స్వామిగౌడ్, దేవీ ప్రసాద్ , శ్రీనివాస్ గౌడ్ లతో ప్రత్యేకంగా భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న వివరించేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే 73శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన, ఈహెచ్ఎస్, సాధారణ బదిలీలు చేసిన అంశాన్ని మరోసారి ఉద్యోగులకు వివరించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. వారు చేపట్టే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని భావిస్తుంది. గతంలో బీఆర్ఎస్ పై ఉద్యోగుల్లోని వ్యతిరేకతను తుడిచివేసేందుకు సిద్దమవుతుంది. ఫ్రెండ్లీ గవర్నమెంట్ నిర్వహించి సమస్యలను పరిష్కరించామని, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వేతనాలు పెంచామనే విషయాన్ని మరోసారి వివరించాలని ఇప్పటికే పార్టీలోని ఉద్యోగ నేతలకు సూచించినట్లు సమాచారం.
Also Read: Chamala Kiran: కేటీఆర్‌కు మైండ్ దొబ్బింది.. చామల షాకింగ్ కామెంట్స్
ఉద్యోగులు ఉద్యమకాలంలో రాష్ట్ర సాధనకోసం అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. జేఏసీగా ఏర్పడి ఉద్యమబాట పట్టాయి. నిరసనలతో హోరెత్తించారు. ఐక్యంగా రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించారు. ఇప్పుడు సమస్యలపైనా అదే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేసి సాధించాలని వారిలో చైతన్యం తేవాలని భావిస్తుంది. వారికి అండగా ఉండేందుకు సిద్ధమవుతుంది.
అంతేగాకుండా నాడు ఉద్యమసమయంలో పనిచేసిన యాక్టీవ్ నేతలకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కీలక పదవులను సైతం వివరించనుంది. వారితోనే ఉద్యోగ సమస్యలపై మాట్లాడించాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టించేందుకు సిద్ధమవుతుంది. ఒక వైపు ప్రజాసమస్యలపై, మరోవైపు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటానికి ప్రణాళికలు రూపొందిస్తుంది.